అమెరికా కమాండర్లకు ఇరాన్ వార్నింగ్..!

అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి, ఇరాన్‌కు మధ్య నడుస్తున్న పోరు ఇప్పుడు మానవత్వాన్ని మంటగలిపే స్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో జరిగిన ఒక ఘోర తప్పిదం.. ఇప్పుడు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాలపై అమెరికా ప్రయోగించిన తొమహాక్ మిస్సైల్ దూసుకెళ్లడంతో.. ఏకంగా 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది టీచర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటనపై ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేదు. అగ్రరాజ్యం అమెరికాకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పాఠశాలపై దాడి చేయాలని ఆదేశాలిచ్చిన అమెరికా యుద్ధనౌక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఫ్రీ యీ యార్క్, కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్ టేట్ల ఫొటోలను సోషల్ మీడియాలో బహిరంగంగా రిలీజ్ చేసింది. ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకుని తీరుతాం అంటూ దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా బలగాలు భారీ వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా నేవీ నౌకల నుంచి తొమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఆ సమయంలో దురదృష్టవశాత్తు ఒక మిస్సైల్ ఇరాన్‌లోని మినాబ్‌లో కిక్కిరిసి ఉన్న ఒక పాఠశాల భవనంపై పడింది. ఆ పాఠశాల ప్రాంగణంలోనే ఐఆర్‌జీసీకి సంబంధించిన ఒక స్థావరం ఉందని అమెరికా మొదట వాదించింది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాల తప్పుడు సమాచారంతోనే, కనీసం అక్కడ పసిపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అగ్రరాజ్యం ఈ దాడి చేసిందని అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. ఈ దాడిలో ఏకంగా 160 మందికి పైగా చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల కాస్తా క్షణాల వ్యవధిలో స్మశాన వాటికగా మారిపోయింది. ఈ దారుణం ఇరాన్ ప్రజల గుండెల్లో చెరగని గాయంగా మిగిలిపోయింది.
ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా ఇరాన్ మాత్రం ఆ నెత్తుటి మరకలను మర్చిపోలేదు. తాజాగా దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ అంశంపై అత్యంత తీవ్రంగా స్పందించింది. మినాబ్ పాఠశాలపై దాడి చేయాలని నేరుగా ఆదేశాలిచ్చిన అమెరికా యుద్ధనౌక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేఫ్రీ యీ యార్క్ , కమాండింగ్ ఆఫీసర్ లీ ఆర్ టేట్ ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమాయకులైన పసిపిల్లల ప్రాణాలు పొట్టనపెట్టుకోవడానికి మీకు ఎలా మనసు వచ్చింది? మీకు పిల్లలు లేరా? అంటూ ఆ ఇరాన్ ఎంబసీ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షిపణులు ప్రయోగించి వందలాది మంది చిన్నారుల మరణానికి కారణమైన ఈ ఇద్దరు అమెరికా అధికారులను ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఒక దేశం, మరో దేశానికి చెందిన మిలిటరీ అధికారుల ఫొటోలను నేరుగా రిలీజ్ చేసి ఇలా బహిరంగంగా బెదిరించడం అంతర్జాతీయంగా అత్యంత అరుదైన, ప్రమాదకరమైన పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ నుంచి ఈ హెచ్చరిక వెలువడటానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అమెరికా రాజకీయాల్లో కూడా హై టెన్షన్ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్‌కు ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. అమెరికా సైనిక అధికారులపై, తమ బలగాలపై గనక ఏ చిన్న దాడి జరిగినా.. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అగ్రనేత అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే.. ఇరాన్ అణువణువునా ప్రతీకారేచ్ఛతో రగులుతూ ఈ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ట్రంప్ బెదిరింపులకు తాము భయపడబోమని, పిల్లల చావుకు కారణమైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ పరిణామాలు చూస్తుంటే అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు నేరుగా వ్యక్తుల టార్గెటింగ్ వరకు వెళ్లిపోయిందని అర్థమవుతోంది. ఒకవైపు ట్రంప్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ ప్రతీకార బెదిరింపులు.. ఈ రెండు దేశాల మధ్య నడుస్తున్న ఈ పవర్ గేమ్ పశ్చిమాసియాను మరింత ఉద్రిక్త పరిస్థితులలోకి నెట్టేస్తోంది.



