ఎప్పుడెప్పుడు వస్తాయా? ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్!

కొన్ని సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని సుదీర్ఘంగా అభిమానులు నిరీక్షిస్తున్నారు. అందులో ముందుగా చెప్పుకునే సినిమా దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న నటుడు అగ్రకథానాయకుడు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’. ఒకప్పుడు ఆయన నుండి వచ్చిన సోసియో ఫాంటసీ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్న సోషియో ఫాంటసీ ఈ ‘విశ్వంభర’. దీని విడుదల కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తూనే ఉన్నారు. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. వశిష్ఠ దర్శకత్వంలో ముస్తాబైన ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అప్డేట్స్ తోనే అంచనాలు పెంచేసింది. వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ సినిమా అయితే ఇప్పుడీ సమస్యలన్నీచక్కబడడంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇది సంక్రాంతి బరిలో నిలుస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఇప్పటికే మెగాస్టార్ నటిస్తున్న మరో సినిమా 'కాకా' సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించడంతో మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే విధంగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్ తో పాటు అఫిషియల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇక ‘కార్తికేయ’ సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'. కొన్ని కారణాలతో ఈ సినిమా కూడా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కూడా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిసెంబరులో లేదంటే వచ్చే వేసవి సీజన్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆసక్తికర కాంబినేషన్ లో తెరకెక్కిన మరో సినిమా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్'. హీరో విజయ్ సేతుపతి - దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందిన ఈ సినిమా విడుదల గురించి కూడా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మూవీ టీమ్ ఈ సినిమాని కూడా త్వరలోనే విడుదల చేసే పనిలో ఉంది. అతి త్వరలోనే విడుదల తేదీపైక్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది. వైవిధ్య సినిమాలతో ఆకట్టుకునే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న సినిమా 'భరత వర్ష'. కూడా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని 2027 ప్రథమార్ధంలో విడుదల చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా ఎనౌన్స్ మెంట్లతోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.



