ఒకే ఒక్కడు..30 ఇయర్స్ ట్రెండ్ సెట్టర్ జర్నీ..కళ్యాణ్ బాబు TO ఏపీ డిప్యూటీ సీఎం
సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో రికార్డులను తిరగరాసిన పవన్ కళ్యాణ్, తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిని చేరుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి.

తెలుగు చలనచిత్ర చరిత్రలో కొందరు నటులు వస్తారు, వెళతారు. కానీ కొందరు మాత్రమే ఒక ట్రెండ్ ను సెట్ చేస్తారు. ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యేలా ఒక తరాన్ని ప్రభావితం చేస్తారు. అలాంటి ఒక సెన్సేషన్ పేరు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనకంటూ ఒక సెపరేట్ మేనరిజం, స్టైల్, ఆటిట్యూడ్‌తో పవర్ స్టార్ గా ఎదిగారు. హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేని కల్ట్ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో రికార్డులను తిరగరాసిన పవన్ కళ్యాణ్, తన సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిని చేరుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1996 అక్టోబర్ 11న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పరిచయమైన కల్యాణ్ బాబు.. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు.
1996కి ముందు తెలుగు ఆడియన్స్‌కు ఆయన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కొణిదెల కల్యాణ్ బాబు మాత్రమే. అక్టోబర్ 11, 1996న ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన ' అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే రియల్ మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. కానీ, చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్‌లైన్ నుంచి బయటపడి, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అంత సులువు కాలేదు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. ఇక సుస్వాగతం సినిమాతో తొలిసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కాలేజీ స్టూడెంట్ గా పవన్ నటన, ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన ఎనర్జీ, స్టైల్ చూసి యూత్ మొత్తం ఫిదా అయిపోయింది. అక్కడి నుంచే టాలీవుడ్లో ఒక కొత్త స్టార్ ఉదయిస్తున్నాడన్న విషయం ఇండస్ట్రీకి అర్థమైంది. సుస్వాగతం సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వెనుతిరిగి చూసుకోలేదు. వరసగా ఆరు బ్లాక్ బస్టర్ హిట్స్.. ఆరేళ్ల పాటు ఆయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పటి యువతకు పవన్ కళ్యాణ్ ఒక యూత్ ఐకాన్.
సక్సెస్ ఉన్న దర్శకులతో ఏ హీరో అయినా సినిమాలు చేస్తాడు. కానీ కొత్త దర్శకుడి టాలెంట్‌ను నమ్మి.. అతడికి అవకాశమివ్వడం, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆ దర్శకుడు సెన్సేషనల్ హిట్ అందుకోవడం ఒక్క పవన్ విషయంలోనే జరిగింది. కరుణాకరన్ అనే దర్శకుడికి పవన్ అవకాశమివ్వకపోతే తొలిప్రేమ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చి ఉండేది కాదు. పూరీ జగన్నాథ్ అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే..బద్రి లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ వచ్చి ఉండేది కాదు. తమిళ దర్శకుడు కదా.. తెలుగు నేటివిటీతో ఏం సినిమా తీయగలడు అని పవన్ యస్.జే సూర్య ని లైట్ తీసుకొని ఉంటే.. ఖుషి లాంటి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ వచ్చి ఉండేది కాదు.
పవన్ సినిమాల్లో ముఖ్యంగా ఆయన వాడిన వస్తువులు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మార్కెట్లో ట్రెండ్ సెట్టర్‌గా మారాయి. డబుల్ ప్యాంట్స్, గ్యాప్ షర్ట్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బ్యాగ్ ఇలా ఆయన ఏం చేసినా అప్పట్లో కుర్రకారుకు ఒక ఫ్యాషన్. ఆయన హెయిర్ స్టైల్ కి ఫిదా కాని అమ్మాయి అంటూ ఉండదు. సొంతంగా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసుకోవడం, ఫైట్స్ కంపోజ్ చేసుకోవడం లాంటివి ఆయనకే చెల్లింది. అప్పుడే ఆయనకు అభిమానులు పవర్ స్టార్ అనే బిరుదును అందించారు.
ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కు ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. తాను స్వయంగా డైరెక్ట్ చేసిన జాని డిజాస్టర్ అవ్వడంతో పాటు, ఆ తర్వాత దశాబ్దం పాటు జల్సా మినహా సరైన హిట్ పడలేదు. కానీ ఆయన క్రేజ్ మాత్రం అణువంత కూడా తగ్గలేదు. వరుస పరాజయాలతో ఉన్న పవర్ స్టార్ కు 2012లో హరీష్ శంకర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ గిఫ్ట్ గబ్బర్ సింగ్. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు పవన్. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కంటెంట్ లీక్ అయినా సరే రికార్డులు క్రియేట్ చేయడం ఆయనకే సాధ్యమైంది. పాలిటిక్స్ లోకి వెళ్లిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మళ్లీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. పవన్ కళ్యాణ్ కు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లలో పండగే అన్నట్లుగా ఆయన ఫ్యాన్ బేస్ తయారైంది. ప్రస్తుతం ఓజీ , ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆయన లైనప్‌లో ఉన్నాయి. సగటు మనిషి పడుతున్న కష్టాలు చూసి, వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని, కోపం నుంచి పుట్టిన పార్టీయే జనసేన. 2014లో పార్టీ స్థాపించి, ఎన్నో అవమానాలు, ఓటములను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. ప్రజల పక్షాన నిలబడి పోరాడారు. ఆ పోరాటానికి ప్రతిఫలమే 2024 జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో జనసేన అద్భుత విజయం సాధించడం. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సినిమాల్లో పవర్ స్టార్ గా ముప్పై ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలోనూ అదే పవర్ ను చూపిస్తున్నారు.
ఇక ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఒక ఎమోషనల్ నోట్‌ను రిలీజ్ చేశారు. డియర్ పవన్ కల్యాణ్, మనిద్దరం కలిసి చేసిన మొదటి సినిమా విడుదలై 30 ఏళ్లు దాటిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇది వినగానే ఆశ్చర్యంతో పాటు తీవ్రమైన షాక్‌కు గురయ్యాను. ఇండస్ట్రీలో నీ ప్రయాణం ఎవరికీ సాధ్యంకాని రీతిలో తిరుగులేనిదిగా నిలిచింది. సమాజానికి నీవు చేస్తున్న సేవలు, నీ విజన్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నీవు ఎంచుకునే ప్రతి బాటలోనూ మరిన్ని మహత్తర విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అల్లు అరవింద్ నోట్ పోస్ట్ చేశారు.



