తూర్పు సముద్రంలో…కిమ్ కొత్త ఆట..వణికిపోతున్న అమెరికా

ప్రపంచంలో ఏ దేశమైనా తమ ప్రజల ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల గురించి ఆలోచిస్తుంది. కానీ ఉత్తర కొరియా ఆలోచనా విధానం మాత్రం ఎప్పుడూ విధ్వంసం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా సరే, ఆ దేశ నియంత కిమ్ జంగ్ ఉన్ దృష్టి మాత్రం అణు ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణులపైనే ఉంటుంది. తాజాగా కొరియా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. ఉత్తర కొరియా మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ కొరియా, జపాన్‌లను, అలాగే పరోక్షంగా అమెరికాను భయపెట్టేలా.. వరుసగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. తూర్పు సముద్ర జలాల వైపు దూసుకెళ్లిన ఈ క్షిపణుల ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తర కొరియా తన ఆయుధ సంపదను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. అణు సామర్థ్యం కలిగిన ఆయుధాలను సిద్ధం చేసేందుకు ఆ దేశం చాలా ఏళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా ఇవాళ తూర్పు సముద్ర జలాల వైపు పలు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ అధికారికంగా వెల్లడించింది. దక్షిణ కొరియా సంయుక్త దళాల ప్రతినిధి జాంగ్ డో యంగ్ ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచి ఈ క్షిపణులను పరీక్షించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. గత కొన్నేళ్లుగా ప్యోంగ్యాంగ్లోని ప్రధాన విమానాశ్రయాన్నే ఉత్తర కొరియా తన కీలక లాంచింగ్ సైట్‌గా వాడుకుంటోంది. ఈ ప్రయోగంలో ఒక క్షిపణి ఏకంగా 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జాంగ్ డో యంగ్ వెల్లడించారు. అయితే మొత్తం ఎన్ని క్షిపణులను రాడార్లలో డిటెక్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ కొరియా మిలిటరీ గోప్యంగా ఉంచింది. ఈ క్షిపణుల ప్రయోగం వల్ల అత్యంత తీవ్రంగా భయపడుతున్న మరో దేశం జపాన్. ఎందుకంటే ఉత్తర కొరియా వదిలే మిస్సైల్స్ అన్నీ వెళ్లి పడేది జపాన్ సముద్ర జలాల సమీపంలోనే. ఇప్పుడు జపాన్ అధికారులు వెల్లడించిన వివరాలు ప్రపంచాన్ని మరింత కలవరపెడుతున్నాయి. ఈ క్షిపణి ప్రయోగాలపై జపాన్ డిప్యూటీ రక్షణ మంత్రి తకాశి కోయరి స్పందించారు. కేవలం 17 నిమిషాల వ్యవధిలోనే రెండు వేర్వేరు క్షిపణులను తమ రాడార్లు డిటెక్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో తొలి క్షిపణి సుమారు 220 కిలోమీటర్ల దూరం ప్రయాణించగా, రెండో క్షిపణి ఏకంగా 910 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ రెండు క్షిపణులు జపాన్ ఎకనామిక్ జోన్ బయటి ప్రదేశంలో ఉన్న జలాల్లో పడినట్లు తెలుస్తోంది. సముద్రంలో పడటం వల్ల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు గానీ, వాణిజ్య నౌకలకు గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ రెండో క్షిపణి ప్రయాణించిన వేగం, అది ప్రయాణించిన తీరును బట్టి చూస్తే.. ఉత్తర కొరియా బహుశా హైపర్సోనిక్ ఆయుధాన్ని పరీక్షించి ఉంటుందని జపాన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైపర్సోనిక్ క్షిపణులు శబ్ద వేగం కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణిస్తాయి. వీటిని ప్రపంచంలో ఏ రాడార్ కూడా సులభంగా ట్రాక్ చేయలేదు, అడ్డుకోలేదు. ఒకవేళ ఉత్తర కొరియా చేతికి నిజంగానే హైపర్సోనిక్ ఆయుధాలు వస్తే.. అది దక్షిణ కొరియా, జపాన్‌లకే కాదు అమెరికాకు కూడా అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది.
ఉత్తర కొరియా ఎప్పుడు పడితే అప్పుడు క్షిపణులను గాల్లోకి వదలదు. వాళ్లు చేసే ప్రతి ప్రయోగం వెనుక అమెరికాకు, తమ శత్రు దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలన్న కుట్ర దాగి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ప్రయోగం ఎందుకు చేసినట్లు? ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉంది. ఇటీవల దక్షిణ కొరియా, అమెరికాతో కలిసి భారీ ఎత్తున సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతోంది. తమ బోర్డర్ కు సమీపంలో అమెరికా బలగాలు మోహరించడాన్ని కిమ్ జంగ్ ఉన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అది తమ దేశంపై దాడి చేయడానికి జరుగుతున్న రిహార్సల్ గా ఉత్తర కొరియా భావిస్తోంది.
అమెరికా, దక్షిణ కొరియాలను భయపెట్టడానికే, తమ దగ్గర అణ్వాయుధాలను మోసుకెళ్లగల అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని ప్రపంచానికి చూపించడానికే కిమ్ ఇలా పదే పదే సముద్రంలోకి క్షిపణులను వదులుతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ, వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా చైనా, రష్యాల పరోక్ష మద్దతుతో కిమ్ తన మిస్సైల్ ప్రోగ్రామ్‌ను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇలా పదే పదే క్షిపణి ప్రయోగాలు చేయడం వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని అమెరికా, జపాన్ మొత్తుకుంటున్నా కిమ్ జంగ్ ఉన్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 910 కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణిని పరీక్షించారంటే.. జపాన్ లోని కీలక నగరాలన్నీ ఇప్పుడు ఉత్తర కొరియా టార్గెట్ రేంజ్ లోకి వచ్చేసినట్లే.
మొదట షార్ట్ రేంజ్ మిస్సైల్స్, తర్వాత ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ , ఇప్పుడు ఏకంగా హైపర్సోనిక్ వెపన్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా కిమ్ తన అమ్ములపొదిలో అణ్వాయుధాలను నింపుకుంటూ పోతుంటే.. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధానికి కొరియా ద్వీపకల్పమే కేంద్ర బిందువు అవుతుందేమో అన్న భయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ తాజా ప్రయోగంపై అమెరికా , ఐక్యరాజ్యసమితి ఎలా స్పందిస్తాయో, కిమ్ పై ఇంకెలాంటి కఠిన ఆంక్షలు విధిస్తాయో వేచి చూడాలి.



