చిరుతిండిలా తినే శనగల్లో.. ఆరోగ్య ప్రయోజనాలున్నాయి!

శనగలు.. ఇవి తెలియనివారు ఉండరు. టైంపాస్ కోసమో.. చిరుతిండిలానో తింటూ ఉంటాం. అయితే మాములుగా శనగలను తినడంతో పోలిస్తే కాల్చిన శనగలను తినడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయని చెబుతున్నారు. అవి..

వేయించిన శనగలలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే వేయించిన శనగలను తీసుకవడం మంచిది. శనగలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి అనేది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ వేయించిన శనగలు తింటూ ఉండటం వల్ల ఇమ్యునిటీ బలపడుతుంది.

శరీరానికి మంచి శక్తి లభించాలంటే వేయించిన శనగలు తినడం మంచి మార్గం. సాధారణంగా పచ్చి శనగలను కూర చేసుకొని భోజనంలో భాగంగా తింటారు. కానీ వాటిని రోజూ వండుకోలేం. అదే వేయించిన శనగలు అయితే రోజూ కొన్ని చొప్పున స్నాక్స్ రూపంలో తినవచ్చు. వేయించిన శనగలలో కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి అమితమైన ఇంస్టాంట్ శక్తిని ఇస్తాయి.

ఇవి మధుమేహ రోగులకు మంచి చేస్తాయి. వేయించిన శనగలను స్నాక్స్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు చిరుతిండిగా వేయించిన శనగలు తీసుకుంటే మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. పైగా ఇప్పట్లో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వేయించిన శనగలలో కేలరీలు చాలా తక్కువ. పైగా ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది.

ఆహారం జీర్ణం కాకపోవడం, మలబద్దకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. వేయించిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా తినవచ్చు.