సేమ్ టు సేమ్ మాస్టర్ ప్లాన్! పార్టీ పేరు ఫిక్స్? ధనుష్ సంచలన నిర్ణయం!
కామెంట్లు (0)

సినిమా ఇండస్ట్రీకి, తమిళనాడు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంటుంది. లెజెండరీ ఎంజీఆర్ దగ్గరి నుంచి కరుణానిధి, జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్, రీసెంట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్న దళపతి విజయ్ వరకు.. సినిమా స్టార్లు రాజకీయాలను శాసించడం తమిళనాట ఆనవాయితీగా వస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీతో ఇప్పుడు తమిళ రాజకీయాలు హీటెక్కిన వేళ, ఆ సీఎం కుర్చీపై కన్నేస్తూ మరో అగ్ర హీరో, కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ కూడా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. తన పుట్టినరోజు వేడుకలు కావచ్చు, సినిమా ఈవెంట్స్ కావచ్చు.. ఎప్పుడూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయే ధనుష్, ఇప్పుడు సడెన్‌గా తన అభిమాన సంఘం విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దశాబ్దాలుగా ఉన్న తన ఫ్యాన్స్ క్లబ్ పేరును మారుస్తూ, కొత్త లోగోను, కొత్త జెండాను అధికారికంగా ప్రకటించాడు.
తాజాగా కోయంబత్తూర్‌లో ధనుష్ అభిమాన సంఘాల ముఖ్య కార్యనిర్వాహకులతో ఒక భారీ రహస్య సమావేశం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత ఒక సంచలన ప్రకటన బయటకు వచ్చింది. ఇన్నాళ్లుగా ఉన్న ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ క్లబ్ పేరును మారుస్తూ, ఇకపై దాన్ని ధనుష్ నర్పాణి ఇయక్కం గా పునర్నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో చెప్పాలంటే.. దీన్ని ధనుష్ సంక్షేమ ఉద్యమం అని పిలుస్తారు. అంటే కేవలం హీరో కోసం అరిచే ఒక అభిమాన సంఘంలా కాకుండా, ప్రజల్లోకి వెళ్లి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసే ఒక సేవా సంస్థగా దీన్ని మార్చేశారు. దీంతో పాటే ఒక కొత్త జెండాను, లోగోను కూడా లాంచ్ చేశారు. ఈ లోగో చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. చుట్టూ ఎరుపు , తెలుపు రంగుల బోర్డర్ ఉండి, మధ్యలో ఒక పెద్ద ఎర్రటి నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం మధ్యలో ధనుష్ రెండు చేతులు జోడించి ప్రజలకు నమస్కరిస్తున్నట్లు ఒక ఇమేజ్ ఉంటుంది. పేరు మారింది, కానీ మా ఉద్దేశం మారలేదు.. సేవే మా లక్ష్యం అంటూ ధనుష్ నర్పాణి ఇయక్కం తమ అఫీషియల్ సోషల్ మీడియా ద్వారా ఈ లోగోను ప్రజల్లోకి వదిలింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ధనుష్ తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే ప్రతి ఒక్కరికీ దళపతి విజయ్ గుర్తుకు వస్తున్నాడు. ఎందుకంటే, విజయ్ కూడా తన పొలిటికల్ ఎంట్రీకి ముందు అచ్చం ఇదే మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. మొదట తన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కం గా మార్చాడు. వాళ్ల ద్వారా ఊరూరా అన్నదానాలు, రక్తదానాలు, పేద విద్యార్థులకు సాయం లాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి, ఆ తర్వాత సరైన సమయంలో తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించి బరిలోకి దిగాడు. ఇప్పుడు సరిగ్గా ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కోయంబత్తూర్ మీటింగ్‌లో అభిమాన సంఘాల మెంబర్షిప్ డ్రైవ్‌ను విపరీతంగా పెంచాలని, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయాలని కింది స్థాయి క్యాడర్‌కు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. విజయ్ సీఎం కుర్చీని టార్గెట్ చేసినట్లే, కోలీవుడ్‌లో మంచి మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ ఉన్న ధనుష్ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని చాలా సైలెంట్‌గా, పక్కా ప్లానింగ్‌తో మొదలుపెట్టాడని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈ అభిమాన సంఘం పేరు మార్పునకు కొన్ని రోజుల ముందే.. సోషల్ మీడియాలో మరో పెద్ద వార్త హల్చల్ చేసింది. ధనుష్ ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఒక రాజకీయ పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించేశాడని ఒక న్యూస్ వైరల్ అయింది. ఆ పార్టీ పేరు తమిళగ ఎళుచ్చి కళగం అంటే తెలుగులో తమిళనాడు అభ్యుదయ పార్టీ అని అర్థం వస్తుంది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, ధనుష్ టీమ్ వెంటనే అప్రమత్తమై ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర అలాంటి పార్టీ పేరు ఏదీ రిజిస్టర్ చేయలేదు. ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. మా అభిమాన సంఘాల నెట్వర్క్ ప్రస్తుతం కేవలం సంక్షేమ కార్యక్రమాల మీదే దృష్టి పెడుతోంది. ఒకవేళ భవిష్యత్తులో ధనుష్ ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, ఆయనే స్వయంగా అభిమాన సంఘాల నిర్వాహకులను పిలిచి మాట్లాడి, అప్పుడు బహిరంగ ప్రకటన చేస్తారు అని ధనుష్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అంటే ఇక్కడ ధనుష్ పాలిటిక్స్‌లోకి రాను అని డైరెక్ట్‌గా ఖండించలేదు.. ప్రస్తుతానికి లేదు, భవిష్యత్తులో వస్తే నేనే చెప్తా అన్నట్లుగా ఒక హింట్ అయితే ఇచ్చాడు. అంటే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాక, ఎలక్షన్స్ టైం దగ్గర పడినప్పుడు ఆయన నుంచి పొలిటికల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ గట్టిగానే ఉంది.



