గల్ఫ్ గగనతలంలో తీవ్ర ఉద్రిక్తతలు..భద్రతను కట్టుదిట్టం చేసిన సౌదీ

ప్రపంచంలోనే అత్యంత భద్రత ఉంటుందని భావించే ఒక దేశ రాజధాని ఇప్పుడు అగ్నిగుండంగా మారింది. ఏ క్షణాన ఆకాశం నుంచి మృత్యువు దూసుకొస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పేరున్న విమానాశ్రయం.. ఇప్పుడు నెత్తురోడింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన భయంకరమైన డ్రోన్, క్షిపణి దాడులు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దెబ్బతో సౌదీ విమానయాన వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది.సౌదీ అరేబియా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా దేశానికి కాబోయే రాజు ప్రాణ భయంతో అండర్ గ్రౌండ్ బంకర్లోకి వెళ్లిపోయాడు .దీనిని బట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అక్టోబర్ 10 , 11 తేదీలు శని, ఆదివారాలు. వీకెండ్ కావడంతో రియాద్ కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఎవరూ ఏమాత్రం ఊహించని విధంగా ఆకాశం నుంచి వరుసగా సూసైడ్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఎయిర్‌పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయి. సౌదీ అరేబియాకు చెందిన పాట్రియట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్నింటిని గాలిలోనే పేల్చేసినప్పటికీ, కొన్ని డ్రోన్లు నేరుగా వచ్చి ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 4 పై పడ్డాయి. పెద్ద శబ్దంతో టెర్మినల్ పైకప్పు కుప్పకూలింది. ఎటు చూసినా మంటలు, దట్టమైన పొగ. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ తొక్కిసలాట , పేలుళ్లలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఉమ్రా యాత్రకు వెళ్లి వస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అతని భార్య, పిల్లలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనతో సౌదీ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అక్టోబర్ 17 వరకు రియాద్ ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు సౌదీ ఏవియేషన్ అథారిటీ అధికారికంగా ప్రకటించింది.
ఈ దాడుల ప్రభావం కేవలం ఒక ఎయిర్‌పోర్ట్‌కే పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాల విమానయాన రంగం మొత్తం స్తంభించిపోయింది. గత 48 గంటల్లో సౌదీ వ్యాప్తంగా 1,500కు పైగా అంతర్జాతీయ , దేశీయ విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోని దిగ్గజ ఎయిర్‌లైన్స్ అయిన ఎమిరేట్స్, ఇతిహాద్‌తో పాటు.. మన దేశానికి చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా వంటి సంస్థలు కూడా సౌదీకి వెళ్లే తమ విమానాలను నిరవధికంగా రద్దు చేశాయి. దీనికి ప్రధాన కారణం.. హౌతీ మిలిటరీ ప్రతినిధి ఇచ్చిన ఒక బహిరంగ హెచ్చరిక. సౌదీ అరేబియాలోని ఏ ఎయిర్‌పోర్ట్‌ను, ఎయిర్ స్పేస్ ను ఉపయోగించవద్దు. అవి మా తదుపరి లక్ష్యాలు అని విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అంటే కేవలం రియాద్ మాత్రమే కాదు, దమ్మామ్, జెద్దా వంటి ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లకు కూడా ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. దీంతో ఇండియా నుంచి సౌదీకి ఉపాధి కోసం వెళ్లే వేలాది మంది కార్మికులు, అలాగే సౌదీ నుంచి ఇండియాకు రావాల్సిన వారు ఎయిర్‌పోర్ట్‌లలోనే చిక్కుకుపోయారు. పరిస్థితి ఏ స్థాయిలో చేజారిపోయిందంటే, ఈ దాడుల దెబ్బకు సౌదీ అరేబియాకు కాబోయే దేశాధినేత, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఆయనను అత్యంత రహస్యమైన, బాంబు దాడులను తట్టుకునే అండర్ గ్రౌండ్ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. గత వారం రోజులుగా ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. మరోవైపు సౌదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఆరు భాషల్లో అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశంలో క్షిపణులు వెళ్తున్నా, రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకుంటున్నా.. ఎవరూ మొబైల్స్‌లో వీడియోలు తీయకూడదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్ బ్రేక్ చేస్తే వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే, ఆ వీడియోల ద్వారా సౌదీ రక్షణ వ్యవస్థలు ఎక్కడున్నాయో హౌతీలకు సులభంగా తెలిసిపోతుంది.
హౌతీలు ఎందుకు సరిగ్గా ఇదే సమయాన్ని ఎంచుకున్నారు? రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి వెనుక వాళ్ల మాస్టర్ ప్లాన్ ఏంటి? అంటే..దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది వరల్డ్ పెట్రోలియం కాంగ్రెస్ . ఈ వారంలో సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకంగా ఒక భారీ గ్లోబల్ ఆయిల్ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది. ప్రపంచం నలుమూలల నుంచి అతిపెద్ద చమురు కంపెనీల సీఈవోలు, దేశాధినేతలు రియాద్‌కు రావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమ్మిట్‌కు ముందే దాడులు చేయడం ద్వారా, మీ దేశంలో మీకే భద్రత లేదు, విదేశీ పెట్టుబడులు ఎలా రక్షిస్తారు? అని సౌదీ పరువును అంతర్జాతీయ వేదికపై తీయడమే హౌతీల అసలు టార్గెట్. ఇక రెండవది, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం. ఎయిర్‌పోర్ట్‌లతో పాటు సౌదీ చమురు గుండెకాయ అయిన అరామ్కో ఫెసిలిటీలపైన కూడా హౌతీలు దాడులు చేస్తున్నారు. ఈ హౌతీలకు ఇరాన్ దేశం పూర్తి స్థాయిలో ఆయుధాలు, నిధులు, డ్రోన్ టెక్నాలజీని అందిస్తోంది. ఇరాన్ మద్దతుతోనే ఈ హై-టెక్ దాడులు జరుగుతున్నాయని అమెరికా , సౌదీ బలంగా నమ్ముతున్నాయి.
ఈ యుద్ధం కేవలం సౌదీ , హౌతీల మధ్య మాత్రమే అనుకుంటే మనం పొరబడినట్లే. దీని ప్రభావం నేరుగా మన జేబుల మీద పడుతుంది. సౌదీపై దాడులు జరిగితే, చమురు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటాయి. అదే సమయంలో, ఎర్ర సముద్రంలో కూడా హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపు అయ్యాయి. ఈ రెండు పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.ఒక దేశ అంతర్యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎలా శాసిస్తోందో ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. అత్యాధునిక ఆయుధాలు ఉన్న సౌదీ అరేబియా కూడా ఈ డ్రోన్ దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోవడం ఆందోళన కలిగించే విషయం.



