హైదరాబాద్ టీ20లో భారత్కు ఓటమి.. వెస్టిండీస్ ఘన విజయం.. సిరీస్ 2-2తో సమం!
కామెంట్లు (0)

వెస్టిండీస్ జట్టు టీ20 ఫార్మాట్లో తమ సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో విండీస్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకోవాలని బరిలోకి దిగిన టీమిండియాకు ఈ ఓటమి నిరాశను మిగిల్చింది. ఈ విజయంతో వెస్టిండీస్ సిరీస్ను 2-2తో సమం చేసింది. దీంతో చివరి మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడటంతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ముఖ్యంగా షై హోప్, రూథర్ఫర్డ్ చివరి వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు.
వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 102 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు హెట్మేయర్ 12 బంతుల్లో 33 పరుగులు చేయగా, రోవ్మన్ పావెల్ 17 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. చివర్లో రూథర్ఫర్డ్ 26 బంతుల్లో 49 పరుగులతో చెలరేగి విండీస్ స్కోరును 247 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
భారత బౌలర్లు ఈ మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ అగర్వాల్ నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. అర్ష్దీప్ సింగ్ కూడా నాలుగు ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించగా, అక్షర్ పటేల్ 45 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. నమన్ ధీర్ ఒకే ఓవర్లో 19 పరుగులు ఇవ్వగా, నితీష్ కుమార్ రెడ్డి మూడు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకున్నాడు.


