
ఆపరేషన్ సిందూర్ మొదలైన తర్వాత భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయ్. దాయాది దేశం పాకిస్తాన్‌తో భీకర పోరు సాగుతున్న వేళ.. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. అందాల పోటీలేంటనే విమర్శలు వెల్లువెత్తాయ్. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లోనే.. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల మన దేశంపై ఉన్న అభిప్రాయమే మారిపోతుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయ్. ముఖ్యంగా.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ డబుల్ అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది.
దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అందాల పోటీలు అవసరమా? అనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. వాయిదా వేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయ్. అయితే.. మిస్ వరల్డ్ పోటీలను పోస్ట్ పోన్ చేయడం పెద్ద పనేం కాదు. దానికి.. పెద్దగా టైమ్ ఏమీ పట్టదు. మరెందుకు.. తెలంగాణ ప్రభుత్వం ఈ సమయంలోనూ అందాల పోటీలను ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది? ముందుగా అనుకున్న షెడ్యూల్ డిస్టర్బ్ అవకుండా.. ఎందుకు నిర్వహించాలనుకుంటోంది? అనే కోణంలోనూ చర్చలు మొదలయ్యాయ్. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. సరిహద్దుల్లో కాల్పులు మోత మోగుతున్న టైమ్‌లో.. దేశం మొత్తం ఓ ఉద్విగ్న వాతావరణం కొనసాగుతున్న వేళ.. హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతున్నాయ్. అది కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా.. మిస్ వరల్డ్ లాంటి ఓ మెగా ఈవెంట్ జరుగుతోందంటే.. ఇండియా ప్రశాంతంగానే ఉంది.. అంతకుమించి సేఫ్‌గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళుతుంది. భారత్‌లో శాంతి ఉందనే సందేశం.. మిగతా ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. అందుకోసమే.. మిస్ వరల్డ్ పోటీలను కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
సరిహద్దుల్లో పాక్ ఎన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా.. ఎన్ని రకాలుగా కవ్వింపు చర్యలకు దిగినా.. కాల్పుల విరణకు ఒప్పుకొని.. మళ్లీ దానిని ఉల్లంఘించినా.. ఈ టెన్షన్స్ అన్నీ.. బోర్డర్ వరకే పరిమితమయ్యాయనే సంకేతం.. మిస్ వరల్డ్ పోటీలతో మిగతా వరల్డ్‌కు అర్థమవుతుంది. భారత్-పాక్ మధ్య నెలకొన్న టెన్షన్స్ కశ్మీర్ బోర్డర్ వరకే ఉన్నాయ్.. మిగతా దేశమంతా ప్రశాంతంగానే ఉందనే సందేశం.. భారత్‌కు ఎంతో ప్లస్ అవుతుందనే చర్చ బలంగా వినిపిస్తోంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా.. మిస్ వరల్డ్ పోటీలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తే.. తెలంగాణతో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇండియా ఎంత సేఫ్‌గా ఉందనే విషయం.. గ్లోబ్ వైడ్‌గా అందరికీ బాగా అర్థమవుతుంది. ఏ అంతర్జాతీయ మీడియాలో భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన వార్తలు ప్రసారమవుతున్నాయో.. అదే ఇంటర్నేషనల్ మీడియాలో.. ఈ మిస్ వరల్డ్ పోటీల కవరేజ్ కూడా వస్తుంది. దాంతో.. వార్ కేవలం బోర్డర్ వరకే ఉందనే విషయం అందరికీ తెలుస్తుంది. మిగతా ఇండియా అంతా.. కూల్‌గానే ఉందనే మెసేజ్ చాలా బలంగా వెళుతుంది. అందుకోసమే.. తెలంగాణ ప్రభుత్వం.. అందాల పోటీలను రాష్ట్ర సంస్కృతి, టూరిజం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే అవకాశంగా చూస్తున్నాయ్. గ్లోబల్ వేదికపై తెలంగాణని ప్రమోట్ చేస్తే.. పరోక్షంగా భారత్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌కి.. ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో.. సర్కార్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా.. పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో డ్రోన్‌లపై నిషేధం విధించింది. పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందాల భామలు ఉండే హోటళ్ల దగ్గర.. నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా పోలీసులను.. భద్రత కోసం రంగంలోకి దించారు. గచ్చిబౌలి స్టేడియంతో పాటు సుందరీమణులు బస చేసే హోటళ్ల దగ్గర షార్ప్ షూటర్లను, స్పైపర్లను మోహరించారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్విక్ రియాక్షన్ టీమ్స్‌ని మోహరించారు. ఇంతటి భద్రత మధ్య మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. హైదరాబాద్‌లో.. ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌ని ఎంతో సేఫ్‌గా నిర్వహించగలరనే సందేశం వెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం సామర్థ్యం కూడా అందరికీ తెలుస్తుంది. ఇప్పటికే.. రాష్ట్ర టూరిజం శాఖ.. తెలంగాణ, జరూర్ ఆనా అనే ట్యాగ్‌లైన్‌తో.. మిస్ వరల్డ్ మెగా ఈవెంట్‌ని.. రాష్ట్రాన్ని గ్లోబల్ డెస్టినేషన్‌గా ప్రమోట్ చేస్తోంది.
గతేడాది తెలంగాణని లక్షన్నర మందికి పైగా.. అంతర్జాతీయ టూరిస్టులు సందర్శించారు. ఈ అందాల పోటీల ద్వారా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని.. యునెస్కో సైట్‌లు, ఆధునిక సౌకర్యాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా.. హైదరాబాద్ ఎంత సేఫ్‌గా ఉందనే విషయం మెసేజ్ అందరికీ వెళుతుంది. పైగా.. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సంప్రదాయ స్వాగతాలు, భద్రతా సిబ్బంది అప్రమత్తత, కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి సౌకర్యాలు.. హైదరాబాద్‌ని సేఫ్ డెస్టినేషన్‌గా.. ప్రొజెక్ట్ చేస్తున్నాయ్. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. మిస్ వరల్డ్ లాంటి మెగా ఈవెంట్‌ని విజయవంతంగా నిర్వహిస్తే.. హైదరాబాద్ సురక్షితమైన నగరంగా.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో.. బెంగళూరు, ముంబైలోనూ.. అందాల పోటీలు సక్సెస్ అయ్యాయ్. ఇది.. ఇండియాకు సానుకూలమైన ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయ్. ఇప్పుడు.. తెలంగాణ గవర్నమెంట్.. ఈ మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్‌ని.. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్‌తో.. రాష్ట్రాన్ని సురిక్షితమైన, ఆతిథ్య గమ్యస్థానంగా చిత్రీకరిస్తోంది. ఈవెంట్ సక్సెస్ అయితే.. ఆటోమేటిక్‌గా గ్లోబ్ వైడ్‌గా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, వార్ మాక్ డ్రిల్స్ నడుస్తున్న సమయంలో.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ.. ఇండియాలో ఆందోళనకరమైన పరిస్థితులు లేని దేశంగా.. యుద్ధ తీవ్రత అంతగా లేని ప్రాంతంగా చూపుతుంది. సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఈవెంట్ కొనసాగుతుండటంతో.. దేశంలో భద్రతా సందేశాన్ని బలపరుస్తుంది. అయితే.. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు.. ఐపీఎల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్. మరి.. ఈ రెండు మెగా ఈవెంట్ల నిర్వహణకు ఉన్న తేడా ఏంటి?
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై.. రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయ్. ఓ వైపు.. ఈ మెగా ఈవెంట్‌ని తెలంగాణని అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేసే అధ్బుతమైన అవకాశంగా చెబుతున్నారు. మరోవైపు.. జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో.. అందాల పోటీల నిర్వహణ కరెక్ట్ కాదనే విమర్శలున్నాయ్. అయితే.. సర్కార్ చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో.. హైదరాబాద్ సురక్షితమైన గమ్యస్థానమనే సందేశాన్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే.. ప్రపంచం మొత్తం ఆసక్తిగూ చూసే ఇలాంటి మెగా ఈవెంట్లు సక్సెస్ కావాలంటే.. భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలి. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం.. ఈ పోటీలపై పడకుండా చూడాలి. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా.. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమైతే.. హైదరాబాద్, తెలంగాణ.. సేఫ్ డెస్టినేషన్ అనే గుర్తింపు వస్తుంది. దాంతో.. భవిష్యత్తులో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించేందుకు.. హైదరాబాదే ఫస్ట్ ఆప్షన్‌గా మారుతుంది. గ్లోబల్ కాన్ఫరెన్స్‌లకు హైదరాబాద్ వేదిక అవుతుంది. పరోక్షంగా.. రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశముంది. అందుకోసమే.. ప్రభుత్వం ఈ ఈవెంట్‌ని సమర్థవంతంగా నిర్వహించి.. సిటీ ఇమేజ్‌ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
అయితే.. ఇదే సమయంలో ఐపీఎల్ ఎందుకు వాయిదా వేశారనే చర్చ కూడా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. అయితే.. ఐపీఎల్ గానీ, మిస్ వరల్డ్ అందాల పోటీలు గానీ.. రెండూ మెగా ఈవెంట్లే. కానీ.. మిస్ వరల్డ్ పోటీలు ఇండోర్ ఈవెంట్. అందువల్ల.. భద్రతాపరంగా రిస్క్ తక్కువనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. జనం కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే.. మిస్ వరల్డ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కానీ.. ఐపీఎల్ అలా కాదు. ఒకే చోట పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది ఒకచోటుకి చేరతారు. పైగా.. సరిహద్దులకు దగ్గరలో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయ్. ఇప్పటికే.. పాకిస్తాన్‌లోని రావల్పిండి స్టేడియంపై భారత ఆర్మీ డ్రోన్‌తో దాడి చేసింది. దాంతో.. బోర్డర్‌కు దగ్గరలో ఉన్న స్టేడియాలకు.. డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉంది. పాక్ ఏ క్షణమైనా.. డ్రోన్లతో దాడి చేయొచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఒక్క డ్రోన్ పేలినా.. భయంతో జనం పరుగులు పెడితే.. తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు డ్రోన్ దాడితో జరిగే నష్టం కంటే.. ఇలా తొక్కిసలాట జరిగితే సంభవించే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే.. ఐపీఎల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశారు. దేశంలో పరిస్థితులు మెరుగయ్యాక, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గాక.. మళ్లీ ఐపీఎల్ మొదలవుతుందని చెబుతున్నారు.
దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయ్, చాలా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణమే కొనసాగుతుందనే సందేశం ఇవ్వడంలో.. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు కొంతవరకు సక్సెస్ అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇందుకు.. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ ఓపెనింగ్ సెర్మనీని.. విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. పైగా.. ఈ ఈవెంట్‌లో 110 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో.. ఫ్లాగ్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించింది. పైగా.. ఈ వెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధునిక, మౌలిక సదుపాయాలను.. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. టూరిజం పరంగా.. ఈ ఈవెంట్ తెలంగాణని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ప్రమోట్ చేస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు.. రాష్ట్రంలోని ప్రముఖ టూరిజం స్పాట్‌లను సందర్శిస్తున్నారు. ఇది.. స్టేట్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈవెంట్‌ని కొనసాగించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కమిట్‌మెంట్ ఏమిటో కూడా అందరికీ తెలిసింది. మొత్తంగా.. మిస్ వరల్డ్ పోటీలను సురక్షితంగా నిర్వహించడంలో.. హైదరాబాద్ సేఫ్ అనే సందేశాన్ని.. అంతర్జాతీయ సమాజానికి సర్కార్ ఇవ్వగలిగింది.