
Tennis Player Radhika Yadav: హర్యానాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ అతి దారుణంగా హత్యకు గురైంది. కని పెంచి పెంచి పెద్ద చేసిన తండ్రి దీపక్ యాదవ్ చేతుల్లోనే అత్యంత దారుణంగా చంపబడింది. జులై 10న తన తల్లి బర్త్ డే సందర్భంగా ఆమెను సర్ప్రైజ్ చేయాలని వంట పనిలో నిమగ్నమై ఉన్న రాధికను..ఆమె తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కన్న కూతురినే తండ్రి అత్యంత కిరాతకంగా ఎందుకు చంపాడు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిందితుడు దీపక్ యాదవ్ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. అసలు ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టావని పోలీసులు అతడిని ప్రశ్నించారు. ప్రాథమిక విచారణలో కుతురు గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. తండ్రి చెప్పిన మాటలు విని పోలీసులు విస్తుపోయారు.
గురువారం ఉదయం 10గంటల 30నిమిషాలకు గురుగ్రామ్ లోని సెక్టార్ 57లో ఉన్న బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. హత్య జరిగిన సమయంలో రాధికతో పాటు ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. తల్లి పుట్టిన రోజు కావడం ఆమె జ్వరంతో బాధపడుతుండటంతో…తల్లిని సర్ ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో రాధిక కిచెన్ లో వంట చేస్తోంది. ఇదే ఛాన్స్ గా భావించిన రాధిక తండ్రి దీపక్ వెనుక నుంచి లైసెన్స్ తుపాకీతో ఆమెపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి దూసుకెళ్లాయి. రాధిక చిన్నాన్న కుల్దీప్ యాదవ్ అదే బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు. తుపాకి పేలిన శబ్ధం వినిపించగానే ఆయన పైకి వెళ్లాడు. వంట గదిలో రాధిక రక్తపు మడుగులో పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను కారులో స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. రాధికను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్థారించారు. బాబాయి కుల్దీప్ యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ హత్యకు ఏడాది క్రితమే బీజం పడినట్లుగా తెలుస్తోంది. రాధిక స్థానికంగా ఓ టెన్నిస్ అకాడమీని నడుపుతోంది. దానితో పాటే లాస్ట్ ఇయర్ రాధిక ఒక మ్యూజిక్ వీడియో చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ వీడియో చూసిన ఆమె బంధువులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా రియాక్ట్ అయ్యారు. వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతే కాదు సొంతూరుకి వెళ్లినప్పుడల్లా..కూతురి సంపాదనతో బతుకుతున్నావని అంతా దీపక్ ను హేళన చేయడం అతడికి నచ్చలేదు. మ్యూజిక్ వీడియోపై చాలా సార్లు దీపక్ కు , రాధికకు గొడవలయ్యాయి. అవి అలా కంటిన్యూ అవుతూ వచ్చాయి. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో రాధిక ఇన్కమ్ పెరిగింది. Tennis Player Radhika Yadav.
దీంతో ఆమె పేరెంట్స్ ని లెక్కచేయడం మానేసింది. ఆమె నడుపుతున్న టెన్నిస్ అకాడమీని మూసివేయాలని ఆమెను చాలాసార్లు కోరాడు.అయినా వినలేదు. ఇది దీపక్ ను ఎంతగానో బాధపెట్టింది. దీంతో కూతురిని చంపేయాలని డిసైడ్ అయ్యాడు.ప్లాన్ చేసి లైసెన్స్డ్ రివాల్వర్ బయటకు తీసి గురువారం ఉదయం వంటగదిలో ఉన్న కూతురిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విచారణంలో కూతురిని తానే చంపినట్లుగా దీపక్ ఒప్పుకున్నాడు.
విచారణ అనంతరం…రాధిక తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా టెన్నిస్ అకాడమీని నడుపుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు. దీపక్ సోదరుడు కుల్దీప్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అయితే రాధికను హత్య చేయడానికి ఆమె చేసిన ఇన్‌స్టా రీల్స్ కూడా కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది.అయితే ఇన్‌స్టా రీల్స్, మ్యూజిక్ వీడియో కారణంగానే రాధికను ఆమె తండ్రి చంపేశాడు అనడానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవన్నారు. అంతేకాకుండా, రాధిక తండ్రి హత్యకు ఉపయోగించిన రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాధిక నేషనల్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్ . ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ టెన్నిస్ ప్లేయర్లో రాధిక ర్యాంకింగ్ 113. ఐటీఎఫ్ డబుల్స్‌లో టాప్ 200లో రాధికకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. రాధిక యాదవ్ దేశానికి చెందిన అప్ కమింగ్ ప్లేయర్. కానీ ఇలా తండ్రి చేతుల్లో దారుంగా చంపబడింది. రాధికా యాదవ్ టెన్నిస్ జర్నీ పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కాకముందే ఆమె జీవిత ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది. ఈ న్యూస్ బయటకు రాగానే గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లో నిశ్శబ్దం అలుముకుంది. చుట్టుపక్కల ప్రజలందరూ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాధిక హత్య అందరినీ షాక్‌కు గురి చేసింది.