పొగాకు పంటకు వాతావరణ ముప్పు.. రైతులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే!

భారతదేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ పొగాకుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు సాగులో ఏపీ రైతులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రైతుల పాలిట ఇది ఒక వాణిజ్య పసిడి పంట. అయితే, ఒకప్పుడు సిరులు కురిపించిన ఈ పొగాకు సాగు.. ఇప్పుడు వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు, అకాల వర్షాలు, ఎల్-నినోలాంటి భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఏపీ పొగాకు రైతుల వెన్ను విరుస్తున్నాయి. పొగాకు పంట దిగుబడి, ఆకుల పరిమాణం, నాణ్యత అనేవి వాతావరణంపై అత్యంత సున్నితంగా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత వాతావరణ మార్పులు పొగాకు సాగులో ఉత్పత్తి అనిశ్చితికి, నాణ్యతలో భారీ హెచ్చుతగ్గులకు దారితీస్తున్నాయి. దీనివల్ల రైతుల సాగు ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.
ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ సమాచారం ప్రకారం, ఏపీలో సుమారు 1 లక్షా 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వర్జీనియా పొగాకు సాగు జరుగుతోంది. ఇందులో కేవలం ప్రకాశం , నెల్లూరు జిల్లాల్లోనే అత్యధికంగా సుమారు 75 వేల హెక్టార్లలో ఈ సాగు ఉంది. పొగాకు పంటకు సుమారు 27 డిగ్రీల సెల్సియస్ మితమైన ఉష్ణోగ్రతలు, 100 నుంచి 120 మంచు రహిత రోజులు చాలా అవసరం. కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య విపరీతమైన తేడాలు వస్తున్నాయి. అసాధారణమైన వేడి పరిస్థితుల వల్ల మొక్కలో నీటి వినియోగం విపరీతంగా పెరిగిపోయి నీటి ఒత్తిడి కలుగుతోంది. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఆకుల విస్తరణ ఆగిపోవడం, కాండం సరిగ్గా పెరగకపోవడం, నేలలోని పోషకాలను మొక్క తీసుకోలేకపోవడం జరుగుతోంది. దీనివల్ల ఆకుల రసాయనిక నిర్మాణమే మారిపోతోంది. దీనికి తోడు వర్షపాత అస్థిరత అతిపెద్ద ప్రమాదంగా మారింది. పొగాకుకు మొత్తం ఎంత వర్షం పడింది అన్నది ముఖ్యం కాదు, వర్షం ఎప్పుడు, ఎంత విరామంతో పడింది అన్నదే ముఖ్యం. ఏపీలో సగటున 800 నుంచి 1000 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనా.. వర్షం ఆలస్యం కావడం, లాంగ్ గ్యాప్స్ రావడం, లేదా ఒక్కసారే కుండపోత వర్షం పడటం వల్ల మొక్కలకు నీటి లభ్యతలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతోంది. తేలిక నేలల్లో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తక్కువ కాబట్టి ఈ మార్పులు పంటను నేరుగా దెబ్బతీస్తున్నాయి.



