రూ.2.5 కోట్లతో తీస్తే…వచ్చింది రూ.50 కోట్లు!..బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న చిన్న సినిమా!
కామెంట్లు (0)

వందల కోట్ల బడ్జెట్ ఉండాలి, పాన్ ఇండియా స్టార్స్ రోజుకు పది ఈవెంట్లతో ప్రమోషన్స్.. ఇదీ ప్రస్తుత సినిమా ట్రెండ్. కానీ, ఇవేవీ లేకుండా కేవలం కంటెంట్‌ను నమ్ముకుని, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథతో వస్తే బాక్సాఫీస్ బద్దలవుతుందని ఒక చిన్న కన్నడ సినిమా నిరూపించింది. స్టార్ హీరోలు లేరు, భారీ బడ్జెట్ లేదు, కనీసం పోస్టర్లు అంటించడానికి కూడా జేబులో డబ్బుల్లేని పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సినిమా ఏకంగా 50 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టిస్తోంది. అదే ప్రేమద ఊరాలి. కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయినరోజు పెద్దగా సందడి చేయలేదు. తొలిరోజు సుమారు 9 లక్షల వసూళ్లతోనే సరిపెట్టుకుంది. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్ టాక్‌తో క్రమంగా థియేటర్లకు జనం క్యూ కట్టారు. మొదట కేవలం 60 షోలకే ప్రదర్శితమైన ఈ సినిమా.. ఆ తర్వాత మరిన్ని థియేటర్లలోకి వెళ్లింది. రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇప్పటి వరకూ బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కొట్టడం వెనుక ఉన్న కష్టం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. మనోజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది, కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పటికే అప్పులు చేసి బడ్జెట్ మొత్తం దాటిపోయింది. ఇంకొక్క షాట్ తీస్తే సినిమా పూర్తవుతుంది. కానీ ఆ రోజుకు ప్యాకప్ చెబితే, మరుసటి రోజు షూటింగ్ చేయడానికి సెట్ ఖర్చులు, కెమెరా అద్దెలు కట్టడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో దిక్కుతోచని డైరెక్టర్ మనోజ్ కుమార్ ఏడుస్తూ తన తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, ఈ రోజుతో బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సీన్ ఒకే టేక్‌లో రాకపోతే, రేపు మళ్లీ షూటింగ్ పెట్టాలి. దానికి డబ్బుల్లేవు. రేపు పొద్దున్నే నీ మంగళసూత్రాలు తాకట్టు పెట్టడానికైనా తీసుకురా అమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ మాటలు సెట్లో ఉన్న నటీనటులు విన్నారు. దర్శకుడి ఆవేదన వాళ్ళ గుండెల్ని పిండేసింది. ఏమాత్రం తప్పు జరిగినా ఆ తల్లి మెడలోని తాళి తాకట్టుకు పోతుందని వారికి అర్థమైంది. అంతే, బరువైన హృదయాలతో వాళ్ళు కెమెరా ముందుకు వెళ్లారు. తమ ప్రాణం పెట్టి నటించారు. దర్శకుడు చెప్పినట్లే కేవలం ఒక్క టేక్‌లోనే ఆ ఎమోషనల్ సీన్ పూర్తయింది. షాట్ ఓకే అవ్వగానే మనోజ్ కుమార్ పరుగెత్తుకెళ్లి నటీనటులను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. వెంటనే తల్లికి ఫోన్ చేసి,షూటింగ్ పూర్తయిందమ్మా, నీ మంగళసూత్రం తాకట్టు పెట్టాల్సిన పనిలేదు అని చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ఒక ఇంటర్వ్యూలో పంచుకుని ఎమోషనల్ అయ్యారు.
నిజానికి మనోజ్ కుమార్‌కు టాలెంట్ లేక కాదు ఈ కష్టాలు. ఆయన గతంలో తీసిన అక్షి అనే కన్నడ చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఆ సినిమా సత్తా చాటింది. కానీ మన దురదృష్టం ఏంటంటే, అవార్డులు వస్తే చప్పట్లు కొడతారు కానీ అవకాశాలు ఇవ్వరు. నేషనల్ అవార్డు విన్నర్ అయినా సరే, ఆయన తర్వాతి సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు మనోజ్ ఇబ్బందులు చూసిన సహ రచయిత దేవేంద్ర, తను దాచుకున్న డబ్బులన్నీ పెట్టి ఈ ప్రేమద ఊరాలి ప్రాజెక్ట్‌కు ప్రాణం పోశాడు. అలా ఎన్నో కష్టాలు పడి సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేశారు. మొదటి రోజు పెద్దగా సందడి లేదు. వచ్చింది కేవలం 9 లక్షలు మాత్రమే. కేవలం 60 స్క్రీన్స్‌లో సినిమా పడింది. కానీ అసలు మ్యాజిక్ అక్కడే మొదలైంది. ఈ సినిమాలోని తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఎమోషన్, కొడుకు పెళ్లి తర్వాత ఇంట్లోకి కోడలు వచ్చాక ఆ తండ్రి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్న పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో బయటకు వచ్చారు. అంతే, మౌత్ టాక్ తో జనం థియేటర్లకు క్యూ కట్టారు. రెండో వారానికి స్క్రీన్స్ పెరిగాయి, హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. చూస్తుండగానే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తూ ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో చేరిపోయింది.
సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ చేయడానికి కూడా వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. టీవీల్లో యాడ్స్ ఇవ్వలేరు. అప్పుడు వాళ్ళు ఒక వినూత్న ఆలోచన చేశారు. పెళ్లి ఆహ్వాన పత్రికల్లాంటి కార్డులను ముద్రించి, రోడ్ల మీద నిలబడి జనాలకు పంచుతూ తమ సినిమా చూడమని బతిమాలారు. వాళ్ళ కష్టం చూసి ఆటో డ్రైవర్లు కూడా కదిలిపోయారు. డబ్బులు తీసుకోకుండా తమ ఆటోల మీద పోస్టర్లు వేసుకుని ఊరంతా తిరుగుతూ ప్రమోట్ చేశారు. ఇలా ఒక మంచి సినిమాను ప్రజలే తమ భుజాల మీద వేసుకుని మోశారు. శ్రీరామ్, తపస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. కోట్లు కుమ్మరిస్తేనే సినిమాలు ఆడవు, గుండెను హత్తుకునే కథ ఉంటే జనాలు 50 కోట్లు కాదు, 100 కోట్లు కూడా ఇస్తారని ప్రేమద ఊరాలి మరోసారి నిరూపించింది.



