నానికి సారీ చెప్పిన సూర్య..కారణమిదే!

నేచురల్ స్టార్ నానికి సారీ చెప్పిన సూర్య అనగానే.. హీరో సూర్య అనుకుంటే తప్పులోకాలేసినట్టే. మరి.. ఎవరంటారా.. ఎస్.జె. సూర్య. అవును.. ఎస్.జె.సూర్య సోషల్ మీడియా వేదికగా నానికి సారీ చెప్పాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంతకీ.. నానికి సూర్య ఎందుకు సారీ చెప్పాడు. అసలు ఏమైంది అనుకుంటున్నారా..? అయితే… ఈ వీడియో చూడాల్సిందే.

దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఎస్.జె.సూర్య ఆతర్వాత యాక్టర్ గా మారిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనదైన స్టైల్ లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. ట్విట్టర్ ద్వారా నేచురల్ స్టార్ నానికి సారీ చెబుతూనే ఆకాశానికి ఎత్తేశాడు. ఓ వైపు తెలుగు, మరో వైపు తమిళ్ లో సినిమాలు చేస్తున్న సూర్య.. నాని నటించిన సరిపోదా శనివారం సినిమాలో వావ్ అనిపించేలా విలనిజం పండించారు. అవినీతపరుడైన పోలీష్ అధికారి పాత్రలో అందర్నీ భయపెట్టాడు. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ పాత్రకు గాను గొప్ప గుర్తింపు లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ సహాయ నటుడుగా ఎస్.జె.సూర్యను ఎంపిక చేశారు.

ఎస్.జె.సూర్యకు ఉత్తమ సహాయ నటుడుగా అవార్డ్ వచ్చినందుకు గాను నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియచేశాడు. మీరు ఈ సినిమాకి సహాయ నటుడు మాత్రమే కాదు.. మీరు అన్నీ. ఈ అవార్డ్ కు మీరు అన్ని విధాల అర్హులు అంటూ సూర్య పై ప్రశంసలు కురిపించారు నాని. అయితే.. ఆ టైమ్ లో సినిమా పనుల్లో బిజీగా ఉన్న సూర్య థ్యాంక్స్ అంటూ ఒక్క ముక్కలో రిప్లై ఇచ్చారు. ఆతర్వాత ఇలా ఒక్క ముక్కలో చెప్పడం సరైన పద్దతి కాదని రియలైజ్ అయిన సూర్య నానికి సారీ చెబుతూ మరో ట్వీట్ చేశారు. మై డియర్ నేచురల్ స్టార్ నాని అంటూ ట్వీట్ మొదలుపెట్టిన సూర్య తనని క్షమించాల్సిందిగా నానిని కోరారు.

షూటింగ్ లో బిజీగా ఉండడం వలన అభినందలన పై సరిగా స్పందించలేకపోయాను అంటూ స్పందించారు. మీకు కేవలం థ్యాంక్స్ అంటూ చెప్పడం సరికాదని.. మీరు, దర్శకుడు వివేక్ సపోర్ట్ చేయకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదన్నారు. నాని తెర పై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా హీరోనే. మీ అభినందనలనకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియచేశారు సూర్య. అయితే.. సూర్య చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సూర్య ఇలా స్పందించడం గురించి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఇందులో నానిని ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా చూపించబోతున్నాడు. ఈ మూవీతో నాని మరో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.