
సత్తుపిండి.. ఎప్పుడైనా తిన్నారా.. దీనివల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. వాళ్లు రెగ్యులర్ గా ఈ సత్తుపిండిని ఆహారంలో భాగంగా తీసుకునేవారు. ఇప్పటికీ తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాల్లోని విలేజెస్ లో తమ ఆహారంలో సత్తుపిండిని ప్రధాన వంటకంగా ఉంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
సత్తుపిండి శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. 100 గ్రాముల సత్తుపిండిలో ప్రొటీన్లు 25- 30 గ్రాముల వరకు ఉంటాయి. వెజిటేరియన్స్ కు నాణ్యమైన ప్రొటీన్లను ఇస్తుంది. అంతేకాదు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువే. ఇది మన కడుపును క్లీన్ చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్న వారికి సత్తుపిండి మంచి రెసీపీ.
సత్తుపిండిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తక్కువగా పెరుగుతాయి. కావున ఇది డయాబెటిస్ ఉన్నవాళ్లకు మంచిదే. సోడియం తక్కువగా ఉండటంతో అధిక రక్తపోటు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు.
క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ఎ, సి విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి. 25 గ్రాముల సత్తుపిండిలో 100 కేలరీలున్నాయి.
ఇవి కండరాలకు శక్తినిస్తుంది. కాబట్టి పెరిగే పిల్లలకూ సత్తుపిండి చాలా మంచిది.
ఈ పిండితో లడ్డూలు, మామిడిపండు రసంతో కలిపి స్మూతీ, సత్తు కబాబ్‌లు కూడా చేసుకోవచ్చు. ఇక సత్తుపిండికి కొబ్బరితురుము, డ్రైఫ్రూట్స్, శనగపిండి, నెయ్యి, చక్కెర, యాలకుల పొడి లాంటివి చేర్చి చేసే సత్తు పంజిరి భలే రుచిగా ఉంటుంది. నీళ్లు కలిపిన సత్తుపిండి ముద్దకు చక్కెర లేదంటే ఊరగాయ కలుపుకొని ఉపాహారంగానూ తినవచ్చు.
శనగలను ఇసుకలో వేయించి, ఆ తర్వాత వాటిని జల్లెడపట్టి, పిండిగా మారుస్తారు. అదే సత్తుపిండి. సత్తుపిండిని బెల్లంతో కలుపుకొని గానీ, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడితో కలుపుకొనిగానీ తాగితే ఆరోగ్యానికి మంచిది. సత్తు షర్బత్ ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్నిస్తుంది. నిమ్మరసం, పుదీనా ఆకులు కూడా కలిపి తీసుకోవచ్చు.
- అలాగనీ సత్తుపిండిని ఎక్కువగా తింటే కడుపులో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. కాబట్టి, గ్యాస్ట్రిక్ సమస్యలున్నవాళ్లు మితంగా తినాలి. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవాళ్లు సత్తుపిండి తినకూడదు. కిడ్నీల్లో రాళ్లు ఉంటే డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. ఇక శనగలంటే అలర్జీ ఉన్నవాళ్లు, సత్తుపిండి అరిగించుకోలేనివాళ్లు కూడా దూరంగా ఉంటే మంచిది.