
పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగం విఫలమైందా..? అదేంటి ఇస్రోకు ఎంతో నమ్మకమైన ఈ రాకెట్ ఎందుకు ఫెయిల్ అయ్యింది..? GSLV అంటే కాస్త గతంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి.. ఓకే … కాని .. పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగిస్తే విజయం గ్యారెంటీ కదా..? మరి ఎందుకు ఇస్రోకు అపజయం ఎందురైంది..? తప్పు ఎక్కడ జరిగింది..? అసలు పీఎస్‌ఎల్‌వీ-సీ61 ద్వారా ఎలాంటి ఉపగ్రహం ప్రయోగించారు..? దీనికి పాకిస్థాన్ తో సంబంధం ఏంటి..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంటేనే విక్టరీకి మరో పేరు. అంతరిక్ష నుంచి ఇతర గ్రహాల వరకు ఇస్రో విజయాలకు లెక్కేలేదు. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంలో ఇస్రోకు మరొకరు సాటి రారు. అందుకే బడాబడా దేశాలు సైతం తమ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించుకోవడానికి ఇస్రో సాయం తీసుకుంటాయి. ఈ విధంగా అంతరిక్ష వాణిజ్యంలో ఇస్రో ఎంతో పేరు గడించింది. అయితే పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగం ఇస్రో శాస్త్రవేత్తలకు నిరాస కలిగించింది. సాంకేతిక కారణాల వల్ల పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. మే 18న ఉదయం 5:59 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం మూడవ దశలో సాంకేతిక సమస్య కారణంగా విఫలమైందని.. ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ తెలిపారు. మొదటి రెండు దశలు సాధారణంగా పనిచేశాయి.. కానీ మూడవ దశలో సాలిడ్ రాకెట్ మోటార్‌లో చాంబర్ ఒత్తిడి పడిపోవడం వల్ల ఈఓఎస్-09 శాటిలైట్‌ను 524 కిలోమీటర్ల కక్ష్యలోకి చేర్చలేకపోయారు. ఈ సమస్యను గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఫ్లైట్ టెర్మినేషన్ ప్రోటోకాల్స్ ద్వారా రాకెట్, శాటిలైట్‌ను నాశనం చేశారు. శిథిలాలు సురక్షితంగా సముద్రంలో పడేలా చర్యలు తీసుకున్నారు. ఇస్రో ఇప్పటి వరకు 63 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేయగా.. ఇది మూడవ ఫెయిల్యూర్ గా చెప్పొచ్చు. 2017 తర్వాత ఇస్త్రో ఫెయిల్ అవ్వడం ఇదే మొదటి సారి.
భారత్ ఇమేజింగ్, నిఘా ఉపగ్రహాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. ఇస్రో ప్రయోగించిన ఈఓఎస్-09 శాటిలైట్ కూడా నిఘాకు ఉపయోగపడుతుంది. క్లిష్టమైన వాతావరణంలో కూడా అధిక-నాణ్యత ఫోటోలను తీసే సీ-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ తో దీనిని రూపొందించారు. ఇది వ్యవసాయం, అటవీ నిర్వహణ, విపత్తు స్పందన, పట్టణ ప్రణాళిక, సరిహద్దు నిఘా వంటి రంగాలలో ఉపయోగపడుతుంది. ఈఓఎస్-09 శాటిలైట్ 2022లో ప్రయోగించిన ఈఓఎస్-04 శాటిలైట్‌కు అప్ గ్రేడ్ వర్షన్ గా రూపొందించారు. ఇది రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడం, అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుని దీనిని తయారు చేశారు. ఈ శాటిలైట్‌లోని సీ-బ్యాండ్ ఎస్‌ఏఆర్ సాంకేతికత రాత్రి పగలు అనే తేడా లేకుండా, అన్ని వాతావరణ పరిస్థితుల్లో భూమి ఉపరితలానికి సంబంధించి అధిక-రిజల్యూషన్ చిత్రాలను తీస్తుంది. ఇది సైనిక, పౌర రంగాలలో కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ శాటిలైట్ లైఫ్ ఐదు సంవత్సరాలు. దాని తర్వాత డీఆర్బిటింగ్ ఇంధనంతో సురక్షితంగా వాతావరణంలో కాలిపోయేలా రూపొందించబడింది. తద్వారా అంతరిక్షంలో శిథిలాలు ఏర్పడకుండా ఉపయోగపడుతుంంది. ఇప్పుడు ఈఓఎస్-09 కక్ష్యలోకి చేరకపోవడం వల్ల కారణాలను ఇస్త్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
1993లో తొలి ప్రయోగం నుంచి ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ 61 ప్రయోగాలు నిర్వహించింది. అయితే నాలుగు సందర్భాల్లో వైఫల్యాలు ఎదురయ్యాయి. 1993 సెప్టెంబర్ 20న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-డీ1 తొలి ప్రయోగం జరిగింది. ఇది ఐఆర్‌ఎస్-1ఇ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, రెండవ, మూడవ దశల సపరేషన్ సమయంలో ఆటిట్యూడ్ కంట్రోల్ సమస్య ఏర్పడింది. రాకెట్ కక్ష్యలోకి చేరలేక బంగాళాఖాతంలో కూలిపోయింది. ఈ వైఫల్యం రెట్రో-రాకెట్లలో ఒకటి పనిచేయకపోవడం, సాఫ్ట్‌వేర్ లోపం, రెండవ, మూడవ దశల మధ్య గ్యాప్ సమస్యల వల్ల సంభవించింది. ఈ వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాలతో ఇస్రో 1994లో పీఎస్‌ఎల్‌వీ-డీ2ని విజయవంతంగా ప్రయోగించింది. ఇక రెండో వైఫల్యం చూస్తే.. 1997 సెప్టెంబర్ 29న పీఎస్‌ఎల్‌వీ-సీ1 ఐఆర్‌ఎస్-1డీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం విఫలమైంది. దీని కారణంగా ఉపగ్రహం 817 కి.మీ. కక్ష్యకు బదులు మరో కక్ష్యలోకి చేరింది. దీంతో ఇస్రోకు రాకెట్ డిజైన్, కంట్రోల్ సిస్టమ్స్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మూడో ఫెయిల్యూర్.. 2017లో జరిగింది.. 2017 ఆగస్టు 31న పీఎస్‌ఎల్‌వీ-సీ39… IRNSS-1H ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించింది. ప్రయోగం 203 సెకన్ల తర్వాత పేలోడ్ ఫెయిరింగ్ విడిపోవడంలో విఫలమైంది. దీనివల్ల ఉపగ్రహం రాకెట్‌లోనే చిక్కుకుపోయింది. దాదాపు 1000 కిలోల అదనపు బరువుతో, రాకెట్ నిర్దేశించిన కి.మీ. కక్ష్యకు బదులు.. మరో కక్ష్యలోకి చేరింది. ఇస్రో నిపుణుల కమిటీ ఈ సమస్యను పరిశీలించి, హీట్ షీల్డ్ విభజన వ్యవస్థలో సాంకేతిక లోపాన్ని గుర్తించింది. దీనితో భవిష్యత్ ప్రయోగాల కోసం మార్పులు చేశారు.
ఇక తాజాగా మరో పీఎస్ఎల్ వీ ప్రయోగం విఫలమైంది. మే 18న జరిగిన పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగం మూడవ దశలో సమస్య కారణంగా విఫలమైంది. ఇది 1993లో జరిగిన వైఫల్యంతో సమానమైన ఆటిట్యూడ్ కంట్రోల్ సమస్యలను పోలి ఉందని అంటున్నారు. టెలిమెట్రీ డేటా ప్రకారం, 754.5 సెకన్ల వరకు రాకెట్ సాధారణంగా పనిచేసింది. కానీ మూడవ దశలో ఇగ్నిషన్ వైఫల్యం లేదా విభజన సమస్య కారణంగా మిషన్ విఫలమైంది. అయితే చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-ఎల్1 వంటి ఘనతలతో పోలిస్తే ఈ వైఫల్యం చిన్న సెట్‌బ్యాక్‌గానే భావిస్తున్నారు. సోషల్ మీడియాలో #ISRO #PSLVC61 హ్యాష్‌ట్యాగ్‌లతో భారతీయులు ఇస్రోకు మద్దతు తెలిపారు, ఈ సవాళ్ల నుంచి తిరిగి బలంగా లేవగలమని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ఫెయిల్యూర్ ను సవాలుగా తీసుకుని, సాంకేతిక సమస్యలను సరిచేసి తిరిగి ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఘటన ఇస్రో నమ్మకమైన రికార్డును ప్రభావితం చేసినప్పటికీ, శాస్త్రవేత్తలు దీని నుంచి కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశంగా భావిస్తున్నారు.
ఇస్రో ఈ ఏడాది మరో నాలుగు పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను, గగన్‌యాన్ క్రూ ఎస్కేప్ టెస్ట్, ఇండో-యూఎస్ నీసార్ శాటిలైట్ ప్రయోగం వంటి ముఖ్యమైన మిషన్లను ప్లాన్ చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ61 ఫెయిల్యూర్ తో 52 శాటిలైట్ల నిఘా నక్షత్రమండలం ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, ఇస్రో దీర్ఘకాలిక లక్ష్యాలపై పెద్దగా ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఫెయిల్యూర్ వల్ల ఇస్రో ప్రయోగాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోనుంది. భవిష్యత్తు ప్రయోగాలలో మెరుగైన ఫలితాలను నిర్ధారించవచ్చు.