
Draft Head Syndrome: మీరూ జాగ్రత్త..! మీ పిల్లలు గానీ, మీరు గానీ స్మార్ట్ ఫోన్ లకు ఎక్కువగా అడిక్ట్ అయ్యారా? గంటల తరబడి తలపైకి ఎత్తకుండా అదే పనిగా ఫోన్ చూస్తున్నారా? అయితే జర పైలం.. ఈ అలవాటు గనుక మార్చుకోకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే గంటల తరబడి అలానే చూస్తే చివరికి మెడ పనితీరు దెబ్బతినవచ్చు. తలపైకి ఎత్తే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. తాజాగా ఓ 25 ఏళ్ల యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది.
ఫోన్ చూసి.. చూసీ.. చివరకు మెడ భాగంలో బాగా ఉబ్బడంతో పాటు మెడను కదిలించేందుకు సహకరించే కీళ్లు సైతం దెబ్బతిన్నాయట. చర్మ సంబంధిత కణాలు అధికంగా పేరుకొని, కండరాలు పూర్తిగా పనిచేయకుండా స్తంభించిపోయాయని తేలింది. ఈ అరుదైన స్థితినే వైద్య పరిభాషలో ‘డ్రాఫ్ట్ హెడ్ సిండ్రోమ్’ (DHS)గా పిలుస్తారు. Draft Head Syndrome.
మాసికులర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్ లేదా ఇతర న్యూరోమస్కులర్ రుగ్మతల వల్ల కూడా ఇది రావచ్చు. దీనిబారిన పడినవారు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, సాధారణ బరువును కోల్పోయే ప్రమాదం ఉంది. మెడ కండరాల బలహీనత వల్ల తలను సమానంగా ఎత్తే సామర్ధ్యాన్ని కోల్పోతారు.
పరిష్కారం- నివారణ:
- డాక్టర్లను సంప్రదిస్తే తగిన వైద్యం అందిస్తారు. ఫిజియోథెరపీ ద్వారా మెడ కండరాల్లో బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు.
- తలకు సపోర్ట్ గా ఉండేలా నెక్ కాలర్లు మెడ కండరాలు బలపడే వరకు తాత్కాలికంగా ఉపయోగపడతాయి.
- కండరాల బలహీనతను నివారించే మందులు కొన్ని సూచిస్తారు.
- తీవ్రమైన సందర్భాల్లో, మెటల్ రాడ్లు, స్క్రూలు ఉపయోగించి మెడను కరెక్ట్ చేసే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది.
- ఫోన్ వాడే సమయాన్ని తగ్గించడం.. విరామం ఎక్కువగా తీసుకోవడం..
- కంప్యూటర్ ముందు కూర్చునే భంగిమ సరిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.