అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…యూరియా ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం..!

దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్లో రైతులను వేధించే యూరియా కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో దేశీయ యూరియా ఉత్పత్తిని భారీగా పెంచేందుకు, ఏకంగా 54వేల కోట్ల అంచనా వ్యయంతో 6 భారీ బ్రౌన్‌ఫీల్డ్ గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పత్తి ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జులై 15, 2026న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఫర్ యూరియా కు ఆమోదం తెలిపింది. జులై 30న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పాలసీ కింద మొత్తం 18 ప్రతిపాదనలు రాగా, అందులో అత్యంత కీలకమైన 6 బ్రౌన్‌ఫీల్డ్ యూరియా ప్రాజెక్టులను కేంద్ర ఎరువుల శాఖ తాజాగా ఎంపిక చేసి ముందుకు తీసుకెళ్తోంది.ఈ ఆరు ప్రాజెక్టులు ప్రభుత్వ రంగం , ప్రైవేట్ రంగం సహకార రంగాల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.9వేల కోట్లు. మొత్తం ఆరు ప్రాజెక్టులకు రూ.54వేల కోట్లు ఖర్చు పెట్టనుంది . ఒక్కో ప్రాజెక్ట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు , మొత్తం ప్రణాళికా సామర్థ్యం ఏకంగా 76.2 లక్షల మెట్రిక్ టన్నులు . ఈ ప్రాజెక్టులన్నీ సహజ వాయువును ప్రధాన ఇంధనంగా ఉపయోగించి అమ్మోనియా, ఆపై యూరియాను తయారు చేస్తాయి. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంగణాల్లో వీటిని నిర్మిస్తుండటం వల్ల భూసేకరణ, మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గి, పనులు వేగంగా పూర్తవుతాయి.
ఇంతకీ ఈ రూ.54వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఆ ఆరు భారీ యూరియా ప్రాజెక్టులలో మొదటిది MFL-మద్రాస్, ఇది ప్రభుత్వ రంగ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ 60 ఏళ్లకు పైగా పాతదైన యూనిట్ స్థానంలో ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అత్యాధునిక ప్లాంట్‌ను నిర్మిస్తారు. రెండోది పంజాబ్ లోని NFL-నాంగల్ ఇది కూడా ప్రభుత్వ రంగ ప్రాజెక్ట్. 1978లో ఏర్పడి, 50 నుంచి 55 ఏళ్లుగా నడుస్తున్న పాత ప్లాంట్ స్థానంలో 12.7 LMT సామర్థ్యంతో కొత్త ఆధునిక యూనిట్ రానుంది.మూడోది ఉత్తరప్రదేశ్ లోని KFL-షాజహాన్‌పూర్ .. సహకార రంగ సంస్థ క్రిభ్కో ఆధ్వర్యంలో 1995లో ఏర్పడిన ప్లాంట్‌ను మరో 12.7 LMT సామర్థ్యంతో విస్తరిస్తారు. నాలుగోది పశ్చిమ బెంగాల్ లోని మ్యాటిక్స్-పనాగఢ్.. ప్రైవేట్ రంగంలో 2017లో ఏర్పడిన ఆధునిక ప్లాంట్‌లో మరో 12.7 LMT అదనపు యూనిట్ నిర్మిస్తారు. బెంగాల్ రాష్ట్ర ఎరువుల అవసరాలకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఐదవది రాజస్థన్ లోని CFCL-గడేపాన్ ... చంబల్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో 1994 నుంచి నడుస్తున్న కాంప్లెక్స్‌లో 12.7 LMT సామర్థ్యంతో విస్తరణ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఆరోది ఉత్తర ప్రదేశ్ లోని IIPL-జగదీష్పూర్ .. 1988లో ఏర్పడిన ఈ ప్రైవేట్ ప్లాంట్‌లోనూ అదనంగా 12.7 LMT యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని జోడించనున్నారు. ఈ ఆరింటిలో చెన్నై, నాంగల్ ప్లాంట్లు పాత యూనిట్ల స్థానంలో కొత్తవిగా వస్తుండగా, మిగిలిన నాలుగు అదనపు విస్తరణ ప్రాజెక్టులుగా రాబోతున్నాయి.



