హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ మెరుపుదాడి..!

మిడిల్ ఈస్ట్ అస్థిర పరిస్థితుల వేళ, ఇజ్రాయెల్ తన శత్రువులను ఏరివేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా టార్గెట్ గా భీకరమైన మెరుపు దాడులు చేసింది. సిరియా-లెబనాన్ సరిహద్దులో ఆయుధాలు రవాణా అవుతున్నాయన్న పక్కా సమాచారంతో రాత్రికి రాత్రే విరుచుకుపడింది. సిరియా-లెబనాన్ సరిహద్దు సమీపంలోని జాంటా ప్రాంతంపై ఐడీఎఫ్ రాత్రివేళ భారీ ఎటాక్ చేసింది. ఈ ప్రాంతం నుండి హిజ్బుల్లా కు అత్యంత ఆధునిక ఆయుధాలు, రాకెట్లు సరఫరా అవుతున్నాయనేది ఇజ్రాయెల్ నిఘా వర్గాల అనుమానం. అనుమానించినట్లే, అక్కడ భారీ ఆయుధాల నిల్వలను ఇజ్రాయెల్ డ్రోన్లు గుర్తించాయి. ఈ ఆయుధాలు గనక హిజ్బుల్లా స్థావరాలకు చేరితే, వారి సైనిక కార్యకలాపాల సామర్థ్యం భారీగా పెరుగుతుందని, అది ఇజ్రాయెల్‌కు పెను ముప్పుగా మారుతుందని గ్రహించిన ఐడీఎఫ్ ఫైటర్ జెట్స్తో విరుచుకుపడి ఆ ఆయుధాల కాన్వాయ్‌ను, స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ పౌరులు, తమ సైన్యంపై దాడులు చేసేందుకు హిజ్బుల్లాకు వీలు కల్పించే ఎలాంటి ఆయుధాలనైనా ఇలాగే నాశనం చేస్తామని ఈ ఎటాక్ తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఒకవైపు మిలిటరీ దాడులు సాగుతుండగానే.. ఇజ్రాయెల్ లోపల కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అక్టోబర్ 27న ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన నెస్సెట్ కు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 120 స్థానాలున్న ఈ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. కానీ ఎవరూ ఊహించని విధంగా, యుద్ధ సమయంలో దేశాన్ని నడిపిస్తున్న బెంజమిన్ నెతన్యాహూ కు ప్రజలు పూర్తిస్థాయి మద్దతు దక్కలేదు. ఆయన సారథ్యంలోని రైట్ వింగ్ కూటమికి కావాల్సిన మెజారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కేవలం కొన్ని సీట్ల దూరంలోనే నెతన్యాహూ కూటమి ఆగిపోయింది. సుదీర్ఘకాలం పాటు ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న నెతన్యాహూకు ప్రజలు అనూహ్య తీర్పు ఇచ్చారు. దేశ భద్రత, యుద్ధ వ్యూహాల విషయంలో ఆయన వ్యవహరించిన తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నెతన్యాహూను గద్దె దించడానికి ప్రతిపక్ష నేత గాడి ఐసెన్‌కోట్ వేగంగా పావులు కదుపుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఆయనకు ఇప్పుడు అరబ్ పార్టీల మద్దతు అత్యవసరంగా మారింది.
అయితే అరబ్ పార్టీలు ప్రతిపక్ష గాడి ఐసెన్కోట్కు ప్రభుత్వ ఏర్పాటులో బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గాడి ఐసెన్‌కోట్ గతంలో ఇజ్రాయెల్ సైన్యానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన అత్యంత అనుభవజ్ఞుడైన మిలిటరీ జనరల్. ఒక మాజీ మిలిటరీ జనరల్, అరబ్ పార్టీల మద్దతుతో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇజ్రాయెల్ విదేశాంగ విధానం ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న హమాస్, హిజ్బుల్లా యుద్ధాలకు ముగింపు పలికి శాంతి చర్చల వైపు అడుగులు వేస్తారా? లేక ఒక మాజీ సైనికాధికారిగా ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ముందుకు కదులుతారా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఎలా మారినా, దేశ భద్రత విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయి.



