హనుమాన్ జయంతి నేడు…!!

“శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాజనేయం!
ప్రభాదివ్య కాయం, ప్రకీర్తి ప్రదాయం,
భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం,
భజేహం, భజేహం, భజేహం!”

అంటూ భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. మహాబ‌లుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, వ్యాకరణకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు, వీరాంజనేయుడు… ఇలా ఎన్నో విధాలుగా స్తుతింపబడిన హనుమా.. తల్లి అంజనాదేవి కావడంతో, ఆంజనేయుడయ్యాడు. చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చినందున పవనసుతుడయ్యాడు. శోకసంద్రానున్న సీతమ్మను ఓదార్చిన ఆ అంజనీపుత్రుడు.. మహా బలశాలి అయ్యుండీ కూడా రామబంటుగా ఒదిగాడు.. భక్తుల భయాలన్నీ పారదోలి ప్రసన్నాంజనేయుడయ్యాడు. ఒక్కో మాసంలో ఒక్కో దేవతకు విశిష్టత ఉన్నట్లు, హనుమంతుడికి వైశాఖ మాసం ప్రత్యేకమైంది.

వైశాఖ శుక్ల ఏకాదశి హనుమ తల్లిదండ్రులైన కేసరి అంజనల వివాహం జరిగింది, వైశాఖ కృష్ణ దశమి (మే 22న) స్వయంగా హనుమ జన్మించారు. హనుమద్వైభవాన్ని దధిముఖుడు వానరులకు బోధించింది ఈ వైశాఖమాసంలోనే. విశాఖకు సంబంధించినది వైశాఖం. శాఖ అంటే కొమ్మ. కొమ్మలపై విశిష్టంగా సంచరించేది వానరం. ఆ రకంగా వైశాఖ మాసానికీ, వానరావతారానికీ సంబంధం ఉన్నట్లు కూడా చెప్పవచ్చు. ఇంతటి ప్రత్యేకతలను కలిగిన మాసంలో హనుమ జన్మించడం విశేషం! అటువంటి హనుమాన్ జన్మ వృత్తాంతం గురుంచి తెలుసుకుందాం:

పూర్వం గార్దభ నిస్వనుడు అనే రాక్షసుడు ఒకడుండేవాడు. అతడు తపస్సు చేసి, తన మరణరహస్యం తనకూ, పరమేశ్వరుడికీ తప్ప మరెవ్వరికీ తెలియకుండా శివుడి నుంచి ఒక ప్రత్యేక వరాన్ని పొందాడు. కాలక్రమంలో ఆ రాక్షసుడు లోకకంటకుడిగా తయారవ్వడంతో శివుడు విసుగుచెందాడు. కానీ మాటిచ్చిన కారణంగా నారాయణునికి, గార్దభ నిస్వనుడి మరణరహస్యం చెప్పలేదు. ఎలాగోలా రాక్షసుణ్ణి సంహరిస్తే, దాసుడినై సేవించుకుంటానని మాటిచ్చాడు మహాశివుడు. నారాయణుడు మోహినీ అవతారంతో రాక్షసుణ్ణి మోహితుడ్ని చేసి వృక నరావతారంతో అంటే, తోడేలు ముఖం మానవ శరీరంతో సంహరించాడు.
హరుడు.. హరికిచ్చిన మాటను అనుసరించి రామావతారంలో హనుమంతుడిగా జన్మించి, వెన్నంటే ఉండి సేవించుకున్నాడు. ఇదొక వృత్తాంతం.

పరాక్రమవంతుడు కేసరి, అంజనలకు వాయుదేవుడి అనుగ్రహంతో పరిపూర్ణ రుద్రాంశతో జన్మించినవాడే వీరాంజనేయుడు. హనుమ తల్లి అంజనాదేవి. అయితే అంజన జన్మతా: అప్సరస అయినప్పటికీ, ఒక మునివర్యుని శాపం వల్ల వానర కాంతగా పెరుగుతుంది. అంజనాదేవి తన బాల్యంలో ఒకనాడు కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్నిని చూసి, దానిపైకి పండ్లు విసిరింది. ధ్యానానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్న ముని నిజరూపం ధరించి, కోపంతో అంజనను.. ‘నీవు ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారతావని’ శపిస్తాడు. తాను చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష కోరుతుంది. ఆ ముని శాంతించి, నీవు, వానర రూపంలో ఉన్నా, ఎవరైతే నిన్ను ఇష్టపడతారో, శివుని అవతారమైనటువంటి శిశువుకు జన్మనిచ్చినప్పుడు ఆ శాపం నుంచి విడుదలవుతావని వరమిస్తాడు. అందువల్లే శాపవిమోచనానికి కారణమైన అంజన భూమిపైన జన్మిస్తుంది. అలా అరణ్యంలో నివాసం ఏర్పరచుకున్న ఈమె ఒకరోజు పురుషుడిని చూసింది. ప్రేమలో పడింది. ఆ క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది.

అతడు అంజన వద్దకు వచ్చి, తన పేరు ‘కేసరి’ అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానరముఖం కలిగి ఉన్నప్పటికీ, దివ్య తేజస్సుతో ఉండటంతో ఆశ్చర్యపోయింది. అలా వారిద్దరి అభీష్టం మేరకు ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. సంతానం కోసం శివుని గురుంచి తపస్సు చేసింది. రాక్షస సంహారం కోసం విష్ణుమూర్తి తన తేజస్సును కాంతి రూపంలో బయటకు తీయగానే బ్రహ్మ, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, ఇతర దేవతలు కూడా తమ శక్తులను జోడించి శివుడికి సమర్పించారు. అనంతరకాలంలో మహాశివుడు తనలోని రుద్రాంశను పార్వతీగర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ శివశక్తి తాపాన్ని భరించలేని పార్వతిదేవి ఆ తేజస్సును అగ్నికి సమర్పించింది. అగ్ని కూడా భరించలేక వాయువుకు అర్పించాడు. ఆదిశక్తి అనుగ్రహంతో ఆ శక్తిని స్వీకరించిన వాయుదేవుడు… బిడ్డల కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు.
ఈ విధంగా శివుని అంశతో పుట్టిన ఆ బాలుడు, ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర వంటి పేర్లతో ప్రసిద్ధి చెందాడు.