పాకిస్తాన్‌ను వణికించిన అతనికి బిగ్ షాక్…బలూచ్ ఆర్మీలో అసలేం జరుగుతోంది?

పాకిస్థాన్ ఆర్మీకి కొరకరాని కొయ్యలా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ లో ఇప్పుడు పెను తుఫాను రేగింది. బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయంద్ బలూచ్ నవంబర్ 3న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, బషీర్ జెబ్ ఇకపై కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగరని సంచలన ప్రకటన చేశారు. ఆయన చేతిలో ఉన్న పరిపాలనా , సైనిక, విధానపరమైన అధికారాలన్నీ లాగేసుకున్నారు. తదుపరి నాయకుడి నియామకం జరిగే వరకు ఆ అధికారాలను సంస్థ సీనియర్ కమాండ్ కౌన్సిల్‌కు బదిలీ చేసినట్లు ప్రకటించారు. అక్టోబర్ 16న జరిగిన సంస్థ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బలూచిస్థాన్ పోస్టు కథనం వెల్లడించింది. 2018లో సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో రూపొందించిన నిబంధనల ప్రకారమే ఈ నాయకత్వ మార్పు జరిగిందని, ఎంతటి కీలక నాయకుడైనా జీవితాంతం కమాండర్ ఇన్ చీఫ్‌గా కొనసాగడానికి వీల్లేదని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మార్పు ఎలాంటి అంతర్గత విభేదాలు, ఘర్షణలు లేకుండానే జరిగిందని స్పష్టం చేసింది. అయితే ఇది ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే బషీర్ జెబ్ను ఎందుకు తొలగించారు అన్న అసలు కారణం అందులో చెప్పలేదు. బషీర్ జెబ్ తొలగింపు వెనుక ఉన్న అసలు కారణాలను పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ విశ్లేషించింది. సంస్థ సైనిక వ్యూహాలపై బీఎల్ఏ కమాండర్ల మధ్య తీవ్రస్థాయిలో నెలకొన్న విభేదాలే బషీర్ జెబ్ పదవి పోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి 31న ప్రారంభమైన ఆపరేషన్ హెరోఫ్-2 వైఫల్యమే బషీర్ జెబ్ పై వేటుకు కారణమా అనే వాదన వినిపిస్తోంది. ఈ ఆపరేషన్ లో భాగంగా బలూచిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో BLA ఒకేసారి సమన్వయ దాడులు నిర్వహించింది. అయితే ఈ వ్యూహం దారుణంగా బెడిసికొట్టింది. బషీర్ జెబ్ మొండితనం వల్ల పాకిస్థాన్ భద్రతా బలగాలు చేపట్టిన ప్రతిదాడుల్లో BLAకు భారీ నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో కనీసం 215 మంది BLA సభ్యులు మరణించినట్లు పాకిస్థాన్ అంచనా వేయగా, BLA మాత్రం 96 మంది మరణించినట్లు అంగీకరించింది. ఈ ఘోర వైఫల్యం వల్లే ఫిబ్రవరి నుంచే బషీర్ జెబ్ను కీలక నిర్ణయాల నుంచి సంస్థ పక్కన పెట్టిందని సమాచారం.



