
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, యువ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను లావు రాధిక నిర్మించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. నాన్న చనిపోవడంతో గ్రామ పెద్దగా అధికారం చేపడుతుంది అమాయకురాలైన కీర్తి సురేష్. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి ఒక వింత సంక్షోభం వస్తుంది. ఊరిలో ఉన్న స్మశానం హౌజ్ఫుల్గా మారుతుంది. కేవలం నలుగురిని పూడ్చిపెట్టేంత స్థలం మాత్రమే మిగిలిఉంటుంది. అయితే ఈ సమస్యను కీర్తి సురేష్, సుహాస్ ఎలా పరిష్కరించారనేది ఈ సినిమా కథ. వసంత్ ఈ సినిమాకు కథను అందించారు.