పైలట్లు వచ్చే వరకు ఆగని ట్రంప్.. ఆ రాత్రి ఇరాన్లో ఏం జరిగింది?

2025 జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడిలో పాల్గొన్న అమెరికా బీ-2 బాంబర్ పైలట్లు, 'ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాధారణంగా రహస్య సైనిక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది సురక్షితంగా స్థావరాలకు చేరుకునే వరకు ఆ వివరాలు గోప్యంగా ఉంచుతారు. అయితే, తమ విమానాలు ఇంకా మార్గమధ్యంలో గాల్లో ఉండగానే, భద్రతా నియమాలను పక్కనపెట్టి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ఆపరేషన్ వివరాలను బహిర్గతం చేశారని పైలట్లు స్వయంగా తెలిపారు.
2025 జూన్ 22వ తేదీ ఆ రోజు అమెరికా తూర్పు వైపు నుంచి బయలుదేరిన అత్యంత శక్తిమంతమైన బీ-2 స్పిరిట్ బాంబర్ విమానాలు దాదాపు 18 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణించి ఇరాన్ సమీపానికి చేరుకున్నాయి. సుదీర్ఘ ప్రయాణం తర్వాత తాము ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపానికి చేరుకున్నట్లు పైలట్లు గుర్తించారు. ఆ తర్వాత 30 వేల పౌండ్ల బరువుండే రెండు భారీ బంకర్ బస్టర్ బాంబులను టార్గెట్ పై వదిలారు. బాంబులు భూమిని తాకిన సరిగ్గా 15 సెకన్ల తర్వాత భూగర్భంలో జరిగిన భారీ విస్ఫోటనంతో దాదాపు 10 అంతస్తుల ఎత్తులో ఒక మహా అగ్నిగోళం ఆకాశంలోకి ఎగసిపడింది. ఆ కారుచీకటి అర్ధరాత్రిలో చుట్టుపక్కల ఉన్న భారీ పర్వతాలన్నీ ఆ మంటల వెలుగులో పట్టపగలులా స్పష్టంగా కనిపించాయని ఆ దాడిలో పాల్గొన్న పైలట్లు తమ ఇంటర్వ్యూలో వివరించారు. ఇరాన్ ఫోర్డోలో పర్వతాల కింద అత్యంత రహస్యంగా అణు కేంద్రాన్ని నిర్మించిందని అమెరికా ఏకంగా 2009లోనే గుర్తించింది. అప్పటి నుంచి దాన్ని ఎలా ధ్వంసం చేయాలన్న దానిపై అమెరికా రక్షణ నిపుణులు ఏళ్ల తరబడి కసరత్తు చేస్తూనే ఉన్నారు. అమెరికా పక్కా ప్లాన్ వేసింది. అయితే సరిగ్గా దాడికి కొద్ది రోజుల ముందే ఇరాన్ ప్రమాదాన్ని పసిగట్టి ఆ వెంటిలేషన్ షాఫ్ట్లన్నింటిపైనా దట్టమైన కాంక్రీట్ పొరను వేసినట్లు అమెరికా శాటిలైట్లు గుర్తించాయి. దాడి సమయంలో ముందుగా ఆ కాంక్రీట్ కవచాన్ని పగలగొట్టడం అత్యంత కీలకంగా మారింది. దీంతో ఏళ్ల తరబడి సిద్ధం చేసిన అమెరికా ప్లాన్ మొత్తం చివరి నిమిషంలో మారిపోయింది.
దాడికి కొన్ని గంటల ముందు వరకు బాంబుల అమరికలో, వ్యూహంలో మార్పులు చేర్పులు చేశారు. ఇరాన్ రాడార్లను, ప్రపంచ నిఘా వర్గాలను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికి వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి ఏడు బీ-2 బాంబర్లు తూర్పు వైపుగా రహస్యంగా ఇరాన్ దిశగా బయలుదేరాయి. అదే సమయంలో ప్రపంచం దృష్టిని మళ్లించడానికి, మరికొన్ని బీ-2 బాంబర్ విమానాలను పశ్చిమ దిశగా హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా వైపు పంపించారు. అందరూ డియాగో గార్సియా వైపు వెళ్లిన విమానాలనే గమనిస్తూ ఉండగా, అసలైన ఏడు బాంబర్లు మాత్రం సైలెంట్‌గా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించాయిఇజ్రాయెల్, అమెరికా ఫైటర్ జెట్ విమానాలు సంయుక్తంగా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ ముందే ధ్వంసం చేసి పెట్టాయి. ఆకాశంలో ఇరాన్ రక్షణ కవచం కుప్పకూలిపోవడంతో, బీ-2 బాంబర్లకు మార్గం పూర్తిగా సుగమమైంది. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన మొత్తం ఏడు బీ-2 బాంబర్లలో ఆరు విమానాలను ఫోర్డో అణు కేంద్రం కోసం కేటాయించగా, మరో ఒక విమానం నతాంజ్ అణు కేంద్రం దిశగా దూసుకెళ్లింది. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల 10 నిమిషాలకు తొలి బాంబు ఇరాన్ భూభాగాన్ని తాకింది. ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా, ఈ తొలి దాడి వెంటిలేషన్ షాఫ్ట్లపై ఇరాన్ వేసిన కాంక్రీట్ లేయర్‌ను ధ్వంసం చేశారు. ఆ వెంటనే మిగిలిన ఐదు విమానాల్లోని బంకర్ బస్టర్లు ఒకదాని తర్వాత ఒకటి అదే రంధ్రం గుండా లోపలికి దూసుకెళ్లి ఫోర్డో భూగర్భ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి.
ప్రతి విమానానికి తన లక్ష్యంపై దాడి చేయడానికి కేవలం 15 సెకన్ల సమయం మాత్రమే లభించింది. ఆ 15 సెకన్లలోనే కచ్చితత్వంతో బాంబులు వదిలి వెనక్కి తిరగాలి. ఈ మొత్తం ఆపరేషన్‌లో అమెరికా ప్రయోగించిన 14 బంకర్ బస్టర్ బాంబుల బరువు ఏకంగా 190 మెట్రిక్ టన్నులు. దాడి విజయవంతంగా పూర్తి చేసినట్లు పైలట్లు తమ ఉన్నతాధికారులకు సందేశం పంపారు. అనంతరం వారు వెనక్కి వస్తూ, తిరుగు ప్రయాణంలో ఆకాశంలోనే విమానాలకు ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో, తమ ఆపరేషన్ వివరాలను అధ్యక్షుడు ట్రంప్ అప్పుడే ప్రపంచానికి బహిర్గతం చేసినట్లు పైలట్లకు తెలిసింది. శత్రు ప్రాంతం దాటి పూర్తిగా బేస్‌కు చేరకముందే అధ్యక్షుడు దాడిని ప్రకటించడం ఆ పైలట్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విజయంపై క్రెడిట్ తీసుకోవాలనే తొందరలో.. పైలట్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకోకముందే ట్రంప్ ఆ రహస్య ఆపరేషన్‌ను బహిర్గతం చేయడం మాత్రం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.



