భారత్ అంత సాయం చేసినా…మాల్దీవుల డబుల్ గేమ్!

గ్లోబల్ పాలిటిక్స్ లో సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఇప్పుడు ఒక పెద్ద చదరంగం నడుస్తోంది. వ్యూహాత్మకంగా భారత్‌కు అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న మాల్దీవులు.. ఇప్పుడు ప్రమాదకరమైన డబుల్ గేమ్ ఆడుతోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అధికారంలోకి రాగానే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాల్దీవుల ప్రజలను రక్షించడానికి భారత్ పంపిన హెలికాప్టర్లను నడిపే సైనిక సిబ్బందిని వెనక్కి పంపించి వివాదానికి తెరలేపారు. ఆ తర్వాత మాల్దీవుల ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోవడం, టూరిజం దెబ్బతినడంతో దారికొచ్చి.. నెమ్మదిగా భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేశారు. భారత్ కూడా పెద్దన్న పాత్ర పోషించి ఆర్థిక సాయం అందించింది. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో, ముయిజ్జు తన తాజా పర్యటనతో ఇండియాకు పెద్ద షాక్ ఇచ్చారు. ఒకవైపు భారత్‌తో స్నేహం నటిస్తూనే, మరోవైపు దాయాది దేశం పాకిస్థాన్‌తో సీక్రెట్ డీల్స్ కుదుర్చుకుంటూ డబుల్ గేమ్స్ ఆడుతున్నారు .
అక్టోబర్ 20 నుంచి 22 వరకు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు పాకిస్థాన్‌లో అధికారికంగా పర్యటించారు. గత 11 ఏళ్లలో ఒక మాల్దీవుల అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన వేళ ఈ పర్యటన జరగడం విశేషం. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ముయిజ్జు జరిపిన చర్చల అనంతరం.. ఇరు దేశాల మధ్య ఏకంగా 20 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం లాంటి సాధారణ అంశాలతో పాటు.. అత్యంత వ్యూహాత్మకమైన రక్షణ, సముద్ర భద్రత , పోలీసింగ్ లాంటి సున్నితమైన రంగాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య కేవలం 1.3 కోట్ల డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, రాబోయే రెండేళ్లలో 20 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇది వినడానికి బాగానే ఉన్నా.. అసలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ప్రపంచానికి తెలిసిన విషయమే. మరి అలాంటి దేశం మాల్దీవులకు వ్యవసాయం, పర్యాటకం లాంటి రంగాల్లో ఏమి సాయం చేయగలదు? అనే అనుమానం రాక మానదు. ఈ వాణిజ్య ఒప్పందాలన్నీ కేవలం ఒక ముసుగు మాత్రమే. దీని వెనుక ఉన్న అసలు టార్గెట్ రక్షణ, సముద్ర భద్రతా ఒప్పందాలు. ఇండియాను ఇరిటేట్ చేయడానికి పాకిస్థాన్ వేసిన ఎత్తుగడకు, ముయిజ్జు సులభంగా ఆకర్షితుడయ్యారనే టాక్ వినిపిస్తోంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ముయిజ్జు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం, సైనిక శిక్షణ లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్థాన్ సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని ముయిజ్జు ప్రశంసించడం ఒక రకంగా భారత్‌ను రెచ్చగొట్టడమే. భారత ప్రధాన భూభాగానికి, ముఖ్యంగా మన లక్షద్వీప్ దీవులకు మాల్దీవులు కేవలం 76 నాటికల్ మైళ్ల దూరంలో ఉంటుంది. మన దేశ భద్రతకు, వాణిజ్య సముద్ర మార్గాలకు ఇది చాలా కీలకం. అలాంటి దేశం ఇప్పుడు ఉగ్రవాదానికి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్‌తో రక్షణ సంబంధాలను విస్తరించడం అత్యంత ప్రమాదకరం. గత కొన్నేళ్లుగా మాల్దీవుల్లో మత ఛాందసవాదం విపరీతంగా పెరుగుతోంది. ISI లాంటి ఉగ్రవాద సంస్థలకు మాల్దీవుల నుంచి చాలా మంది యువకులు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు పాక్ ఆర్మీతో శిక్షణ పేరుతో ఐఎస్ఐ ఏజెంట్లు మాల్దీవుల్లో అడుగుపెడితే.. అది నేరుగా భారత అంతర్గత భద్రతకే అతిపెద్ద ముప్పుగా మారుతుంది. మాల్దీవులు , పాకిస్థాన్ సడెన్ గా ఇంత క్లోజ్ అవ్వడం వెనుక ఇంకొక బలమైన కారణం చైనా. అటు మాల్దీవుల్లో కూడా ముయిజ్జు ప్రభుత్వం మొదటి నుంచి ప్రో-చైనా స్టాండ్ తీసుకుంటోంది. చైనా అప్పుల ఉచ్చులో మాల్దీవులు ఇప్పటికే కూరుకుపోయింది. భారత్ ను నలుదిక్కులా సముద్ర మార్గాల ద్వారా చుట్టుముట్టేందుకు చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీలంకలో హంబన్‌తోట పోర్ట్, పాకిస్థాన్ లో గ్వాదర్ పోర్ట్ లను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మాల్దీవుల్లో నేరుగా చైనా సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తే భారత్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలుసు. అందుకే తన ప్రాక్సీ దేశమైన పాకిస్థాన్‌ను ముందుపెట్టి, మాల్దీవులతో ఈ రక్షణ ఒప్పందాలు చేయిస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ పర్యటనలో ముయిజ్జు మరో సంచలన ప్రతిపాదన చేశారు. గత పదేళ్లుగా మూలన పడిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం, సార్క్ కూటమిని తిరిగి క్రియాశీలం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 తర్వాత ఈ కూటమి మళ్లీ సమావేశం కాలేదు. 2016లో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సమ్మిట్ ను.. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ బహిష్కరించింది. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇండియా తేల్చి చెప్పింది. ఇప్పుడు మళ్లీ సార్క్ పేరుతో భారత్‌ను ఇరుకున పెట్టాలని పాకిస్థాన్, మాల్దీవులు ప్లాన్ చేస్తున్నాయి. ఇక పాక్ ప్రధాని షరీఫ్ ఈ వేదికను వాడుకుని జమ్మూ కశ్మీర్ , సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ అజెండాను రుద్దే ప్రయత్నం చేశారు. సింధు జలాల సరఫరాలో ఇండియా ఏమాత్రం జోక్యం చేసుకున్నా, దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని షరీఫ్ హెచ్చరించారు. అయితే, కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వ్యాఖ్యలకు ముయిజ్జు బహిరంగంగా మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం. ఇండియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ముయిజ్జు ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారని స్పష్టమవుతోంది. ఒకవైపు నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీతో మాల్దీవులకు ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ ఎంతో సహకరిస్తోంది. కానీ ముయిజ్జు ప్రభుత్వం మాత్రం అవకాశవాద రాజకీయాలు చేస్తూ పాకిస్థాన్, చైనాలతో వ్యూహాత్మక బంధాన్ని పెంచుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు హిందూ మహాసముద్రం భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది మనం వేచి చూడాల్సిందే.



