పొరుగు దేశానికి భారత్ భారీ భరోసా.. నేపాల్ అభివృద్ధికి మెగా ప్యాకేజీ!

ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా శరవేగంగా దూసుకుపోతోన్న భారత్ పొరుగు దేశం నేపాల్ కు భారీ డెవలప్మెంట్ ప్యాకేజ్ ను ప్రకటించింది. దీని విలువ 24,000 కోట్ల నేపాలీ రూపాయిలు. భారత్ కరెన్సీలో రూ.15,109 కోట్లు. భారత్ సాయంతో పలు ప్రాజెక్టులను నేపాల్ చేపట్టనుంది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా భారత్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇరువురి నేతలతో కీలక చర్చలు జరిగాయి. నేతలిద్దరూ కలిసి భారత్ సాయంతో నేపాల్ చేపట్టే భారీ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. యూపీలోని అయోధ్య నుండి నేపాల్ లోని జనక్ పూర్ మధ్య ప్రయాణించే రైలును జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశం, నేపాల్ దేశాల మధ్య ఉన్న బంధం కేవలం పొరుగు దేశాల సంబంధం మాత్రమే కాదని అది ఆత్మీయ అనుబంధం, బంధుత్వం, చెక్కుచెదరని నమ్మకానికి ప్రతీకని కొనియాడారు.
2025 సంవత్సరంలోనే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించారు. ఈ పవిత్రమైన అనుబంధానికి నేడు “సర్యూ-కమలా ఎక్స్ప్రెస్” రైలు సేవను ప్రారంభించడం ద్వారా సరికొత్త డైమన్షన్ జోడిస్తున్నట్లు తెలిపారు.
నేపాల్ పునర్నిర్మాణానికి అభివృద్ధి కోసం ఈ భారీ ప్యాకేజ్ ప్రకటించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒకరి అభివృద్ధిలో ఒకరు భాగస్వామ్యులమని క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడినట్లు చెప్పారు. నేపాల్ ఈ ఆగష్టులో సంభవించిన వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. భారత్ తమకు ఎంతో విశ్వాసమైన పొరుగు దేశమని విపత్కర కష్ట సమయాల్లో అండగా నిలిచినట్లు బాలేంద్ర షా అన్నారు. రెండు దేశాల మధ్య పటిష్టమైన సంబందాలున్నాయన్నారు. భారత్ అందించిన ఈ భారీ సహాయంపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా హర్షం వ్యక్తం చేశారు. భారత్ తమకు అత్యంత విశ్వసనీయమైన పొరుగు దేశమని, ఆపద సమయంలో ఆదుకునే నిజమైన మిత్రుడని ఆయన కొనియాడారు. చరిత్రలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా భారత్ తమకు అండగా నిలబడిందని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ ప్రత్యేక సంబంధం భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని, నేపాల్ అభివృద్ధిలో భారత పాత్ర ఎప్పటికీ మరువలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు.



