US లో మెగాస్టార్ సెన్సేషన్.. కాకా కోసం థమన్.. సంక్రాంతికి ఫ్యాన్స్ కు ఫుల్ జోష్

వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ అదే డైరెక్టర్ తో మెగాస్టార్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కాకా. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సినిమా టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. చిరంజీవితో కలిసి మూవీ సెట్స్ లో దిగిన ఒక మోనోక్రోమ్ ఫొటోను థమన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందులో ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు. డిసెంబర్ లో ఓ పాట రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ అమెరికాలో ఉండబోతున్నట్లు అఫీషియల్ గా లీక్ ఇచ్చారు. దీంతో చిరు యూఎస్ పర్యటనపై ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. టాలీవుడ్ హీరోలు కేవలం ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ కోసమో లేక సినిమా సక్సెస్ మీట్ కోసమో అమెరికా వెళ్తుంటారు. కానీ ఒక ఫస్ట్ సాంగ్ కోసం ఏకంగా మెగాస్టార్ తో అక్కడ ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారంటే.. అది మామూలు విషయం కాదు. అమెరికాలో ఉన్న ఎన్నారై మెగా అభిమానుల కోసం బాబీ, థమన్ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారని అర్థమవుతోంది. ఈ సాంగ్ లాంచ్ తోనే గ్లోబల్ వైడ్ గా సినిమా బజ్ ను పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ , గెటప్ శ్రీను, అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ లాంటి క్రేజీ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమా స్కేల్ ను మరింత పెంచేసింది. భారీ నిర్మాణ విలువలతో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో రిలీజ్ అయి ఎలాంటి గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ.. ఇప్పుడు మరోసారి అదే సంక్రాంతి సీజన్ లో కాకా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2027 జనవరి 13న కాకా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి అమెరికా పర్యటన తేదీ ఎప్పుడు, ఫస్ట్ సాంగ్ రిలీజ్ వేదిక ఎక్కడ, ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ లాంటి వివరాలపై ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డిసెంబర్ లో జరగనున్న ఈ ఈవెంట్ తో కాకా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.



