సముద్రంలో భారత్ మహాశక్తి.. నేవీలోకి 8 పవర్ఫుల్ వార్‌షిప్స్!

మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో అగ్రరాజ్యాలన్నీ ఇప్పుడు సముద్ర జలాలపై పట్టు సాధించడం మీదే పూర్తి దృష్టి పెట్టాయి. ప్రపంచ వాణిజ్యంలో అత్యధిక శాతం జరిగే హిందూ మహాసముద్రం.. ఇప్పుడు చైనా, భారత్ మధ్య ఒక పెద్ద కోల్డ్ వార్ కు వేదికగా మారింది. స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహంతో పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్ట్, శ్రీలంకలోని హంబన్‌తోట పోర్ట్ లాంటి వాటిని చేజిక్కించుకుని చైనా నౌకాదళం భారత్‌ను చుట్టుముట్టే భయంకరమైన ప్రయత్నం చేస్తోంది. అయితే శత్రువుల ఆట కట్టించడానికి, హిందూ మహాసముద్రంలో పూర్తి ఆధిపత్యం సాధించడానికి భారత్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత నౌకాదళ బలాన్ని వంద రెట్లు పెంచడమే లక్ష్యంగా ఈ భారీ రక్షణ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత్ కార్వెట్లతో నావికాదళాన్ని మరింత శక్తివంతం చేస్తోంది. పరిమాణంలో భారీ నౌకల కంటే కాస్త చిన్నవిగా ఉండి, అత్యంత వేగంగా ప్రయాణించే శక్తివంతమైన యుద్ధనౌకలు ఇవి. భారీ నౌకలు సులభంగా వెళ్లలేని సముద్ర తీరప్రాంతాల్లోకి ఇవి చాలా వేగంగా చొచ్చుకుపోతాయి. తీరప్రాంత రక్షణ, నిఘా, శత్రు నౌకల కదలికలపై నిరంతరం పహారా కాయడానికి వీటిని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా.. తమ పరిమాణానికి మించిన ఎన్నో రకాల అత్యాధునిక క్షిపణులను, సెన్సార్లను మోసుకెళ్లగలవు. ఇప్పుడు మన నేవీ కోసం రూపుదిద్దుకోబోయే ఈ 8 కొత్త తరం కార్వెట్లు ఒక్కొక్కటి దాదాపు 2,000 టన్నుల బరువుతో నిర్మితమవుతాయి. గంటకు 30 నాట్ల అంటే సుమారు 55 కిలోమీటర్ల వేగంతో ఇవి అలలను చీల్చుకుంటూ సముద్రంలో దూసుకుపోగలవు.ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన, శత్రువులను వణికించే పదం స్టెల్త్ . ఇండియన్ నేవీ డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ సొంతంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ స్టెల్త్ డిజైన్ కారణంగా, ఈ 8 కార్వెట్లు అదృశ్య నౌకల్లా పనిచేస్తాయి. నౌక ఆకారాన్ని కోణీయంగా నిర్మించడం వల్ల, రాడార్ కిరణాలను గ్రహించే ప్రత్యేకమైన పెయింట్ వేయడం వల్ల ఈ నౌకలు శత్రువుల రాడార్ స్క్రీన్‌పై చాలా చిన్న చేపల పడవల్లాగా , పక్షుల్లాగా కనిపిస్తాయి. దీనివల్ల ఇవి శత్రువుల కళ్లుగప్పి వారికి అత్యంత సమీపంలోకి వెళ్లి మెరుపుదాడులు చేయగలవు.
ఈ నెక్స్ట్-జెనరేషన్ కార్వెట్లు ఆల్ రౌండ్ దాడి చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆకాశంలో ఉన్న శత్రు విమానాలను, డ్రోన్లను కూల్చేయడానికి వీటిలో సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ ఉంటాయి. నీటిపైన ప్రయాణించే శత్రు యుద్ధనౌకలను నాశనం చేయడానికి బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక యాంటీ-షిప్ క్షిపణులు ఉంటాయి. నీటి లోపల సైలెంట్ గా దాగి ఉండి దాడి చేయాలని చూసే సబ్మెరైన్లు ట్రేస్ చేయడానికి అత్యాధునిక సోనార్ సిస్టమ్స్, వాటిని నాశనం చేయడానికి టార్పెడోలు ఇందులో అమర్చుతారు. ఇంతటి విపరీతమైన మల్టీ-రోల్ ఫైర్ పవర్ ఈ 8 కార్వెట్‌లకు సొంతం. ఈ 40వేల కోట్ల భారీ ప్రాజెక్ట్ మన దేశ రక్షణకే కాదు, ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పెద్ద బూస్ట్ లాంటిది. ఈ నౌకల నిర్మాణంలో 70 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని, మన దేశంలో తయారైన వస్తువులనే ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్, సాగర్ విజన్‌కు ఇది మరింత బలాన్ని ఇస్తుంది. ఈ 8 నౌకలను కలకత్తాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ , గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. దీనివల్ల ఈ రెండు ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్‌ల ఆర్డర్ బుక్ బలోపేతం అవ్వడమే కాకుండా, వీటికి స్టీల్, కేబుల్స్, సెన్సార్లు, ఇతర విడిభాగాలు సప్లై చేసే మన దేశంలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల పనులు లభిస్తాయి. తద్వారా రాబోయే పదేళ్ల పాటు వేలాది మంది ఇంజనీర్లకు, కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి.
ఈ ఎనిమిది యుద్ధనౌకల నిర్మాణ ప్రక్రియ ఒప్పందాలు పూర్తయిన ఏడాది లోపే ప్రారంభం కానుంది. ఇందులో మొదటి నౌకను 2030 నాటికి పూర్తి స్థాయిలో పరీక్షించి భారత నౌకాదళానికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రతి ఏడాది లేదా రెండేళ్లకు ఒకటి చొప్పున మిగిలిన నౌకలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఇండియన్ నేవీ వద్ద ఉన్న ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ఫ్రిగేట్లు, విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్లు, విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు ఈ 8 స్టెల్త్ కార్వెట్లు తోడైతే భారత నౌకాదళానికి హిందూ మహాసముద్రంపై తిరుగులేని శక్తి లభిస్తుంది. డ్రాగన్ కంట్రీ చైనా కానీ, పాకిస్థాన్ కానీ మన జలాల్లోకి చొరబడాలంటే కచ్చితంగా వణికిపోవాల్సిందే. ఆ స్థాయిలో మన నావికాదళం ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది.



