
Sir Arthur Cottons Birth Anniversary: గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంధ్ర దేశానికి ‘అన్నదాత’గా ప్రసిద్ధి చెందిన కాటన్ దొర పాలరాతి విగ్రహాన్ని ఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనేవారు. అప్పట్లో బ్రిటీషు సైనికాధికారిగా.. నీటిపారుదల ఇంజనీరుగా పనిచేశారు. అటువంటి కాటన్ దొర సర్ బిరుదు పొందాడు. ఈరోజున ఆయన జయంతి సందర్భంగా.. ఆయన జీవిత విశేషాలను మనం తెలుసుకుందాం:
జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15న ఆక్స్ ఫర్డ్ లో జన్మించారు. తండ్రి హెన్రీ కాల్వెలీ కాటన్. 10వ సంతానం. వివిధ వృత్తుల్లో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు.15 సంవత్సరాల వయసులో, 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి ఈస్టిండియా కంపెనీ ఆర్టిలరీ అండ్ ఇంజనీరింగ్ సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడై, మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ ‘సర్’ అనే బిరుదాంకితుడయ్యాడు.
కాటన్ ముఖ్యంగా కృషి చేసి ప్రాజెక్టులలో గోదావరి నుంచి నిర్మించిన కాలువల నిర్మాణం ప్రథమంగా నిలిచింది. ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో కొనసాగుతున్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ విస్తరణ సాగింది.
కాటన్ 1836-38 సమయంలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు.
ఆ తర్వాత 1847- 52లో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తి చేశాడు.
క్షామపీడిత గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య కాస్త మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందకి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. Sir Arthur Cottons Birth Anniversary.
కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు కూడా శ్రీకారం చుట్టింది కాటన్ దొరే.
ఇవేకాక బెంగాల్, ఒరిస్సా, బీహార్ మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు.
1899 జులై 25న బ్రిటన్ లో మరణించాడు.