ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్.. సీఎస్కే కీలక ప్రకటన..మెంటార్ గా కొత్త బాధ్యతలు..!

గత రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో కోట్లాది మందిని తన ఆటతోనే కాకుండా కెప్టెన్ కూల్ గా ఎందరో ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ ఇక ఆటగాడిగా గ్రౌండ్ లో చూడలేం. 2014 డిసెంబర్ 30న టెస్టు క్రికెట్ కు ఆ తర్వాత వన్డే అంతర్జాతీయ క్రికెట్ కు 2020 ఆగష్టు 15న రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించిన ధోని. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అయినా చూడొచ్చని అభిమానులు భావించేవారు. అయితే ఇప్పుడిక ధోనీ ఆటగాడిగా ఐపీఎల్ కు కూడా వీడ్కోలు చెప్పేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఇక మెంటార్ గా సేవలందించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే తారసపడే అరుదైన ఆటగాడు. ఒక కొత్త బాధ్యత. శాశ్వతంగా నిలిచిపోయే బంధం. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెంటార్‌గా మహేంద్ర సింగ్ ధోనీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో విజయాలు, సవాళ్లతో కూడిన సమయాలు, మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకాలతో మా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుండి ధోనీ మా గుండెల్లో నిలిచి ఉన్నారు. మమ్మల్ని గెలుపు బాటలో నడిపించడం నుండి, తర్వాతి తరం సూపర్ కింగ్స్‌కు మార్గనిర్దేశం చేయడం వరకు.. 'ధోనీ' ఎప్పటికీ తమ గుర్తింపులో ఒక భాగమే అని చెన్నై ఎల్లప్పుడూ ఆయన సొంత ఇల్లు అంటూ భావోద్వేగ ప్రకటన చేసింది.
ధోని నాయకత్వంలో చెన్నై 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించింది. 2010, 2011, 2018, 2021, 2023లలో టైటిల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ కు మించి చెన్నైను రెండు ఛాంపియన్స్ లీగ్స్ లో కూడా విజేతగా నిలిపాడు. 2010, 2014లలో టైటిల్స్ సాధించింది. 10 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది. ఇలా అత్యుత్తమ జట్టుగా తన ఆధిపత్యాన్ని కనబరిచింది.



