అత్తగా కాదు అమ్మలా.. కోడళ్లపై అక్కినేని అమల ప్రేమానురాగాలు!

తెలుగు సినిమాలో తరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వారి ప్రేమాభిమానాలు పొందుతున్న పెద్ద కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు నుండి నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్.. ఇలా ఈ ఇంట్లో అందరూ స్టార్సే. ఇన్నాళ్లూ ఈ ఇంట్లో మగవాళ్ల హవానే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇద్దరు కొత్త వ్యక్తుల రాకతో అక్కినేని ఇంట వాతావరణం మరింత ఆహ్లాదకరంగా, సందడిగా మారిపోయింది. వాళ్లే అక్కినేని కోడళ్లు.. నాగచైతన్య భార్య శోభిత , అఖిల్ భార్య జైనబ్ కుటుంబంలోకి రావడంతో తమ ఇంటి రూపురేఖలే మారిపోయాయంటూ అక్కినేని అమల తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎంతో మురిసిపోతూ చెప్పారు. తాజాగా తన ఫ్యామిలీ గురించి, కోడళ్ల గురించి అమల ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. ఒక అత్తగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మా ఇంట్లో చూస్తే నాగార్జున, చైతన్య, అఖిల్.. ఇలా అందరూ మగవాళ్లే ఉండేవారు. కానీ ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్లు వచ్చారు. ఇంట్లో వాళ్ల రాకతో మహిళల సందడి ఉండటం చాలా బాగుంది, ఇల్లంతా ఎంతో కళకళలాడుతోంది అని ఆమె తెలిపారు.ముఖ్యంగా నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల గురించి అమల ఎంతో గొప్పగా చెప్పారు. శోభిత వృత్తిపరంగా ఒక నటిగా సాధించిన విజయాలను అత్తగా అమల ఎంతో గర్వంగా ప్రశంసించారు. శోభిత స్వభావం ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే సులువుగా కలిసిపోతుంది. మా ఫ్యామిలీలో ఆమె ఎంతో త్వరగా భాగమైపోయింది అని శోభితను ఆకాశానికెత్తేసింది అమల. కెరీర్ ను, ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తున్న తీరు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
తన చిన్న కోడలు, అఖిల్ భార్య అయిన జైనబ్ రవ్జీ తో తనకున్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. జైనబ్‌తో తనకు మరింత దగ్గరి అనుబంధం ఉందని అఖిల్ జైనబ్ తో ప్రేమలో ఉన్నప్పుడే, చాలా ముందుగానే నేను ఆమెను కలిశాను. అప్పటి నుంచే తను నాకు ఎంతో నచ్చింది అని అమల తెలిపింది. ఒక కోడలిగా కాకుండా ఒక స్నేహితురాలిగా, కూతురిగా జైనబ్ తనతో ఉంటుందని అమల మురిసిపోయారు. జైనబ్ చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉంటుంది. సొంత కూతురిలా నాకు అనిపిస్తుంది. తనకంటే ఎక్కువగా నా గురించి, నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటుంది. అంతేకాదు, మా ఆయన నాగార్జునను కూడా ఆమె ఎంతో బాగా, గౌరవంగా చూసుకుంటుంది అంటూ అక్కినేని ఫ్యామిలీలో జైనబ్ ఎంతలా కలిసిపోయిందో అమల తన మాటల్లో ఎంతో సంతోషంగా వివరించారు. సాధారణంగా నాగార్జున ఫ్యామిలీ పండుగలను చాలా సింపుల్ గా జరుపుకుంటుంది. కానీ ఇద్దరు కోడళ్లు వచ్చిన తర్వాత ఆ సెలబ్రేషన్స్ స్టైల్ పూర్తిగా మారిపోయిందట. ముఖ్యంగా పండగల విషయంలో జైనబ్ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని అమల చెప్పారు. గతంలో పండగలను మేము చాలా సింపుల్ గా, కేవలం మా నలుగురు కుటుంబ సభ్యుల మధ్యే సెలెబ్రేట్ చేసుకునేవాళ్లం. పెద్దగా హడావిడి ఉండేది కాదు. కానీ జైనబ్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రతి వేడుకనూ, పండుగనూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇంటిని అలంకరించడం దగ్గర్నుంచి, అందరం కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకోవడం వరకు.. ఆ ఇద్దరు అమ్మాయిలు మా ఇంట్లో కొత్త వెలుగులు నింపారు అని అమల ఎంతో ఎమోషనల్ గా వెల్లడించారు. ఒక ఇల్లు ఆనందంగా ఉండాలంటే అందులో ఆడవాళ్ల పాత్ర ఎంత కీలకమో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి.



