తగ్గేదేలేదంటూ డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్…రష్యా కౌంటర్ ఎటాక్ ఎలా ఉండబోతోంది?

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. మొదలైనప్పుడు చిన్న దేశం ఉక్రెయిన్ ఎప్పుడో చేతులెత్తేస్తుందని అందరూ భావించారు. కానీ ఉక్రెయిన్ ప్రదర్శిస్తున్న తెగువ, పోరాట పటిమ అగ్రరాజ్యం రష్యాకే కొరకరాని కొయ్యలా మారింది. తాజాగా ఉక్రెయిన్ భారీస్థాయిలో రష్యాపై విరుచుకుపడింది. ఏకంగా 1,300 కు పైగా డ్రోన్లను రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించింది. 2022లో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత, ఉక్రెయిన్ రాజధాని కీవ్ జరిపిన అత్యంత భారీ, అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్ ఇదే కావడం గమనార్హం. దీంతో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వంలో ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లలో చాలావాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా గాల్లోనే అడ్డుకున్నాయని, పేల్చివేశాయని రష్యా రక్షణశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ అడ్డుకోలేని డ్రోన్లు మాత్రం రష్యా భూభాగంపై భారీ విధ్వంసాన్నే సృష్టించాయి. ఈ వైమానిక దాడుల్లో భాగంగా ఉక్రెయిన్ ప్రధానంగా ఒక కీలకమైన నిర్మాణాన్ని టార్గెట్ చేసింది. అదే రష్యాను, క్రిమియా ఐలాండ్ తో కనెక్ట్ చేసే అత్యంత పొడవైన వంతెన. యూరప్ లోనే అత్యంత పొడవైన వంతెనగా పేరొందిన ఈ బ్రిడ్జి రష్యాకు సైనికంగా చాలా ముఖ్యం. ఈ వంతెనపైకి డ్రోన్లు దూసుకురావడంతో, అప్రమత్తమైన అధికారులు వెంటనే వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. దీనివల్ల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని క్రిమియా గవర్నర్ స్వయంగా వెల్లడించారు. ఈ వంతెనను దెబ్బతీయడం ద్వారా క్రిమియాలోని రష్యా బలగాలకు సప్లై చైన్‌ను కట్ చేయాలన్నదే ఉక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ ప్రయోగించిన ఈ 1300 డ్రోన్ల లక్ష్యం కేవలం సైనిక స్థావరాలు కాదు. రష్యాకు ఎకానమీ పరంగా ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. కొన్ని నెలలుగా రష్యా భూభాగంతో పాటు క్రిమియా, నల్ల సముద్రం , అజోవ్ సముద్రంలో ఉన్న లక్ష్యాలపై ఉక్రెయిన్ తన వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. ముఖ్యంగా రష్యా చమురుశుద్ధి రంగాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. యుద్ధం చేయడానికి రష్యాకు డబ్బు కావాలి. ఆ డబ్బు రష్యాకు కేవలం ఆయిల్, గ్యాస్ ఎగుమతుల ద్వారానే వస్తుంది. అందుకే ఆ చమురు శుద్ధి కర్మాగారాలను, ఆయిల్ డిపోలను టార్గెట్ చేసి ఈ కామికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగిస్తోంది. రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో ఇప్పటివరకు ఏకంగా 55 శాతానికి పైగా దెబ్బతీశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. ఇది నిజంగా రష్యా ఆర్థిక వ్యవస్థకు ఒక కోలుకోలేని దెబ్బ. ఫ్యాక్టరీలు కాలిపోతుండటంతో రష్యా లోపల కూడా ఇంధన కొరత ఏర్పడే పరిస్థితి వస్తోంది.



