పీఓకేలో పాక్ ఆర్మీ అరాచకం..రావల్కోట్ లో రణరంగం.. పాక్ ఆర్మీకి తిరుగుబాటు సెగ!

దశాబ్దాలుగా పాకిస్థాన్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ ఆర్మీ అకృత్యాలలో నలిగిపోతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా బద్దలైంది. పీఓకే ప్రజలు తమ కనీస హక్కుల కోసం, తమ వనరుల కోసం మిలిటరీకి ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఈ పరిణామాలను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్థాన్ ఆర్మీ, నిరాయుధులైన పౌరులపై అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తోంది. సొంత ప్రజలనే దారుణమైన ఆగడాలకు పాల్పడుతోంది. ప్రస్తుతం పీఓకేలోని రావల్కోట్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఉమర్ ఫరూఖ్ చౌక్ సమీపంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై పాకిస్థాన్ భద్రతా దళాలు ఏకంగా డ్రోన్ దాడులకు , విచక్షణారహిత తుపాకీ కాల్పులకు తెగబడ్డాయి. ఈ కిరాతక దాడిలో ముగ్గురు పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే కనికరం కూడా లేకుండా పాక్ సైన్యం చేస్తున్న ఈ మారణహోమం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో అతిపెద్ద కలకలం రేపుతోంది. శత్రు దేశంపై యుద్ధం చేసినట్లుగా, పాకిస్తానీ సైనికులు గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచే పీఓకే పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. నిద్రపోతున్న వారిని కూడా వదలకుండా, ఏమాత్రం కనికరం లేకుండా... వార్నింగ్ ఇవ్వకుండా పాక్ భద్రతా బలగాలు డ్రోన్లతో బాంబులు విసిరాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన కొన్ని విజువల్స్ స్థానికులు ప్రాణాలకు తెగించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో, పాక్ ఆర్మీ అకృత్యాలు ఇప్పుడు ప్రపంచం ముందు బట్టబయలయ్యాయి. తాము ఉగ్రవాదులం కాదని తమ హక్కులు అడుగుతున్న సామాన్య పౌరులం అని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎలాంటి ఆయుధాలు లేని ప్రజలపై, అత్యంత అధునాతన డ్రోన్లతో దాడులు చేయడం పాక్ ఆర్మీ క్రూరత్వానికి, వారి పిరికితనానికి అద్దం పడుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.



