ఓడిపోయిన మునీర్ కు పదోన్నతి ఎందుకు..? పహల్గామ దాడికి బహుమానా..?

సయ్యద్ అసీమ్ మునీర్‌.. ప్రస్తుతం పాకిస్థాన్ సైన్యాధిపతిగా ఉన్నాడు.. తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం మునీర్ కు ఫీల్డ్ మార్షల్ పదవి కట్టపెట్టింది. ఓ పక్క భారత్ దేశం చేతిలో పాకిస్థాన్ చావు దెబ్బ తింది. భారత్ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు నాశనమయ్యాయి. ఇది ఆ దేశానికి ఓటమితో సమానం. ఇలాంటి సమయంలో ప్రమోషన్ ఇవ్వడం ఏంటి..? అసలు ఫీల్డ్ మార్షల్ పదవి అంటే ఏంటి..? మునీర్ కు ఇది ఇచ్చారు.. ఇప్పించుకున్నాడా..? అసలు ఈ పదవి పొందే అర్హత మునీర్ కు ఉందా..? భారత్ పై కుట్రలకు బహుమతిగానే ఈ పదవి ఇచ్చారా..?

పాకిస్థాన్ సైన్యాధిపతి సయ్యద్ అసీమ్ మునీర్‌.. భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. అలాగే వ్యక్తికి పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది. ఫీల్డ్ మార్షల్ అంటే జీవితాంతం సైనిక అధికారిలా కొనసాగే పదవి. పాకిస్థాన్‌లో గతంలో ఈ పదవిని జనరల్ ఆయుబ్ ఖాన్ కు మాత్రమే ఉండేది. ఆయుబ్ ఖాన్ 1958లో తిరుగుబాటు చేసి పాకిస్థాన్ అధ్యక్షుడయ్యాడు. కానీ 1965లో భారత్‌తో పాకిస్థాన్ యుద్ధంలో ఓడిపోవడంతో.. 1969లో రాజీనామా చేశాడు. మునీర్ పాకిస్థాన్‌లో ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందిన రెండవ జనరల్. పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఇటీవలి ప్రసంగాల్లో మునీర్‌ దైర్య సహసాలను ప్రశంసిస్తూ తెగపొగిడేశాడు. అయితే, ఈ పదోన్నతి వెనుక మునీర్, షరీఫ్ మధ్య ఒక ఒప్పందం ఉందా? మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయాల నుంచి దూరంగా ఉంచడం, భారత్‌పై జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్ వైఫల్యం కారణంగా మునీర్‌పై కోర్టు మార్షల్ చర్యలను తప్పించడం కోసం ఈ ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి.

మునీర్ పదోన్నతి గురించి రెండు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే.. ఈ పదోన్నతి పాకిస్థాన్ ప్రభుత్వంపై మునీర్ పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తుందని అంటున్నారు. మే 10 అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నేరుగా మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడి, భారత్‌తో శత్రుత్వాన్ని ఆపమని కోరారు. అంటే, మునీర్ తన అధికారాన్ని శాశ్వతంగా ఉంచుకోవడం కోసం, ఎప్పటికీ రిటైర్ కాకుండా ఉండేందుకు ఈ పదోన్నతిని స్వీకరించాడని ఒక అభిప్రాయం. ప్రస్తుత యుద్ధంలో పాకిస్థాన్ సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ మునీర్ సైనిక యూనిఫామ్‌లో ప్రజల మద్దతు కోరుతున్నాడు. అంటే అయూబ్ ఖాన్ , ముషారఫ్ లా పాకిస్థాన్ లో అధికారం చేపట్టాలనే ఆలోచన మునీర్ కు ఉందా అనే ప్రశ్న వినిపిస్తోంది. రెండవ అభిప్రాయం ఏమిటంటే, ఈ పదోన్నతి నిజానికి పహల్గామ్ ఉగ్రదాడిని ప్లాన్ చేసి, అమలు చేసినందుకు మునీర్‌కు ఇచ్చిన బహుమతి అంటున్నారు. ఈ దాడి తర్వాతే భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన జైషే హహ్మద్ ఉగ్రవాదుల సంతాప సభలో మునీర్ సీనియర్ అధికారులు హాజరవడం, పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాద సమూహాలకు ఎలా మద్దతు ఇస్తుందో ప్రపంచానికి బహిర్గతం చేసింది. మరోవైపు ఇటీవల షెబాజ్ షరీఫ్ అబద్ధాలకు అంతులేకుండా పోతోంది. ఈ దాడుల వల్ల రెండు దేశాలు అంతర్జాతీయంగా సమాన స్థాయిలో నిలిచాయని అబద్దాలు చెప్పొకొచ్చారు. ఇది పాకిస్థాన్‌కు గొప్ప విజయంగా మాట్లాడారు. అయితే భారత మిస్సైళ్ల దాడులతో పాకిస్థాన్ గగన రక్షణ వ్యవస్థలు, వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. పాకిస్థాన్ దాదాపు అమెరికా ముందు శాంతి కోసం వేడుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఓటమి తర్వాత కూడా మునీర్ కు పదోన్నతి రావడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.

మునీర్ పూర్తి పేరు.. సయ్యద్ అసీమ్ మునీర్ అహ్మద్ షా. 1968లో పాకిస్థాన్‌లోని రావల్పిండిలో జన్మించాడు. అతని కుటుంబం 1947లో భారత విభజన సమయంలో భారతదేశంలోని పంజాబ్‌లోని జలంధర్ నుంచి పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. మునీర్ తండ్రి ఒక స్కూల్ టీచర్, ఇమామ్‌గా పనిచేశారు. దీనివల్ల మునీర్ మతపరమైన వాతావరణంలో పెరిగాడు. అతను రావల్పిండిలోని మర్కాజీ మదరసా దార్-ఉల్-తజ్వీద్‌లో తన ప్రాథమిక విద్యను పొందాడు, ఇక్కడ అతని ఆలోచనలు ఇస్లామిక్ భావజాలంతో ప్రభావితం అయ్యాయి. మునీర్ 1986లో జియా-ఉల్-హక్ పాలనలో పాకిస్థాన్ సైన్యంలో చేరాడు. మంగ్లాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్లో స్వోర్డ్ ఆఫ్ హానర్ పొందాడు. 2018లో ISI డైరెక్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. కానీ ఎనిమిది నెలల తర్వాత, అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు అతన్ని తొలగించారు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని మునీర్ చెప్పడం వల్లే .. ఇలా చేశారని అంటున్నారు. మునీర్ 2019 నుంచి 2021 వరకు గుజ్రాన్‌వాలాలో కార్ప్స్ కమాండర్‌గా, తర్వాత క్వార్టర్‌మాస్టర్ జనరల్‌గా పనిచేశాడు. అసీమ్ మునీర్ 2022 నవంబర్ 29న పాకిస్థాన్ సైన్యాధిపతిగా నియమితుడయ్యాడు. 2022 నవంబర్ 27న రిటైర్ కావాల్సి ఉండగా, ప్రధాని షెబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంప్రదింపుల తర్వాత, అతడి రిటైర్మెంట్ అప్లికేషన్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఆరుగురు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి షెబాజ్ షరీఫ్ సిఫార్సుతో, అప్పటి రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ అదే రోజు మునీర్ నియామకాన్ని ఆమోదించారు. అతడి సర్వీసును మూడేళ్లపాటు పొడిగించారు. 2024 నవంబర్‌లో, పాకిస్థాన్ పాలక కూటమి ఒక బిల్లును వేగంగా ఆమోదించడంతో మునీర్ హోదాను 2027 నవంబర్ వరకు ఐదేళ్లకు పొడిగించారు. దీనిని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ విమర్శించింది. ఇప్పుడు మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించారు. ఇది ఆయుబ్ ఖాన్ తర్వాత పాకిస్థాన్‌లో రెండవ వ్యక్తికి లభించిన పదవి. దీనితో మునీర్ జీవితాంతం సైనిక అధికారిగా కొనసాగుతాడు.

అయితే పహల్గామ్ ఉగ్రదాడి కుట్రకు బహుమానంగానే మునీర్ కు ఈ పదవి ఇచ్చారని అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు, అసీమ్ మునీర్ కశ్మీర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, ఇవి భారత్‌లో వివాదాస్పదమయ్యాయి. ఏప్రిల్ 16 ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్‌లో, మునీర్ కశ్మీర్‌ను పాకిస్థాన్ గొంతుకలోని నరం అని అన్నాడు. భారత్, పాకిస్థాన్ సిద్ధాంతాలపై వివాదాస్మద వ్యాఖ్యలు చేశాడు. హిందువుల ఆచారాలను పోల్చి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు హిందూ-ముస్లిం భేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఉగ్రవాద గ్రూపులకు సంకేతంగా పనిచేశాయని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. అంతకుముందు, ఫిబ్రవరి 5 పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫ్ఫరాబాద్‌లో కశ్మీర్ సాలిడారిటీ డే సందర్భంగా, పాకిస్థాన్ కశ్మీర్ కోసం ఇప్పటికే మూడు యుద్ధాలు చేసింది, అవసరమైతే మరో పది యుద్ధాలు చేస్తుంది అని మునీర్ ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలు అతని గత సైన్యాధిపతి కమర్ జావేద్ బజ్వా డిప్లొమాటిక్ విధానానికి భిన్నంగా, మరింత దూకుడు వైఖరిని తెలియజేస్తోంది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడిని పాకిస్థాన్ ఆధారిత లష్కర్-ఎ-తొయిబా ఆఫ్‌షూట్ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసిందని, దీని వెనుక మునీర్ పాత్ర ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పహల్గామ్ దాడి మునీర్ ఆదేశాల మేరకు ISI చేసిందని మాజీ పాకిస్థాన్ సైనిక అధికారి ఆదిల్ రాజా ఆరోపించారు. ఇది మునీర్ వ్యక్తిగత రాజకీయ అజెండా కోసం జరిగిన చర్య అన్నారు. మునీర్ ఇస్లామాబాద్ వ్యాఖ్యలను కమ్యూనల్ గా అభివర్ణించి, పహల్గామ్ దాడి జరగడానికి ఆ వ్యాఖ్యలు ఒక ట్రిగ్గర్‌గా పనిచేశాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరైన హాషిమ్ మూసా, పాకిస్థాన్ సైన్యంలో పనిచేసిన మాజీ పారా కమాండో అని, వారు చైనా ఆధారిత ఎన్క్రిప్టెడ్ టెలికాం పరికరాలను ఉపయోగించారని, కాకుల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడి బాలోచిస్థాన్‌లో జఫర్ ఎక్స్‌ప్రెస్ దాడికి ప్రతీకారంగా, అలాగే కశ్మీర్‌లో శాంతి, ఆర్థిక వృద్ధిని దెబ్బతీసేందుకు, పాకిస్థాన్‌లోని అంతర్గత సంక్షోభం నుంచి దృష్టిని మళ్లించేందుకు మునీర్ ప్లాన్ చేశాడని భారత రక్షణ, భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్ అధికారులు ఈ ఆరోపణలను తిరస్కరించారు, దాడికి తమకు సంబంధం లేదని, కశ్మీర్ సమస్యనే ఈ అల్లర్లకు కారణమని చెప్పారు. అయితే మునీర్ కు మాత్రం పదవులు అప్పగిస్తున్నారు.