3 రోజులు ఆకలితో పస్తులు..ఇళయరాజా కన్నీటి కథ తెలుసా?
కామెంట్లు (0)

సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత ప్రపంచంలో ఒక లెజెండ్. కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో ఆయన ఆరాధ్య దైవం. దశాబ్దాల తరబడి తన సంగీతంతో రాజ్యమేలిన ఇళయరాజా.. ఈరోజు ఒక రాజ్యసభ సభ్యుడిగా సగర్వంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకంటూ కోట్ల రూపాయల ఆస్తులు, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ, ఈ సంగీత జ్ఞాని ఆరంభ జీవితం గురించి, ఆయన పడ్డ కష్టాల గురించి ఇప్పటి తరానికి, ముఖ్యంగా జెన్-జీ జనరేషన్కు తెలీదు. ఆయన కడు పేదరికంలో పుట్టారు. తినడానికి తిండి లేక, కడుపు నింపుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. స్వయంగా ఇళయరాజా తాను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు, చైన్నె కు వచ్చిన కొత్తలో ఎలాంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో తెలిపారు. ఇళయరాజా స్వస్థలం తమిళనాడులోని పన్నైపురం అనే ఒక చిన్న గ్రామం. ఆయన అన్నయ్య పావలర్ వరదరాజన్ తో కలిసి ఊరూరా తిరుగుతూ, కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్స్ లో, గ్రామాల్లో పాటలు పాడుకుంటూ పొట్టపోసుకునే వారు. భుజాన ఒక హార్మోనియం పెట్టె వేసుకుని, అప్పటికే సంగీతంపై ఉన్న మక్కువతో ఏదో సాధించాలని కసిగా ఉండేవారు. సరిగ్గా 1958 ప్రాంతంలో, సినిమా రంగంలో ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని చెన్నై చేరుకోవడం తన సోదరుడు భాస్కర్, తన ప్రాణస్నేహితుడు, ప్రముఖ దర్శకుడు భారతీరాజాలు ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు పంచుకున్నారు.
మేము చెన్నైకి వచ్చిన 1958 ప్రాంతంలో ఒకసారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. తినడానికి కూడా చాలా కష్టపడ్డాం. నేను, నా సోదరుడు భాస్కర్, దర్శకుడు భారతీరాజా వరుసగా మూడు రాత్రుల పాటు ఏమీ తినకుండా పస్తులు ఉన్నాం. ఆకలితో కడుపు కాలిపోతోంది, ప్రాణం పోయేలా అనిపించింది. అని ఆయన ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలో వారికి ఒక విషయం తెలిసింది. వాళ్ళు ఉంటున్న లోకల్ ఏరియాలో, అంటే వడపళనిలోని ఆలయం ఎదురుగా ఉన్న దుకాణాల్లో నవరాత్రి సందర్భంగా పూజలు చేసి, ప్రసాదంగా అటుకులు, మరమరాలు, పప్పు బెల్లాలు ఉచితంగా పంచుతున్నారని వాళ్లకు తెలిసింది. ఇంకేముంది, ఆకలితో ఉన్న ఆ ముగ్గురూ వెంటనే ఆ గుడి వీధిలోకి పరిగెత్తారు. అక్కడ ఇళయరాజా, భాస్కర్, భారతీరాజా ప్రతి దుకాణం ముందు ఉన్న వరుసలో నిలబడ్డారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న సిగ్గు, భయం వాళ్లకు లేదు, ఎందుకంటే ఆకలి ముందు అవన్నీ చిన్నవిగా అనిపించాయి. అలా ప్రతి షాప్ ముందు క్యూలో నిలబడి, వాళ్లు పెట్టిన ఆ పప్పు బెల్లాలు, అటుకులు అన్నీ దోసిట్లో తీసుకుని, నేరుగా తమ రూమ్ కు వెళ్లారు. అక్కడ కింద ఒక పేపర్ పరుచుకుని, దానిపై ఆ పప్పు బెల్లాలను వేసుకుని, ముగ్గురూ కలిసి ఆకలి తీరా తిన్నారు. అలా ఆ నవరాత్రి ఉత్సవాల రోజుల్లో కేవలం ఆ ప్రసాదం తింటూనే తమ రోజులు గడిపామని ఇళయరాజా గారు గుర్తు చేసుకున్నారు.



