అనంత మేయర్ పీఠం..నీదా..? నాదా..?
అనంత మేయర్ పీఠం దక్కేదెవరికి..?మేయర్ కుర్చీ కోసం టీడీపీలో పోటీ…సీనియర్లు వర్సెస్ కొత్త ముఖాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. అనంతపురం నగర రాజకీయాల్లో మేయర్ పీఠం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకపోయినా.. అధికార కూటమిలోని ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా టీడీపీలో మేయర్ పదవిని ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేశామని.. కష్టకాలంలోనూ పార్టీని వీడలేదని.. ఇప్పుడు తమకు అవకాశం కల్పించాలని కొందరు సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారట. మరోవైపు రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో.. ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కవచ్చనే అంశంపై కూడా నేతలు లెక్కలు వేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆశావహుల ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు అనంతపురం నగరంపై పట్టు సాధించడం అధికార కూటమికి కీలకంగా మారనుందనే చర్చ సాగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ భారీ ఆధిక్యాన్ని సాధించిన నేపథ్యంలో.. ఈసారి నగరంలో తమ బలాన్ని చాటుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట.గత మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం నగరంలోని 50 డివిజన్లకు గాను 48 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక స్థానంలో సీపీఐ, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. అయితే ప్రస్తుతం నగరంలో డివిజన్ల సంఖ్య 62కు చేరడంతో.. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నేతృత్వంలో నగరంలోని అన్ని డివిజన్లలో కూటమి బలాన్ని పెంచుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వచ్చిన ఫలితాలను అధిగమించి.. ఈసారి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు నగరంపై పట్టు సాధించే ప్రయత్నాలతో పాటు.. మేయర్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశం కూడా టీడీపీలో కీలకంగా మారుతోందట. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎలాంటి అభ్యర్థిని బరిలోకి దించాలి..? సామాజిక సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి..? అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పలువురు నేతల పేర్లు మేయర్ రేసులో వినిపిస్తున్నాయట.మేయర్ పదవిని ఆశిస్తున్న నేతల విషయానికొస్తే.. బలిజ సామాజిక వర్గం నుంచి కొండవీటి భావన పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. ఇదే సామాజిక వర్గానికి చెందిన టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు జేఎల్ మురళి పేరు కూడా చర్చల్లో ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి సుధాకర్ యాదవ్ పేరు తెరపైకి వస్తోందట. టీడీపీ సీనియర్ నేత తలారి ఆదినారాయణ పేరు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక మేయర్ పదవి ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయితే.. లక్ష్మీనారాయణ వంటి నేతల పేర్లు పరిశీలనలోకి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు సన్నిహితంగా ఉండే మరో నేత పేరు కూడా తెరపైకి వస్తోందని ఇన్ సైడ్ టాక్. అయితే ఈ పేర్లపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, ప్రజల్లో ఉన్న గుర్తింపు.. ఆశావహుల ఎంపికలో కీలకంగా మారనున్నాయనే చర్చ సాగుతోంది. అయితే అభ్యర్థుల పేర్లపై జరుగుతున్న చర్చ ఒకవైపు ఉంటే.. మేయర్ ఎన్నికల విధానం కూడా పార్టీ నాయకత్వం నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉందట. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో గెలిచిన కార్పొరేటర్ల ద్వారా మేయర్‌ను ఎన్నుకునే విధానం ఉండేది. అయితే రాబోయే ఎన్నికల్లో మేయర్ ఎన్నికల విధానం ఎలా ఉండబోతుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలులోకి వస్తే.. ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతను ఎంపిక చేయడం మరింత కీలకంగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతకు అవకాశం ఇవ్వాలా..? లేక ప్రజాబలం ఉన్న నాయకుడిని బరిలోకి దించాలా..? అన్నది టీడీపీ నాయకత్వానికి సవాల్ గా మారే అవకాశం ఉందట. ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించే సామర్థ్యం.. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టు.. ప్రజల్లో అభ్యర్థికి ఉన్న ఆదరణ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు రిజర్వేషన్లు, ఎన్నికల విధానం, అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చిన తర్వాతే అసలు రాజకీయ లెక్కలు తేలనున్నాయి. దీంతో ఆశావహులంతా పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అనంతపురం మేయర్ పీఠం చుట్టూ అప్పుడే రాజకీయ వేడి మొదలైందనే చర్చ సాగుతోంది. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. బలిజ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందా..? బీసీ నేతకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? సీనియారిటీకి ప్రాధాన్యం దక్కుతుందా..? లేక ప్రజాబలం ఉన్న కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొస్తారా..? ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యూహం ఎలా ఉండబోతోంది..? గతంలో వైసీపీకి భారీ ఆధిక్యం లభించిన అనంతపురంలో ఈసారి కూటమి ఆధిపత్యం సాధిస్తుందా..? 62 డివిజన్లలో పట్టు సాధించాలన్న టీడీపీ వ్యూహం ఫలిస్తుందా..? మేయర్ పీఠం కోసం ఆశలు పెట్టుకున్న నేతల్లో చివరకు అదృష్టం ఎవరిని వరిస్తుంది..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రిజర్వేషన్లు, ఎన్నికల విధానం, అభ్యర్థుల ఎంపికపై అధికారిక స్పష్టత వచ్చిన తర్వాతే అనంత మేయర్ పీఠంపై అసలు లెక్కలు తేలనున్నాయి.


