సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం…ఆ సందేశాలకు రిప్లై ఇవ్వొద్దు…!అప్రమత్తంగా ఉండాలన్న కమీషనర్ సజ్జనార్

డిజిటల్ యుగంలో సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో బురిడీ కొట్టిస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఓటీపీలు చెప్పుకున్నా అకౌంట్ ఖాళీ అవడం వంటి ఘటనలు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతున్నాయి. తాజాగా వాట్సాప్ లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'నో' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది. బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు. ఏ అనుమానాస్పద లింక్ ను కూడా క్లిక్ చేయలేదు. దీనిపై హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అప్రమత్తం చేశారు. ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం తన దృష్టికి వచ్చిందన్నారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇదని వివరించారు.
ఈ మోసం ఎలా జరుగుతోందో వివరించారు. మొదట గుర్తుతెలియని నంబర్ నుండి వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ మెసేజ్ పంపుతారు. ఆ వెంటనే మీ భయాన్ని ఆసరాగా చేసుకోని ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పెడతారు. డబ్బులు పోయాయన్నభయంతో మీరు ‘NO’ అని పెట్టిన వెంటనే ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. ఆ తరువాత మొబైల్ ఫోన్ పై పూర్తికంట్రోల్ తీసుకుని హ్యాకర్లు బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును లాగేస్తారని వివరించారు. దీని పట్ల అవగాహన కలిగిఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు 'YES' గానీ, 'NO' గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ బదులు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయాలని సూచించారు. అకౌంట్ లో డబ్బులు కట్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి అఫీషియల్ బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి డైరెక్ట్ గా చెక్ చేసుకోవాలని అంతేకాని వాట్సాప్ మెసేజ్ లు నమ్మవద్దని సూచించారు. ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదనే విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అలాగే ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే వెంటనే స్పందించి గోల్డెన్ అవర్‌లో '1930' సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
