
జూన్ 12 తారీఖు ..ఈ డేట్ వస్తుందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలనుకుంటున్న తల్లిదండ్రులను ప్రైవేటు స్కూల్స్ ఫీజుల పేరుతో జలగలా పట్టి పీడిస్తున్నాయి. అక్షరాలు దిద్దించడానికే పేరెంట్స్ లక్షలకు లక్షలు పోస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను అవకాశంగా మలుచుకున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అడ్మీషన్ల ఫీజుల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి.ఒకప్పుడు గ్రామర్, కాన్సెప్ట్ స్కూళ్లు అంటేనే అదేదో బ్రహ్మ పదార్థంలా చూసేవారు. ఇప్పుడు కాన్సెప్ట్ పోయి టాలెంట్, టెక్నో, ఈ-టెక్నో, డీజీ, మోడల్ స్కూల్, ఐఐటీ, జేఈఈ, సివిల్స్ ఫౌండేషన్ అంటూ తల్లిదండ్రులను ఊహాలోకంలోకి తీసుకెళ్లి అడ్మీషన్ల ఫీజుల పేరుతో లూఠీ చేస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు.మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కార్పోరేట్, ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు రాకున్నా.. అనుభవజ్ఞులైన టీచర్లు అసలే లేకున్నా..కనీస వసతులు కల్పించకున్నా.. యథేచ్చగా అడ్మిషన్ల దందాను సాగిస్తున్నాయి. బ్రోచర్లు చూపించి పాతిక వేలతో మొదలుపెట్టి..2లక్షల రూపాయల వరకూ ఫీజుల రూపంలో దండుకుంటున్నారు. నగరంలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు నిబంధనలను పాతరేసి అడ్మిషన్ల దందాను సాగిస్తున్నాయి.
పాఠశాల ఏర్పాటుకు సంబంధించి 24శాఖల నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ముఖ్యంగా భవన్ రిజిస్ట్రేషన్, అగ్నిమాపక శాఖల నుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. మద్యం దుకాణాలు, ప్రార్థనా మందిరాలకు పాఠశాలలు దూరంగా ఉండాలి. అయితే చాలా మంది యాజమాన్యాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా పాఠశాలలను నెలకొల్పుతున్నారు. బీఈడీ, డీఈడీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తిచేయని వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తూ..విద్యాశాఖ ప్రమాణాలను పాటించకుండా..అడ్మిషన్ల దందాను సాగిస్తున్నారు. భవనానికిగాని, స్కూల్‌కు ఎటువంటి అనుమతులు లేకున్నా అడ్మిషన్లను నిర్వహిస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ తరహా పాఠశాలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేకం ఉండగా..వాటిపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.
ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లు ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టగా..విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. నర్సరీ, ఎల్‌కేజీ స్థాయిలోనే కొన్ని స్కూళ్లు లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి. స్కూళ్లకు రకరకాల పేర్లు పెట్టి ఐఐటీ, నీట్ కోచింగ్ ఇస్తున్నామని ఫీజులను దండుకుంటున్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఆచరణకు రావడం లేదు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఫీజుల దోపిడీని నియంత్రిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుండగా.. ఇప్పటివరకు కార్యాచరణ మొదలుకాకపోవడంతో ఈ సంవత్సరం ఆచరణ సాధ్యమయ్యేలా కన్పించడం లేదు. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే చట్టాన్ని చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని, ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేశాక చట్టం చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయం విద్యా శాఖాధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.