గురజాల గడ్డపై గెలుపెవరిది..?
గురజాల గడ్డపై రాజకీయ వేడి..గత విజయాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా..?..కూటమి కొత్త వ్యూహాలు

పల్నాడు జిల్లా గురజాల మున్సిపాలిటీ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ మొదలవడంతో.. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ తమతమ వ్యూహాలకు పదును పెడుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో గత మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. 2021 మున్సిపల్ ఎన్నికల్లో గురజాల మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పలు వార్డుల్లో విజయం సాధించారు. మరి అప్పట్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును వైసీపీ మరోసారి తనకు అనుకూలంగా మలుచుకోగలదా..? లేక ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి గురజాల మున్సిపాలిటీపై పట్టు సాధించి గత ఫలితాలను తిరగరాయాలని చూస్తుందా..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత విజయాలు భవిష్యత్తు గెలుపునకు హామీ ఇవ్వవు.. అలాగే అధికారంలో ఉండటం కూడా విజయాన్ని ఖాయం చేయదు. అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలు, ప్రజల మద్దతు, పార్టీ శ్రేణుల పనితీరు.. ఇవన్నీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా మారనున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు గురజాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధినేత సూచించిన నేపథ్యంలో.. స్థానిక నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేసే ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుకోవడం, ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకోవడం, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనువైన అభ్యర్థులను గుర్తించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే సమావేశాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా కనిపించడం ఒక ఎత్తయితే.. ఆ ఉత్సాహాన్ని ఎన్నికల సమయంలో ఓట్లుగా మార్చుకోవడం మరో ఎత్తు. గత విజయాలను గుర్తు చేసుకోవడంతో పాటు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.


