దేశా ప్రజలను పీక్కుతుంటున్న పాక్ సైన్యం!!

సైన్యం అంటే ఏం చేయాలని.. దేశ రక్షణకు కృషి చేయాలి.. కాని పాకిస్థాన్ ఆర్మీ మాత్రం అంది తప్ప అన్ని చేస్తోంది. అసలు ఆర్మీ అంటే ఎలా ఉండకూడదో.. అలా ఉంటూ ప్రజలను పీక్కుతింటోంది. భారత్ లో ప్రజలు ఎన్నుకున్న నేతల చెప్పినట్టు.. సైన్యం నడుచుకుంటుంది. అంటే ప్రజల మాట సైన్యం వింటున్నట్టు లెక్క.. కానీ పాకిస్థాన్ లో లెక్క వేరు. అక్కడ ప్రజాపాలన పేరుకే.. పాలించేంది సైన్యమే. అందుకే ఏ నాయకుడు ఐదేళ్లు పూర్తిగా పదవిలో ఉండడు. సైన్యం ఉండనివ్వదు. అక్కడితో ఆగని పాక్ ఆర్మీ ఆ దేశ ప్రజలను రాబంధులా పీక్కుతింటోంది. దాని దారుణాలు.. అరచకాలు అంతా ఇంత కాదు. ఇంతకీ పాకిస్థాన్ సైన్యం చేస్తున్న దారుణాలు ఏంటి..? పాక్ ఆర్మీ దేశం కోసం పనిచేస్తోందా.. స్వలాభం కోసం పని చేస్తోందా..?

పాక్ ఆర్మీ అరాచకలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. రక్షణకు తక్కువ.. వ్యాపారానికి ఎక్కువ అన్నట్టు ఉంది పాక్ ఆర్మీ పరిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం చేస్తూ.. సామాన్య ప్రజల జీవితాలను నాశనం చేస్తోంది దాయాది సైన్యం. సైనికాధికారులు స్వార్థపూరిత లక్ష్యాలతో దేశ సంపదను దోచుకుంటూ, పాకిస్థాన్ ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారు. పాక్ సైన్యం యుద్ధాల కంటే డబ్బు సంపాదించడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. ఆయుధాలను పక్కనపెట్టి, భయం లేదా బెదిరింపులతో భూములను కబ్జా చేసి, వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతూ దేశాన్ని దివాళా అంచుకు చేర్చింది. సైనిక జనరళ్లు కోట్ల ఆస్తులు సంపాదిస్తూ.. యుద్ధ బాధ్యతలను ఉగ్రవాదులకు అప్పగించి, విలాసవంతమైన భవనాల్లో జీవిస్తున్నారు. సామాన్య పాకిస్థానీలు మాత్రం కనీస అవసరాలు తీర్చుకోలేక దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. భారత్‌ను శత్రువుగా చూపించి, సైన్యం దేశాన్ని తమ గుప్పిట్లో బిగించింది. ఈ సైనికాధికారులు దశాబ్దాలుగా పాకిస్థాన్ని నేరుగా లేదా పరోక్షంగా పాలిస్తున్నారు. అక్కడ ప్రజాస్వామ్యం కేవలం పేరుకు మాత్రమే ఉందనే మాట అక్షర సత్యం. చాలాకాలంగా రాజకీయ అస్థిరత, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ కారణంగా పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అధిక ధరలు, ఆర్థిక సమస్యల వల్ల సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ విదేశీ రుణం 126 బిలియన్ డాలర్లను దాటింది. బడ్జెట్‌లో 40 శాతం ఈ రుణాలు తీర్చడానికే సరిపోతోంది. ఆకలి సూచీలో పాకిస్థాన్ చివరి స్థానాల్లో ఉంది, దాదాపు 40 శాతం జనాభా దారిద్ర్య రేఖ కింద జీవిస్తోంది. బలోచిస్థాన్ పరిస్థితి మరింత దారుణం. సహజవాయువు, ఖనిజాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ఈ రాష్ట్రంలో 70 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇది వేర్పాటువాద ఉద్యమాలకు ఊతమిస్తోంది. గత కొన్నేళ్లుగా ఆర్థిక వృద్ధి రేటు 2.4 శాతానికి పరిమితమైంది, విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి బెయిల్‌ఔట్ ప్యాకేజీలు, కొన్ని దేశాల రుణాలతో పాకిస్థాన్ బండి లాక్కొస్తోంది.

పాకిస్థాన్ ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఆ దేశ సైన్యం మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతోంది. పాకిస్థాన్ సైన్యం కేవలం రక్షణ శాఖ కాదు, ఒక భారీ కార్పొరేట్ సంస్థగా మారింది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, వ్యవసాయం, తయారీ, మీడియా, రవాణా ఒకటేమటి ఒక కార్పొరేట్ కంపెనీ నడిపే అన్ని వ్యాపారలు పాకిస్థాన్ ఆర్మీ చేస్తోంది. ప్రత్యేక భూ ఆర్డినెన్స్‌లు, పన్ను మినహాయింపుల ద్వారా ఈ వ్యాపారాలను చట్టబద్ధం చేసుకుంది. ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థను నిర్మించింది. పాక్ సైన్యం ఈ వ్యాపారాలను వివిధ ఫౌండేషన్ల ద్వారా నడుపుతోంది, ఇవి పాక్షికంగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. మాజీ, ప్రస్తుత సైనికాధికారుల ఆధ్వర్యంలో ఈ సంస్థలు నడుస్తాయి. మొదట సైనిక సంక్షేమం కోసం స్థాపించిన ఈ ఫౌండేషన్లు, ఇప్పుడు భారీ వ్యాపార సామ్రాజ్యాలుగా మారాయి. వీటిలో అత్యంత శక్తిమంతమైనది ఫౌజీ ఫౌండేషన్. దీనిని 1954లో స్థాపించారు. దీని కింద 35కు పైగా సంస్థలు ఉన్నాయి. వీటిలో ఫౌజీ ఫర్టిలైజర్, ఫౌజీ సిమెంట్, ఫౌజీ ఆయిల్ టెర్మినల్, అస్కారీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. అలాగే, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్ కింద 25 వాణిజ్య విభాగాలు ఉన్నాయి, ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు, ఇన్సూరెన్స్, షుగర్ ఫ్యాక్టరీలు, వస్త్ర పరిశ్రమలు, రవాణా, విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. ఈ సైనిక సంస్థలు వ్యాపారాలు నడుపుతున్నప్పటికీ, వీటికి పోటీ లేదు, జవాబుదారీతనం అసలే ఉండదు. ఆర్థిక వ్యవహారాలపై పరిశీలన లేదు, భారీ పన్ను మినహాయింపులు, ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ వ్యాపారాల ద్వారా వచ్చే లాభాలు సైనిక ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తాయి, దేశాభివృద్ధికి లేదా దిగువ స్థాయి సైనికులకు చాలా తక్కువే అందుతుంది. ఈ సంస్థలను సైన్యం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది, తమకు నచ్చిన పార్టీలకు నిధులు అందిస్తూ, వ్యతిరేక పార్టీలను అణచివేస్తోంది.

2011 నుంచి 2015 మధ్య పాక్ సైనిక ఆస్తులు 78 శాతం పెరిగాయి. సైనికాధికారులు, వారి కుటుంబ సభ్యుల ఆస్తులకు లెక్కే లేదు. రక్షణ గృహ నిర్మాణ ప్రాధికార సంస్థ ద్వారా సైన్యం పాకిస్థాన్‌లో అతిపెద్ద ల్యాండ్ డెవలపర్‌గా మారింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్వహిస్తోంది. DHA ప్రాజెక్టుల కోసం సామాన్య పౌరుల భూములను నామమాత్ర ధరలకు బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జాతీయ భద్రత పేరుతో ఈ భూములను విలాసవంతమైన నివాస, వాణిజ్య ప్లాట్లుగా అభివృద్ధి చేసి, సైనికాధికారులకు, ధనిక కుటుంబాలకు అమ్ముతున్నారు. ఆహార భద్రత పేరుతో వ్యవసాయ భూములను కూడా సైన్యం స్వాధీనం చేసుకుంటోంది, వాటిలో సేద్యం చేయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోంది. పాక్ వైమానిక దళం షహీన్ ఫౌండేషన్‌ను నడుపుతోంది. దీని కింద రేడియో స్టేషన్లు, నిర్మాణ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు, విద్యా సంస్థలు ఉన్నాయి. నౌకాదళం బహ్రియా ఫౌండేషన్‌ను నిర్వహిస్తోంది. దీని కింద మారిటైమ్ సర్వీసెస్, విశ్వవిద్యాలయం, పోర్టు సేవల సంస్థలు ఉన్నాయి. ఈ నాలుగు సైనిక ఫౌండేషన్లు కలిసి 100కు పైగా అనుబంధ సంస్థలను నడుపుతూ, వ్యవసాయం, ఇంధనం, రవాణా, నిర్మాణ రంగాల్లో గుత్తాధిపత్యం సాధిస్తున్నాయి.

పాక్ సైన్యం నడుపుతోన్న ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత ప్రమాదకరమైనది మాదక ద్రవ్యాల వ్యాపారం. సోవియట్-అఫ్గాన్ యుద్ధం నాటి నుంచి గూఢచర్య సంస్థ ISI హెరాయిన్ ఉత్పత్తి, స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషిస్తోంది. అఫ్గాన్‌లో ఉత్పత్తి అయిన మాదక ద్రవ్యాలను బలోచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ల్యాబ్‌లలో ప్రాసెస్ చేస్తారు. ISI ముసుగులో ఉన్న హక్కానీ నెట్‌వర్క్ ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ను నిర్వహిస్తోంది. ఈ డబ్బును జమ్మూ కాశ్మీర్‌లోని లష్కర్-ఎ-తోయిబా, జమాతుద్ దవా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు హవాలా ద్వారా చేరవేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో నమోదైన ఫలా-ఎ-ఇన్సానియత్ వంటి నకిలీ దాతృత్వ సంస్థలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాక్ సైనిక కర్మాగారాల్లో తయారైన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముఠాలకు అందుతున్నాయి. పాక్ బడ్జెట్‌లో 20 శాతం రక్షణ రంగానికి కేటాయిస్తున్నారు. అయితే విద్యకు 2 శాతం, ఆరోగ్యానికి 1.3 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. 22.8 మిలియన్ పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో సైన్యం మాత్రం విలాసవంతమైన జీవనం గడుపుతూ, దేశ సంపదను దోచుకుంటోంది.

అయితే ఎన్నికల్లో విజయం సాధించిన పాలకులు ఎవరైనా పాకిస్థాన్ ఆర్మీ దౌర్జన్యాలను ప్రశ్నించినా.. దానిని నియంత్రించాలని చూసినా.. వారిని అధికారంలో నుంచి దించేస్తారు. గతంలో చాలా సార్లు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన పాలకులను పాక్ ఆర్మీ పదవుల నుంచి తప్పించింది. కొన్ని సార్లు సైనిక తీరుగుబాటుకు పాల్పడింది. 1958, 1977, 1999 సంవత్సరాల్లో ప్రభుత్వాలను పాక్ సైన్యం కూల్చివేసింది. 1958లో, పాకిస్థాన్ మొట్టమొదటి అధ్యక్షుడు మేజర్ జనరల్ ఇస్కాందర్ మీర్జా రాజ్యాంగ సభను, అప్పటి ప్రధాని ఫిరోజ్ ఖాన్ నూన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, దేశంలో మార్షల్ లాను ప్రకటించారు. సైన్యాధిపతి జనరల్ అయూబ్ ఖాన్‌ను చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. అయితే, కేవలం 13 రోజుల తర్వాత, అయూబ్ ఖాన్ మీర్జాను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, స్వయంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తిరుగుబాటు ద్వారా సైన్యం నేరుగా అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. రాజకీయ పార్టీలను నిషేధించి, రాజ్యాంగాన్ని రద్దు చేసింది. అయూబ్ ఖాన్ 1969 వరకు అధికారంలో ఉండి, దేశాన్ని ఏకపక్షంగా పాలించాడు.

1977లో, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, విపక్షాలు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించాయి. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసాయి. ఈ అల్లర్లను అవకాశంగా తీసుకున్న సైన్యాధిపతి జనరల్ జియా-ఉల్-హక్, 1977 జులై 4 అర్ధరాత్రి ఆపరేషన్ ఫెయిర్ ప్లే అనే కోడ్‌నేమ్‌తో సైనిక తిరుగుబాటు చేపట్టారు. భుట్టో, ఆయన మంత్రులు, పాకిస్థాన్ నేషనల్ అలయన్స్ నాయకులను అరెస్టు చేశారు. జియా రాజ్యాంగాన్ని రద్దు చేసి, జాతీయ, ప్రాంతీయ అసెంబ్లీలను రద్దు చేసి, మార్షల్ లా విధించారు. 1979లో భుట్టోకు మరణ శిక్ష విధించారు. జియా 1988లో విమాన ప్రమాదంలో మరణించే వరకు 11 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఇక 1999లో, ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ను తొలగించి, లెఫ్టినెంట్ జనరల్ జియాఉద్దీన్‌ను ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించేందుకు ప్రయత్నించారు. ఈ నిర్ణయం ముషారఫ్‌, షరీఫ్‌ మధ్య గొడవలు పెంచింది. అదే సమయంలో, కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ వైఫల్యం తర్వాత షరీఫ్ ముషారఫ్‌ను తొలగించాలని నిర్ణయించారు. శ్రీలంక నుంచి తిరిగి వస్తున్న ముషారఫ్ విమానాన్ని షరీఫ్ ప్రభుత్వం ల్యాండ్ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీనికి ప్రతిస్పందనగా, ముషారఫ్‌కు విధేయులైన సీనియర్ సైనికాధికారులు 1999 అక్టోబర్‌లో షరీఫ్, ఆయన మంత్రులను అరెస్టు చేసి, ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ముషారఫ్ మార్షల్ లా విధించకుండా, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, తర్వాత అధ్యక్షుడిగా 2008 వరకు అధికారంలో ఉన్నారు. షరీఫ్‌ను బహిష్కరణకు గురిచేశారు. 2022లో, అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావెద్ బజ్వాతో ఉద్రిక్తతల కారణంగా సైన్యం మద్దతును కోల్పోయారు. ఆయన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ద్వారా పడిపోయింది, దీని వెనుక సైన్యం పరోక్ష పాత్ర ఉందని ఖాన్ ఆరోపించారు. ఖాన్ అరెస్టు, ఆయన పార్టీ నాయకులపై కేసులు, ఎన్నికల చిహ్నం రద్దు వంటి చర్యలు సైన్యం రాజకీయ జోక్యానికి ఒక ఉదాహరణకు చెప్పొచ్చు..