
Super Star Krishna epic journey: ఆనాటి టాలీవుడ్ పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలకే పరిమితమైన వేళ.. కౌబాయ్, గూఢచారి లాంటి స్పై జోనర్ ను పరిచయం చేశారు. నటుడిగానే కాక నిర్మాతగా దర్శకత్వ ప్రతిభను చూపి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. విజయ నిర్మలతో కలిసి దాదాపు 48 చిత్రాల్లో హీరోగా నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు.
దాదాపు 50ఏళ్ల సినీ కెరీర్ లో 350 చిత్రాలు చేసి ఓ వెలుగు వెలిగిన ధృవతార.. ఘంటమనేని కృష్ణ గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత, సినీ విశేషాలివిగో..
1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెంలో జన్మించారు కృష్ణ.. ఘట్టమనేని రాఘవయ్యచౌదరి, నాగరత్నమ్మ తల్లిదండ్రులు. అసలు పేరు శివరామకృష్ణమూర్తి. ఐదుగురిలో పెద్దవాడు ఇతడే. తెనాలి హైస్కూల్‌లో పదోతరగతి చదివారు. ఆ తర్వాత ఏలూరులో సి.ఆర్.రెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, ఇంజనీరింగ్‌లో సీటు రాకపోవడంతో సినిమాల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తెనాలికి చెందిన నటుడు జగ్గయ్య, నిర్మాత చక్రపాణి తన తండ్రికి కాస్త పరిచయస్తులు కావడంతో మద్రాస్ నగరంలో అడుగుపెట్టారు.
‘తేనె మనసులు’ కోసం కొత్త నటీనటులు కావాలనే ప్రకటన చూసి, ఫొటోలు పంపించిన కృష్ణకు వారం రోజుల్లోనే మద్రాస్ రమ్మని పిలుపు వచ్చింది. అప్పటికే కృష్ణకు వివాహమై, రమేష్ పుట్టాడు. వారిని ఇంటివద్దే వదిలేసి, మద్రాసుకు వెళ్ళారు. ఆ విధంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో ‘తేనె మనసులు’ సినిమా చేశారు. 1965 మార్చి 31న విడుదలై, పెద్ద విజయాన్ని అందుకున్నాడు.
అనంతరం తీసిన రెండో చిత్రం ‘గూఢచారి 116’ 1966లో విడుదలై, సంచలన విజయం సాధించింది. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రంగా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు మాత్రమే ఆడే బీ, సీ సెంటర్లలో.. కృష్ణ మూడో సినిమాతోనే భారీ సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన్ని అంతా ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’ గా పిలిచేవారు. అది మొదలు ఏడాదికి కనీసం 8 నుంచి 10 చిత్రాల్లో నటిస్తూ ప్రజల్లో ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సృష్టించుకున్నారు.
కృష్ణ, విజయనిర్మలది ప్రేమ వివాహం. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘సాక్షి’ చిత్రంతో వీరిద్దరి కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. కృష్ణ వ్యక్తిత్వాన్ని చూసి ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు విజయ. అలా వీరి స్నేహం బలపడింది.
కానీ అప్పటికే, కృష్ణకు ఇందిరాదేవితో పెళ్లైంది. విజయ నిర్మలకు సైతం పెళ్లైంది. కాకుంటే ఆవిడ సినిమాల్లోకి రావడం భర్తకు ఇష్టం లేదు. అందువల్లే ఇద్దరూ దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడంతో కృష్ణ-విజయ నిర్మలతో కలిసి సినిమాలు చేయడానికి నిర్మాతలు సైతం ముందుకొచ్చారు. ఇద్దరూ కలిసి రెండు మూడు సినిమాలు చేశాక మరింత దగ్గరైపోయారు. కృష్ణకు అత్యంత సన్నిహితుడైన చంద్రమోహన్ వీరి పెళ్లిని రహస్యంగా జరిపించారు. వీరిద్దరికి సంతానం లేరు.
విజయ నిర్మలతో దాదాపు 50 సినిమాలు చేశారంటే అది అరుదైన రికార్డనే చెప్పాలి. జయప్రద, శ్రీదేవి, రాధ వంటి అగ్ర కథానాయికలలో పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. మొత్తంగా 365 చిత్రాల్లో 70 మంది కథానాయికలతో జోడీ కట్టిన ఘనత కృష్ణకు మాత్రమే చెల్లింది.
చిన్నకొడుకు మహేష్ బాబు అంటే కృష్ణకు ప్రాణం. మహేష్ స్కూల్ సెలవు రోజుల్లో తనతో పాటు తీసుకెళ్లి, సినిమాల్లో నటింపజేసేవారు. ఇలా కృష్ణ నటించిన ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘ముగ్గురు కొడుకులు’, ‘శంఖారావం’ వంటి అనేక చిత్రాల్లో మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. మహేష్ నటన, డాన్సులు చూసి తెగ మురిసిపోయేవారు కృష్ణ. Super Star Krishna epic journey.
ఫస్ట్ ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన ‘రాజకుమారుడు’ చూసి తన కొడుకు స్టార్‌గా వెలుగుతాడని సంబరపడ్డారు. తనకు నిత్యస్ఫూర్తి నాన్నేనని పలు సందర్భాల్లో మహేష్ చెప్పారు.
కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్‌బాబు. చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాత అయ్యారు. చిన్న కొడుకు మహేష్ బాబు సూపర్ స్టార్ హీరోగా స్థిరపడ్డాడు. పెద్ద కూతురు పద్మావతి. భర్త ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్.
రెండవ కూతురు మంజుల నటి, దర్శకురాలు, నిర్మాతగా చేస్తోంది. భర్త సంజయ్ స్వరూప్ కూడా నటుడిగా ఉన్నారు. చిన్న కుమార్తె ప్రియదర్శిని. హీరో సుధీర్‌బాబుకు భార్య.
కృష్ణ, ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న ఏడేళ్ళకు తన సహనటి విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే విజయ నిర్మలకు కృష్ణ మూర్తితో పెళ్లై, నరేష్ కూడా పుట్టాడు. అదే సీనియర్ నరేష్ గా పాపులర్ అయి, ప్రస్తుతం తండ్రి పాత్రల్లో అలరిస్తున్నారు. అయితే ఈమె 2019 జూన్ 27న అనారోగ్యంతో మరణించింది.
అలనాటి స్టార్ హీరోల సరసన నిలిచిన కృష్ణ 2022 నవంబర్ 15న కన్నుమూశారు.