ఎవరీ గరివిడి లక్ష్మి ? ఈమె కథేంటి?
కామెంట్లు (0)

తెలుగునాట జానపద పాటలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ , ఉత్తరాంధ్ర విప్లవ కవి వంగపండు ప్రసాదరావు. కొన్ని దశాబ్దాల పాటు తమ ఆటపాటలతో ప్రజలను చైతన్య పరిచిన ఈ మహానుభావుల జీవిత చరిత్రలు ఇంతవరకు వెండితెరపై బయోపిక్ గా రాలేదు. కానీ, ఈ ఇద్దరు దిగ్గజాలకు దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళా జానపద కళాకారిణికి దక్కుతోంది. ఆమె పేరే గరివిడి లక్ష్మి . పల్లెటూరి జానపదాలను, బుర్ర కథలను తనదైన బాణీలో స్టేజ్ మీద ప్రదర్శించి 90వ దశకంలో యావత్ ఉత్తరాంధ్రను ఊపేసిన ఈ కళాకారిణి జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ఒక భారీ నిర్మాణ సంస్థ ఈ బయోపిక్ ను తెరకెక్కించింది. గరివిడి లక్ష్మి.. ఉత్తరాంధ్ర జానపద కళకు ఒక ప్రత్యేకమైన బాణీని, ఊపును అందించిన అద్భుతమైన కళాకారిణి. ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడి మండలంలోని గెడ్డపు వలస ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచే పాటల మీద ఉన్న మక్కువతో 1994లో ఆమె మొదటిసారి స్టేజీ ఎక్కి జానపద పాటలు, బుర్రకథలు చెప్పడం మొదలు పెట్టింది. ఆమె గొంతులో ఉన్న ఆ పల్లెటూరి స్వచ్ఛత, ఆ యాస జనాలకు విపరీతంగా నచ్చేసింది. చూస్తుండగానే ఆమె కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తన జీవితకాలంలో ఆమె దాదాపు పది వేలకు పైగా స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చిందని చెబుతారు. ఆ క్రేజ్ చూసి 1996లో శ్రీమాతా ఆడియో కంపెనీ ద్వారా ఆమె బుర్రకథలు, పాటలు క్యాసెట్లు, వీడియోల రూపంలో మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. చందమామా, ఓ అత్తరు సాయిబో రారా, రాతిరి నల్లోడా, నాను శ్రీకాకుళం జిల్లండి, పాలకొండ ఎళ్లిపోతా లాంటి జానపద గీతాలతో అప్పట్లో యువతను గరివిడి లక్ష్మి ఓ ఊపు ఊపేసింది. ఆమె పాటల్లో కాస్త ద్వంద్వార్థాలు ధ్వనించినప్పటికీ, మాస్ ఆడియన్స్ మాత్రం ఆ పాటలకు ఫిదా అయిపోయారు.
ఒకానొక దశలో గరివిడి లక్ష్మీ అనేది ఉత్తరాంధ్రలో ఒక పెద్ద బ్రాండ్ గా మారిపోయింది. పండగ వచ్చినా, జాతర వచ్చినా ఆమె పాట ఉండాల్సిందే. సరిగ్గా ఇక్కడే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమెకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి, ఆమె పేరును అడ్డం పెట్టుకుని ఎన్నో ఫేక్ ట్రూప్స్ బయలుదేరాయి. గరివిడి లక్ష్మికి చెందిన వారిగా చెప్పుకుని అనేకానేక ప్రోగ్రామ్స్ ఇచ్చి పొట్టపోసుకున్న వారు చాలామందే ఉన్నారు. మరోవైపు, ఆడియో క్యాసెట్లు సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత, అమాయకురాలైన గరివిడి లక్ష్మిని కొందరు స్వార్థపరులు దారుణంగా మోసం చేశారనే భావన తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. స్టేజ్ మీద రాణిగా వెలుగొందిన ఆ కళాకారిణి, తెర వెనుక ఎంతటి మానసిక క్షోభను అనుభవించిందో ఈ బయోపిక్ ద్వారా చూపించారు.
ఇంతటి ఎమోషనల్ జర్నీ ఉన్న గరివిడి లక్ష్మీ బయోపిక్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆనంది ఈ సినిమాలో గరివిడి లక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. గౌరి నాయుడు జమ్ము ఈ బయోపిక్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మి తల్లిగా సీనియర్ నటి రాశి పోషించగా, ఇతర కీలక పాత్రల్లో నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు నటించారు. చరణ్ అర్జున్ ఈ సినిమాకు అద్భుతమైన జానపద సంగీతాన్ని అందించారు. ఇదంతా పక్కన పెడితే.. అప్పట్లోనే గరివిడి లక్ష్మి పాటలు విన్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన పీపుల్స్ వార్ సినిమాలో ఆమెతో సోదోయమ్మ సోది అనే పాట పాడించడంతో పాటు, ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం కూడా ఇచ్చారు. అలానే గంగమ్మ జాతర సినిమాలో కూడా ఆమె ఒక పవర్ఫుల్ పాట పాడారు. ఈ అంశాలన్నీ సినిమాలో హైలైట్ అయ్యాయి.



