మేం విడాకులు తీసుకోలేదు.. కృష్ణవంశీతో బంధంపై రమ్యకృష్ణ కీలక వ్యాఖ్యలు!

ఒకప్పటి హీరోయిన్ గా, ఇప్పుడు విలక్షణ పాత్రలతో దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూముందుకు సాగుతున్నారు నటి రమ్యకృష్ణ . తన అందం, అభినయంతో తెలుగులో కూడా తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంపై గత కొన్నేళ్లుగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది రమ్యకృష్ణ. అయితే పెళ్లైన కొన్ని రోజులకే వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వీరు విడాకులు తీసుకోబోతున్నారని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా విడివిడిగా బతుకుతున్నారని సోషల్ మీడియాలో తరచూ ప్రచారం జరుగుతుంటుంది. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలపై ఎక్కడా స్పందించని రమ్యకృష్ణ.. తొలిసారిగా ఈ పుకార్లన్నింటికీ ఒక ఇంటర్వ్యూలో ఫుల్స్టాప్ పెట్టారు. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ గా మాట్లాడారు. విడాకుల పుకార్లపై యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ మేము విడిపోలేదు.. వంద శాతం ఇంకా భార్యాభర్తలమే. మా పెళ్లి బంధం చెక్కుచెదరలేదు అని స్పష్టం చేశారు. అయితే వారిద్దరూ ఒక స్పష్టమైన అవగాహనతో, సంతోషంగా వేర్వేరు సిటీల్లో ఉంటున్నామని ఆమె చెప్పారు. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటే, కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటారు. ఇలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో కూడా ఆమె వివరించారు. తమ కొడుకు రిత్విక్ పుట్టినప్పుడు ఆమె చెన్నైలో కొన్ని టీవీ సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నట్లు చెప్పారు. ఆ సమయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి చెన్నైకి ట్రావెల్ చేయాల్సి వచ్చేది. అయితే అలా వచ్చి వెళ్లిన ప్రతిసారీ కొడుకు అనారోగ్యానికి గురయ్యేవాడు. పైగా ఆ సమయంలో హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమం , బంద్‌లు, స్కూల్ సెలవుల వల్ల వాడి చదువుకు ఆటంకం కలిగింది. దీంతో కృష్ణవంశీతో చర్చించి, వాడిని చెన్నైలోనే చదివించాలని నిర్ణయించుకున్నాం. అలా ఇద్దరి మ్యూచువల్ అంగీకారంతో నేను నా కొడుకుతో చెన్నై షిఫ్ట్ అయ్యాను అని రమ్యకృష్ణ అసలు నిజాన్ని బయటపెట్టారు.



