మీరు గ్రేట్ సార్ అంటూ జగ్గూభాయ్ పై ప్రశంసల జల్లు

దశాబ్దాల సినిమా కెరీర్, పాన్ ఇండియా స్థాయిలో సెలెబ్రిటీ హోదా ఉన్నప్పటికీ.. ఆ హోదాను ఏమాత్రం తలకెక్కించుకోకుండా, ఒక సాధారణ మనిషిలా నిరాడంబరంగా జీవిస్తూ ప్రత్యేకతను చాటుకుంటుంటారు విలక్షణ నటుడు జగపతి బాబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ కోట్లాది మంది హృదయాలను హత్తుకుంటోంది. కష్టపడి పనిచేసే సామాన్య కార్మికులతో కలిసి, ఏమాత్రం భేషజం లేకుండా భోజనం చేశారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ జగ్గూభాయ్లో మీరు నిజంగా గ్రేట్ సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ సెట్లలో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ స్టార్ సెలబ్రిటీలు అంటే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. వారి కోసం విలాసవంతమైన ఏసీ క్యారవాన్లు, ప్రత్యేకంగా సిద్ధం చేసిన డైట్ ఫుడ్, చుట్టూ బౌన్సర్లు, హంగు ఆర్భాటాలు కనిపిస్తుంటాయి. సామాన్య కార్మికులు ఒకవైపు, సెలబ్రిటీలు మరోవైపు అన్నట్లుగా ఒక అదృశ్యమైన గోడ ఎప్పుడూ ఉంటుంది.కానీ జగపతి బాబు మాత్రం అలాంటి ఆడంబరాలకు, హోదా ప్రదర్శనలకు చాలా దూరంగా ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఆయన చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించే కార్మికుల కష్టాన్ని, వారి ఆకలిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న జగపతి బాబు.. వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ తెప్పించారు. అయితే చాలామంది చేసే విధంగా ఆ భోజనాన్ని ఎవరి చేతో పంచిపెట్టి, తను మాత్రం వెళ్లి క్యారవాన్‌లో కూర్చోలేదు. తన స్టార్‌డమ్‌ను, హోదాను పూర్తిగా పక్కన పెట్టి.. ఆ కార్మికులందరితో పాటే సామాన్యుడిలా ఎంతో ఆప్యాయంగా వారితో కలిసి భోజనం చేశారు . అయితే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే..కార్మికులకు బిర్యానీ తెప్పించిన జగ్గుభాయ్ తాను మాత్రం ఆ కార్మికులు తెచ్చిన టిఫిన్లలోని భోజనాన్ని ఆకులో వడ్డించుకుని మరీ ఆప్యాయంగా తిన్నారు. వారి ఇంట్లో వండిన వంటలను తాను వడ్డించుకునీ మరీ తినడం చూసి కార్మికులంతా ఆశ్చర్యపోయారు.
మనిషి చేసే పని చిన్నదైనా, పెద్దదైనా.. మనుషులందరూ సమానమే అన్న ఉన్నతమైన సంస్కారం ఆయన ప్రతి చేతలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనున్న కార్మికులకు కూడా ఇంత పెద్ద స్టార్ మనతో కలిసి భోజనం చేస్తున్నారే అన్న గౌరవం, ఆనందం వారి కళ్లల్లో కనిపించింది. అయితే, ఒక వ్యక్తిలో ఇంతటి పరిణతి, ఇంతటి స్థిరత్వం, ఇంతటి నిరాడంబరత ఒక్కరోజులో రావు. దాని వెనుక ఆయన జీవితంలో చూసిన ఎన్నో ఎత్తుపల్లాలు, అనుభవాలు నేర్పిన లోతైన జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. జగపతి బాబు సినీ ప్రస్థానాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక అద్భుతమైన స్ఫూర్తిగాథలా కనిపిస్తుంది. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు ఓ వెలుగు వెలిగారు. వరుస హిట్లతో, మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ తర్వాత ఆయన కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో తీవ్రమైన ఆటుపోట్లను, కష్టాలను ఎదుర్కొన్నారు. ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను చూశారు. అలాంటి క్లిష్ట సమయంలో చాలామంది కుంగిపోయి పరిశ్రమకు దూరమైపోతుంటారు. కానీ జగపతి బాబు మాత్రం ఓటమిని ఒప్పుకోలేదు. తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అప్పుడే లెజెండ్ సినిమాతో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత శక్తివంతంగా మొదలుపెట్టారు. అప్పటివరకు సాఫ్ట్ ఫ్యామిలీ హీరోగా చూసిన ప్రేక్షకులందరూ, లెజెండ్ లో ఆయన విలనిజం చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఒక్క నిర్ణయం ఆయన కెరీర్ దిశనే మార్చేసింది. ఆ తర్వాత జగపతి బాబు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరుస భారీ అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఓటీటీలో కూడా సక్సెస్ ఫుల్ గా సెలబ్రిటీ షోలను కూడా చేస్తున్నారు.



