
చాలామంది గతంలో ఎన్నో చేదు అనుభవాలను చవిచూసి ఉంటారు. వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ తమలో తాము కుమిలిపోతుంటారు. చేసే పని మీద ధ్యాస, శ్రద్ద ఉండదు. దీనివల్ల మళ్ళీ ఎన్నో సమస్యలు! ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకు ఉపయోగపడే కొన్ని మార్గాలు మీకోసం..
మన సమస్యలన్నింటికీ ముఖ్యకారణం మనసు ప్రస్తుతం చేసేదాన్ని మీద ఉంచకపోవడమే.. గతాన్ని తలుచుకుంటూ బాధపడడం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మన మనసు స్వభావం. గతంలోని చేదు అనుభవాలను తీసేసి.. భవిష్యత్తు గురించి ఆలోచనల్ని అదుపులో ఉంచుకుంటూ.. ప్రస్తుత పరిస్థితుల్ని తీర్చిదిద్దుకోవడం వల్లే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
భగవంతుడికి విన్నవిస్తే..
ఒక్కసారి మనం భగవద్భక్తుల జీవితాల్ని తరచి చూస్తే గనుక వారంతా ఎన్ని కష్టాల్ని అనుభవించారో మనకు అర్థమవుతుంది. ఆ మహాభక్తులు అనుభవించిన కష్టాల ముందు మనం పడుతున్న బాధలు చాలా తక్కువ. దానికే అశాంతి, కలవరపాటు. మరీ వారు మేరుపర్వతమంత కష్టాల్ని సైతం అవలీలగా ఎలా దాటగలిగారు? అంటే.. తమ బాధలను భగవంతునితో మొరపెట్టుకోవడం వల్ల.. అది సాధ్యమయిందని సఖుబాయి, మీరాబాయి, ముక్తాబాయి, కాన్హోపాత్ర లాంటి అనేక మంది భక్త శిరోమణులు నిరూపించారు.
ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించే తల్లి, తండ్రి, బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి అందరికన్నా ముందు వరుసలో నిలబడేవాడు ఆ భగవంతుడు మాత్రమే! కాబట్టి మన బాధలను భగవంతుని వద్ద పంచుకుంటే.. ఎంతటి కష్టమైనా దూదిపింజలా ఎగిరిపోతుంది.
స్నేహితులతో మనసు విప్పి మాట్లాడడం..
మనోవ్యధలను తొలగించేందుకు ఔషధంలా ఉపయోగపడేవారు మనకు మంచి స్నేహితులు.
‘నిజమైన స్నేహితుడు ఇద్దరిలో ఉన్న ఒకే ఆత్మ’.
కాబట్టి బాధలను తలచుకుంటూ కుమిలిపోవడం కంటే స్నేహితులతో మనసు విప్పి మాట్లాడడం వల్ల మనసు తేలికపడుతుంది.
ఇష్టమైన పనుల్లో మనసును పెట్టడం…
వీలైనంత వరకూ ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి ఉండడం, ఏదో ఒక పనిలో మనసును నిమగ్నం చేయడం వల్ల గతాన్ని మరిచిపోవడం సాధ్యమవుతుంది.
నువ్వు గతాన్ని మర్చిపో.. నీ దుఃఖాలను గురించి మౌనంగా తలపోస్తూ కూర్చోవద్దు. నీలోని భావోద్వేగాలను ఏదో ఒక బాహ్యరూపంలో సృజనాత్మకంగా వ్యక్తీకరించే ప్రయత్నం చేయమని స్వామి వివేకానంద అన్నారు.
ఈ మూడు మార్గాల్లో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా.. మనసు కాస్త కుదుటపడుతుంది. గతం నుంచి ప్రస్తుతం వైపు దృష్టి మళ్ళుతుంది. జీవితంలో కొంత మార్పు కనిపిస్తుంది.