
365 days Cultivation of vegetables: మార్కెట్లో నిరంతరం కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఏడాదిలో 365 రోజులు కూడా కూరగాయలు అవసరం. ఈ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పంటలు వేస్తే మంచి లాభాలను పొందవచ్చు. 365 రోజులు కూరగాయలు పండించడం అంటే వివిధ రకాల కూరగాయలను ఎప్పటికప్పుడు సాగు చేస్తూ, సీజన్‌లతో సంబంధం లేకుండా మార్కెట్‌లో నిరంతరంగా అందుబాటులో ఉండేలా ఉంచడం. దీని ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుంది. మరి 365 రోజులు సన్న చిన్నకారు రైతులు కూరగాయలను సాగు చేసే ప్రణాళిక ఏంటి? ఒకే పొలంలో విభిన్న పంటలు ఎలా పండించాలి? నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి ఒక నెల నుండి 4 లేదా 5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేవారి దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు చేయాల్సి వస్తుంది. ఒక వేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే… వడ్డీ పెరిగి చేసిన అప్పు తీర్చలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం మనం రోజూ చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడగునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలను సాగు చేసుకుంటే రోజువారీ ఆదాయం అందుతుంది. అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకేవిధమైన నష్టం జరిగినా ఒకటి రెండు పంట రకాలను నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతోకొంత ఆదాయాన్ని పొందవచ్చు.అంతే కాదు ఒకే ప్రాంతంలో ఉండే రైతులందరూ ఒకే పంటను వేయటం వల్ల మార్కెట్లో ధర పడిపోడుతుంది.. పంట కోతకు వచ్చేవరకూ ఆదాయం ఉండదు. ఒకే పంటను వేయడం వల్ల పురుగులు, తెగుళ్ళ సమస్య అధికమవుతుంది. అందుకే రైతులు సంవత్సరం పొడగునా అన్ని కూరగాయలను సాగు చేయాలి.
ఒక రైతుకు ఒక అర ఎకరం పొలం వుంటే ఆ పొలాన్ని 4 అడుగుల వెడల్పు, ఒక అడుగు ఎత్తు 30 అడుగుల పొడవుతో మడులను ఏర్పాటు చేసుకోవాలి. ఒక మడికి ఇంకో మడికి మధ్య నడవటానికి, కలుపు తీయటానికి, సస్య రక్షణ, కోత వంటి పనులకు వీలుగా ఒక అడుగు దూరం ఉంచాలి. ఉన్న మడుల్లో 25శాతం పందిరి లేదా తీగ జాతి కూరగాయలు పెంచుకోవటానికి వీలుగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి. మిగతా 75శాతం మడుల్లో మిగతా కూరగాయలను సాగుచేసుకోవాలి. మడుల్లో 50శాతం ఎర్రమట్టి, 20శాతం పశువుల ఎరువు, 10శాతం కుళ్ళిన పచ్చిరొట్ట ఎరువు, 10శాతం వర్మీ కంపోస్టు, 10శాతం జీవన ఎరువులు వేసుకోవాలి. పొలం చుట్టూ అడుగు దూరంతో 3 వరుసలలో జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం వంటి పంటలను రక్షక పంటలుగా వేసుకుంటే పక్క పొలాల నుండి రసం పీల్చే పురుగుల వలస తగ్గుతుంది. ఈ పంటలకు ముందు ఒక వరుసలో మునగ, కూర అరటి, కరివేపాకు పంటలను 9 అడుగుల దూరంతో వేసుకుంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా అమ్ముకోవచ్చు. అదే పొలంలో సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవటానికి వీలుగా ఒక మూల గుంతను ఏర్పాటు చేసుకొని పంటకాలం పూర్తైన మొక్కలను మడుల్లో నుండి పీకి అవి ఎండిన తర్వాత ఆ గుంతలో వేసుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీటియజమాన్యం చేయటానికి వీలుగా ఒక నీటి ట్యాంకును కూడా సిద్ధం చేసుకోవాలి.
ఒకే కూరగాయ పంటను ఒకే సారి ఒక్క చోటే వేసుకోకుండా తయారు చేసుకొన్న మడుల్లో 3 లేదా 4 చోట్ల కొన్ని రోజుల వ్యవధితో వేయాలి. ఇలా వేయటం వల్ల మొదట వేసిన పంట కోత కాలం పూర్తైన వెంటనే రెండోది కోతకి సిద్ధంగా ఉంటుంది. అలాగే రెండోది పూర్తైన సమయానికి మూడోది, ఆతర్వాత నాలుగోది కోతకు సిద్ధంగా ఉండి ఆ పంట సంవత్సరం పొడవునా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మడుల్లో కూరగాయపంటలను వేసుకున్నపుడు ఒకే పంటగా కాకుండా అంతర పంటలు లేదా మిశ్రమ పంటలు వేసుకుంటే పురుగులు తెగుళ్ళ బెడదను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ఒకే స్థలంలో ప్రతీ సారీ అదే పంటను సాగు చేయకుండా పంట మార్పిడి చేస్తుండాలి. పంట మార్పిడి చేసినపుడు ఒకే కుటుంబానికి చెందిన పంటలను అలాగే ఒకే రకమైన పోషకాలు అవసరమున్న పంటలను ప్రతీ సారీ ఒకే స్థలంలో వేయకూడదు. నేల నుండి పోషకాలు తీసుకునే పంటలను నేలకు పోషకాలు అందించే పంటలైన లేగ్యూం కుటుంబానికి చెందిన చిక్కుడు జాతి పంటలతో పంటమార్పిడి చేసుకోవాలి.
అంతర పంటలు వేసుకున్నపుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. త్వరగా పెరిగే పంటలను నెమ్మదిగా పెరిగే పంటల మధ్యలో వేయాలి. అంటే క్యారెట్, ముల్లంగి వంటి పంటలను టమాట, వంగ వంటి పంటల మధ్యలో అంతర పంటగా వేయాలి. పొడుగ్గా పెరిగే పంటల మధ్యలో పొట్టిగా పెరిగే పంటలను వేయాలి. అంటే టమాట, వంగ, మిరప వంటి పంటల మధ్య ఆకుకూరలు సాగు చేయాలి. లోతైన వేరువ్యవస్థ కలిగిన పంటల మధ్య పైపైన వేర్లు ఉండే పంటలను వేయాలి. అంటే బెండ మధ్యలో ఉల్లి, వెల్లుల్లి పంటలు వేసుకోవాలి. 365 days Cultivation of vegetables.
పురుగులు తెగుళ్ళు ఆశించకుండా పంటను కాపాడుకోవాలి. చీడ పీడలను తట్టుకొనే రకాలనే సాగుకు ఎంపిక చేసుకోవాలి. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. శనగపచ్చ పురుగు నుండి రక్షణ కోసం బంతి వంటి పంటలను ఎర పంటగా వేసుకోవాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పసుపు, నీలం రంగుపూసిన అట్టలను ఎకరాకు 4 నుంచి 5 పెడితే వైరస్ తెగుళ్ళకు వాహకాలుగా పనిచేసే రసం పీల్చే పురుగులు దీనికి ఆకర్షింపబడి వాటి ఉధృతి తెలుస్తుంది. చీడపీడలు ఆశించే మొక్కల భాగాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇలా చేయటం వల్ల మిగతా మొక్కలకు సోకకుండా తీవ్రతను తగ్గించవచ్చు. కీటకాల లార్వాలను తినటానికి వీలుగా పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలను, దీపపు ఎరలను పొలంలో ఏర్పాటు చేయాలి. ఈ ప్రణాళికను అనుసరించటం మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ..రైతు దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మొదట్లో కొన్ని ముఖ్యమైన పంటలతో మొదలు పెట్టి క్రమేపి పెంచుకొంటూ పోతూ ఉంటే ఈ ప్రణాళికను సమర్ధవంతంగా అమలు చేయవచ్చు. ఈ విధంగా కూరగాయ పంటలను సాగు చేయటం వల్ల రైతు ప్రతి రోజూ ఆదాయాన్ని పొంది అప్పుల బాధను అధిగమించవచ్చు.