వాయు కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలివే..!

చలికాలం సమీపించిందంటే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మిగిలిన సీజన్స్ తో పోలిస్తే శీతాకాలంలో వాతావరణ మార్పుల వల్ల గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తుంది. ఇక మన దేశ రాజధాని ప్రాంతంలో ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఎన్సీఆర్ పరిధిలో గతకొన్నేళ్లుగా వాయు కాలుష్యం ఆందోళనకరంగా ఉంటోంది. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ మరిన్ని చర్యలను చేపట్టనుంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా 'ఎక్స్'లో పోస్టు పెట్టింది. ఢిల్లీలో వాయునాణ్యత 382 మార్కు టచ్ అయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301-400 మధ్యలో ఉంటే నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లే. ఇక దీపావళి కూడా వస్తుండడంతో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.
కేవలం ప్రభుత్వాలు లేదా అధికారులు మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మనరోజువారీ జీవితంలో చేసుకునే చిన్న చిన్న మార్పులు గాలి నాణ్యతను మెరుగుపరచడంలో మరియు భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.
రవాణా రంగం నుండి వెలువడే పొగ వాయు కాలుష్యానికి అతిపెద్ద కారణం. దీనిని అరికట్టడానికి పౌరులుగా మనం వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించాలి. తక్కువ దూర ప్రయాణాలకు సొంత వాహనాలను పక్కన పెట్టి కాలినడకన వెళ్లడం లేదా సైకిళ్లను వాడటం అలవాటు చేసుకోవాలి. రోడ్లపై వాహనాలు వీలైనంత తక్కువగా ఉండే విధమైన చర్యలతో అరికట్టవచ్చు. వాహనాల సరైన నిర్వహణ కూడా గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో ముఖ్యమైన భాగం. మనం ఉపయోగించే మోటార్ సైకిళ్లు, కార్లకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం మరియు PUC నిర్వహించుకోవడం బాధ్యతగా భావించాలి. సిగ్నల్స్ వద్ద లేదా ట్రాఫిక్ జామ్లలో చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజిన్ను ఆఫ్ చేయడం అనవసరమైన పొల్యూషన్ ను తగ్గించవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ప్రాంగణాల్లో, కాలనీల్లో విరివిగా మొక్కలు నాటాలి. ప్రత్యేకించి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే వేప, రావి, తులసి వంటి మొక్కలను పెంచడం మంచిది. అలాగే ఉన్న చెట్లను నరకకుండా కాపాడుకోవడం, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కమ్యూనిటీ తోటల పెంపకంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. ఎండిన ఆకులు, సేంద్రీయ వ్యర్థాలతో తగలేయకుండా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా వర్గీకరించడం ద్వారా వాటిని రీసైక్లింగ్ ప్రక్రియకు పంపాలి అంతేకాని వాటికి నిప్పుపెట్టకూడదు.గృహ అవసరాలలో స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా కూడా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను అమర్చుకోవాలి. అంతేకాకుండా, బాణసంచా రహిత పండుగలను జరుపుకోవడం, పర్యావరణహిత ఉత్పత్తులను ఎంచుకోవడం ద్వారా పౌరులుగా మనం పరిశుభ్రమైన వాతావరణాన్ని సాధించవచ్చు.



