వారణాసిలో రాముడిగా మహేశ్ బాబు విశ్వరూపం

బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన రామాయణ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. రిలీజైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. యానిమల్ లో అత్యంత వైలెంట్ క్యారెక్టర్ చేసిన రణ్‌బీర్ కపూర్.. ఈసారి అత్యంత ఆదర్శప్రాయమైన శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్న సందేహాలు మొన్నటి వరకు ఉండేవి. కానీ తన నటనతో రణ్‌బీర్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశాడు. అయితే రణ్‌బీర్ కపూర్ జస్ట్ శాంపిల్ మాత్రమే..అసలైన సర్ప్రైజ్ ముందుందని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎందుకంటే వెండితెరపైకి రాబోతున్న నెక్స్ట్ రాముడు మరెవరో కాదు..మహేశ్ బాబే. దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న వారణాసిలో మహేశ్ బాబును ఒక ఎపిసోడ్లో శ్రీరాముడిగా చూపించబోతున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా మొత్తం రామాయణం కాదు. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ , ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ అని అందరికీ తెలుసు. కానీ, ఈ వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఒక కీలకమైన ఎపిసోడ్లో మహేశ్ బాబును శ్రీరాముడిగా రాజమౌళి చూపించబోతున్నారట. సినిమా మొత్తం రాముడి పాత్ర లేకపోయినప్పటికీ.. ఆ వచ్చే 20 నిమిషాల ఎపిసోడ్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ మామూలుగా ఉండదని ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్యారెక్టర్‌ను, ఆ ఎపిసోడ్‌ను జక్కన్న డిజైన్ చేసిన విధానం అత్యద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ నుంచి లీక్ అయిన సమాచారం. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఎవరూ చూపించని ఒక కొత్త కోణంలో మహేశ్ బాబు అందులో కనిపిస్తారని, కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే సినిమాను పది సార్లు చూసేలా రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది.



