
మావోయిస్టు చరిత్రలో అతిపెద్ద దెబ్బతగిలింది. ఆపరేషన్ కగార్ మొదలు పెట్టినప్పటి నుంచి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే తాజా ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవ రావు అలియాస్ బసవ రాజు చనిపోవడం.. ఉద్యమానికి ఇదే చివరి అంకం అనుకోవాలి. 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం చెబుతోంది. దీని భాగంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. అయితే ఇది ముగిసినట్టే అని అనుకోవచ్చా..? ఇక భారత దేశంలో మావోయిస్టుల చరిత్ర ముగిసినట్టేనా..? నంబాల కేశవరావు మరణంతో మావోయిస్టులకు ఎలా నష్టం జరిగింది..? చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనకు .. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారా..? నంబాల కేశవరావు స్థానంలో మావోయిస్టులకు కొత్త నాయకుడు ఎవరు రానున్నారు?
ఆయుధాలతోనే దేశాధికారంలోకి వస్తామని భావించిన మావోయిస్టులు.. చివరికి ఆ ఆయుధాల చేతిలోనే అంతమవుతున్నారు. 30 ఏళ్లకు ముందు.. ఇప్పటికీ మావోయిస్టుల ఉద్యమానికి ఉన్న మద్దుత చాలా మారింది. అడవుల్లో ఆయుధాలతో తిరిగితే ప్రజాసమస్యలు పరిష్కారం కావనే భావన ఇప్పుడు ప్రజల్లోనే కలుగులోంది. సోషల్ మీడియా యుగంలో తప్పు చేసిన నాయకుడిని నేరుగా ప్రశ్నించే అవకాశం ఉంది. అలాంటిది ఇంకా అడవుల్లోనే ఉండి ఆయుధాలతోనే పోరాటం చేస్తాం.. ప్రజాసమస్యలు పరిష్కరిస్తామంటే.. ఎలా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జనజీవన శ్రవంతిలో కలిసి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే పరిష్కారం కావా..? తెలంగాణలో ఉద్యమ నేపథ్యంలో ఉన్న నేతలు రాజకీయ నేతలుగా ఎదిగి ప్రజాసేవ చేస్తున్న విషయం చూస్తేనే ఉన్నాం. అందుకే మావోయిస్టులు జనజీవన శ్రవంతిలో కలిసిపోవాలని కొద్ది నెలల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యల తీవ్రత ఎలాగ ఉంటుందో.. ఇప్పుడు అర్థమవుతోంది.
ఆపరేషన్ కగార్ మొదలు పెట్టినప్పటి నుంచి వరుస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. గత 150 రోజుల్లోనే దాదాపు 300 మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్లలో చనిపోయారంటే ఆ ఆపరేషన్ ఎంత వేగంగా సాగుతుందో అర్థమవుతుంది. గతంలో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టుల మరణాల రేతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2009లో 314 మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఎన్నడూ లేనంత దూకుడుగా ఉన్నాయి. త్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఏవోబీ, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్లు ఇలానే కొనసాగితే.. మావోయిస్టుల ఉద్యమంలో ఈ ఏడాది అత్యంత ఘోరమైన సంవత్సరంగా నిలుస్తుంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో 50 గంటల పాటు సాగిన భారీ ఆపరేషన్‌లో టాప్ మావోయిస్టు నాయకుడు నంబాల కేశవ రావు అలియాస్ బసవరాజు చనిపోయాడు. 70 ఏళ్ల బసవరాజు, సీపీఐ మావోయిస్టు సుప్రీం కమాండర్, ప్రధాన వ్యూహకర్తగా ఉన్నాడు. 2018లో గణపతి రాజీనామా చేసిన తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించాడు. ఈ ఎన్ కౌంటర్ లో బసవరావుతో సహా 27 మంది చనిపోయారు. నంబాల కేశవ రావు మరణంతో మావోయిస్టుల ఉద్యోమానికి తీవ్రమైన దెబ్బతగిలిందని చెబుతున్నారు.
అసలు నంబాల కేశవ రావు ఎవరు?
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో ఆయన 1955లో జన్మించాడు కేశవ రావు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలో, పదో తరగతి వరకు నౌపడలో సాగింది. టెక్కలి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి.. డిగ్రీలో బీఏ మొదటి సంవత్సరం చదివాక వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ ఇంజినీరింగ్ సీటు రావడంతో అక్కడకు వెళ్లాడు. ఆర్ఈసీలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. అప్పట్లో ఆర్ఎస్యూ, ఏబీవీపీల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేవి. వీటిల్లో బీటెక్ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన కేశవరావు ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో చేరిన క్రమంగా ఎదిగాడు. మిలటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవాడు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావే. 2010లో గస్తీకి వెళ్లి తిరిగివస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి.. 74 మందిని చంపేసిన ఘటన వెనుక సూత్రదారి కేశవరావే. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్రకర్మతో పాటు మరో 27 మంది మరణించారు.
ఇక నంబాల కేశవరావు తర్వాత ఇక కీలక మావోయిస్టులు ఎవరున్నారు.? ముప్పల లక్ష్మణ రావు అలియాస్ గణపతి అలియాస్ రమణ్ణ అలియాస్ శ్రీనివాస్, శేఖర్. వయస్సు సుమారు 74 ఏళ్లు ఉంటుంది సీపీఐ మావోయిస్టు పార్టీకి సీనియర్ సలహాదారు, వ్యూహకర్తగా కొనసాగుతున్నాడు. అతను ఆయుధాలతో దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. మరో కీలక మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్ అలియాస్ భూపతి. సుమారు 68 ఏళ్ల వయస్సు ఉంటుంది. సీనియర్ సెంట్రల్ కమిటీ సభ్యుడు. మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందినవాడు. మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్. సుమారు 65 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఝార్ఖండ్‌లోని గిరిడీ జిల్లాకు చెందినవాడు, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్స్ సమన్వయం చేసే కీలక వ్యక్తి. ఇక వీరు కూడా ఎన్ కౌంటర్లలో మరణిస్తే ఇక మావోయిస్టులు అంతమైనట్టే అని చెబుతున్నారు.
మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణంతో ఇప్పుడా స్థానంలోకి ఎవరు రానున్నారనే అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిపెట్టాయి. నంబాల స్థానం తీసుకోవడం కొత్తవారికి సవాళ్లతో కూడుకొన్న పనే. ఈ క్రమంలో రెండు పేర్లపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టిపెట్టాయి. వీటిలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, మల్లోజుల వేణుగోపాల రావు పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం తిరుపతి మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నాడు. ఇది పార్టీ సాయుధ విభాగం. ఇక వేణుగోపాలరావు పార్టీ సైద్ధాంతిక విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. వీరిలో తిరుపతి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. వేణుగోపాలరావు అగ్రకులానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో తిరుపతి పగ్గాలు చేపడితే.. దళితులతోపాటు.. ఆదివాసీల్లో పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు వారికి అవకాశం లభిస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనావేస్తున్నాయి. పార్టీకి గతంలో నాయకత్వం వహించిన మల్లోజుల కోటేశ్వరరావు, నంబాల కేశవరావుతో పోలిస్తే.. వీరిద్దరూ రెండో శ్రేణి నాయకులు. పాత తరం నాయకుల్లో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. ప్రస్తుతం తిరుపతికి 62 ఏళ్లు కాగా.. వేణుగోపాలరావుకు 68 సంవత్సరాల వయస్సు. వీరిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. తిరుపతిది జగిత్యాల కాగా.. వేణుది పెద్దపల్లి. ఇకఈ నేపథ్యంలో మావోయిస్టులు సాయుధ విభాగం నాయకుడి వైపు మొగ్గుతారా.. లేదా సైద్ధాంతిక విభాగం నాయకత్వాన్ని ఆమోదిస్తారా అన్నది కీలకమని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. వీరిలో వేణుగోపాల్‌కు పార్టీలో సీనియర్ల మద్దతు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆయన పూర్వపు నాయకుడు మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు. ఇప్పటికీ పార్టీలో ఆయన్ను అతిపెద్ద నాయకుడిగా భావిస్తుంటారు. ఆ స్థానాన్ని వేణుగోపాల్ మాత్రమే భర్తీ చేయగలడని అంచనాలున్నాయి.