జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి నేడు..!

భారతదేశ రాజకీయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని, దేశ పురోగతిని సాధించడంలో ముఖ్యభూమిక పోషించిన నేత. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలంపాటు ప్రధానిగా కొనసాగారు. భారతదేశ తొలి ప్రధాని, మేధావి, ప్రపంచ రాజనీతిజ్ఞుడు, రచయిత, చరిత్రకారుడు, భారతీయ రాజకీయ దురంధరుడుగా పేరుగాంచిన నేత.. జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి నేడు.

1889 నవంబర్ 14న అలహాబాద్‌లో జన్మించారు జవహర్ లాల్ నెహ్రూ. వీరి కుటుంబీకులు కాశ్మీరు పండిత బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తండ్రి మోతీలాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి. తండ్రి ఒక ప్లీడరు. సొంతూరు కాశ్మీరు వదిలి పెట్టి, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. అక్కడే ఆనందభవన్ అనే పేరుతో చక్కని ఇల్లును ఒకటి నిర్మించుకున్నారు. తర్వాతి రోజుల్లో భారత స్వాతంత్ర్యోద్యమంలో జాతీయ కాంగ్రెసు నాయకులు ఈ ఆనంద భవనాన్నే విడిది గృహంగా, కార్యవేదికగానూ మల్చుకున్నారు.

నెహ్రూ ప్రాథమిక విద్య ఇంటి దగ్గర ప్రైవేటు ఉపాధ్యాయుల వద్దే నడిచింది. 15 ఏళ్ల వయసులో ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ కు వెళ్లారు. ఈయనకు గుర్రపుస్వారీ, ఈత అంటే ఎంతో ఇష్టం. జవహర్ అంటే గులాబీ పుష్పం అని అర్ధం. తన పేరుకు తగినట్లుగానే జవహర్ ఎల్లప్పుడూ తన కోటుకు గులాబీపుష్పాన్ని ధరిస్తూ ఉంటాడనీ ప్రతీతి. యుక్తవయసుకు రాగానే కమలతో వివాహం జరిగింది. అనంతరం లండన్ లో బారిస్టర్ పట్టా పొందారు. తిరిగి 1912లో భారత్ కి చేరుకున్నారు. ఆనాడు అలహాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ గృహం అయిన ఆనందభవనం.. గాంధీజీ, తిలక్, అజాద్, పటేల్ వంటి జాతీయ నాయకులతో కిటకిటలాడుతూ ఉండేది. జాతీయోద్యమ కార్యక్రమాలు, చర్చలలో వీరంతా చురుగ్గా పాల్గొనేవారు. అభ్యుదయ భావాలు కలిగిన నెహ్రూ.. జాతీయ పోరాటంలో యువకులకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో పలుసార్లు జైలుకు వెళ్లిన క్రమంలో.. అక్కడ ఉన్నప్పుడే ‘గ్లింప్సెస్ అఫ్ వరల్డ్ హిస్టరీ, ది డిస్కవరీ అఫ్ ఇండియా’ గ్రంథాలను రచించారు.

తొలిసారి 1929లో భారత జాతీయ కాంగ్రెస్‌కు నాయకత్వం వహించారు. 1936, 1937 తర్వాత 1946లలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. జాతీయోద్యమంలో గాంధీజీ తర్వాత రెండో ప్రముఖ నాయకుడిగా మారారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజంవైపు మొగ్గు చూపి, రష్యాతో మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారు. చైనాతో పంచశీల ఒప్పందం.. అలీనవిధానం ప్రతిపాదించిన త్రిమూర్తుల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. ప్రపంచ దేశాలన్నిటితో స్నేహసంబంధాలను పెంచి పోషించాడు. ఫలితంగా ప్రపంచ దేశాలకు రాజకీయ సలహాదారుగా భారత్ ను తీర్చిదిద్దిన గొప్ప నేతగా ఘనత సాధించారు.

దేశంలోని సంపద అంతా కొద్దిమంది చేతుల్లోకి చేరడం, ఎక్కువమంది నిరుపేదలుగా జీవించే పద్ధతిని మార్చి, సోషలిస్టు దృక్పథంతో దేశ ఆర్ధిక పరిస్థితిని పూర్తి స్థాయిలో చక్కదిద్దేందుకు ఆయన పూనుకున్నాడు. విదేశాంగ విధానాన్ని కూడా ఇదే విధంగా నెలకొల్పాడు. ఇందుకు నిదర్శనమే భిలాయ్ ఉక్కు కర్మాగారం.
కూతురు, శ్రీమతి ఇందిరాగాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి, దేశ రాజకీయ రంగంలోకి ప్రవేశించేలా చేసి, భవిష్యత్ భారతదేశ రాజకీయ సారథిగా ఆమెను తీర్చిదిద్దారు.

  • 1964 మే 27న నెహ్రూ తన 75వ ఏటా అనారోగ్యంతో కన్నుమూశారు.

నెహ్రూజీ ఆశయం మేరకు అలహాబాద్ లోనీ ఆనంద్ భవన్ మ్యూజియం, ఢిల్లీలో త్రిమూర్తి భవనంలో నెహ్రూజీ స్మృతి చిహ్నంగా నేటికీ అమరజ్యోతి వెలుగుతూనే ఉంటుంది.