పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ..ఈ పథకానికి ఎవరు అర్హులు? నిబంధనలు ఏంటి?
కామెంట్లు (0)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది రైతులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. పాడి పశువులను పోషించే రైతులకు అత్యంత పెద్ద సమస్య పశుగ్రాసం . ఎండాకాలం వచ్చినా లేదా వర్షాలు పడకపోయినా, పశువులకు గడ్డి దొరక్క రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బయట మార్కెట్లో దాణా కొందామంటే విపరీతమైన రేట్లు. పాలు అమ్మి సంపాదించిన డబ్బంతా ఆ మేతకే ఖర్చవుతోంది. కానీ, ఇకపై ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైతులకు అండగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రకటించింది. మీ సొంత పొలంలో, మీ పశువుల కోసం పశుగ్రాసాన్ని మీరే సాగు చేసుకుంటే.. అందుకయ్యే ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఏకంగా ఎకరానికి రూ.69,781 ఆర్థిక సాయంగా అందిస్తోంది. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేశారు దీనినే వీబీ జీరామ్జీ పథకం అంటారు. ఈ స్కీమ్ కింద ఎంపికైన రైతులకు రెండేళ్ల కాలపరిమితికి గానూ గరిష్ఠంగా ఎకరానికి రూ.69,781 ఆర్థిక సాయంగా అందిస్తారు.
ఇక్కడ స్పష్టం చేయాల్సిన అంశం. ఈ 69 వేలు ఒకేసారి వారి అకౌంట్లో వెయ్యరు. ఇది మొక్కల ఖర్చు , కూలీ పనులకు సంబంధించిన చెల్లింపుల మొత్తం. అంటే.. మీరు మీ పొలంలో పశుగ్రాసం సాగు చేసినప్పుడు, విత్తనాలు లేదా గడ్డి మొక్కలు కొనడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే, ఆ గడ్డి నాటడానికి, కోయడానికి మీ కుటుంబ సభ్యులు లేదా కూలీలు పనిచేస్తే, వాళ్లకు ఉపాధి హామీ పథకం కింద రోజువారీ కూలీ డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడతాయి. అలా మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి గరిష్టంగా వారికి అందనున్న ప్రయోజనం విలువ ఇదన్నమాట. దీనివల్ల మీకు బయట నుంచి గడ్డి కొనాల్సిన ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, పని చేసినందుకు కూలీ డబ్బులు కూడా మీ చేతికే వస్తాయి.


