
ఎటు చూసిన ప్రైవేటు ఉద్యోగాలు.. అవి అందించే ప్రైవేటు కంపెనీలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. ఈ కార్పొరేట్ యుగంలో.. వర్క్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫలానా సంస్థలో ఉద్యోగం అంటే.. పని పట్ల ఆసక్తి, నిబద్ధత, కఠోర శ్రమ కనబరిచేవారు. ఇప్పుడు కొత్త కల్చర్ కి తెర తీస్తూ వింత పోకడలతో ఉద్యోగం పంథానే మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇదివరకే ఉద్యోగంలో కొనసాగుతున్నవారు.. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం:
- జీవితంలో సక్సెస్ అయ్యేందుకు కష్టపడి పనిచేయడమే ప్రధానం. కాకపోతే ఈ సూత్రం అన్నిసార్లూ వర్కవుట్ కాకపోవచ్చు. కెరీర్లో డెవలప్ అయ్యేందుకు కష్టానికి తోడుగా ఆఫీస్లో మంచి నెట్వర్క్ ఏర్పర్చుకోవడం, తెలివిగా పనిచేయడం కూడా అవసరమవుతాయి. అదే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ముఖ్యం అన్నమాట.
- కంపెనీలో మీరెంత కష్టపడి పనిచేసినా, ఎంత విలువైన వ్యక్తి అయినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా.. ఎప్పుడో ఓసారి రిజైన్ చేయక తప్పదు. అందుకే అటువంటి కష్ట సమయాలను ఎదుర్కోవడానికి అన్నివేళలా సెకండ్ ఆప్షన్ తరహా బ్యాకప్ ప్లాన్ రెడీగా ఉంచుకోవాలి.
- ఉద్యోగంలో ప్రవేశించేందుకు డిగ్రీ గ్రాడ్యుయేషన్ ముఖ్యం. కానీ కెరీర్లో దూసుకుపోయే విషయంలో మీ స్కిల్స్, నాలెడ్జ్ చాలా కీలకమని గుర్తుంచుకోండి.
- ఆఫీసుల్లో రాజకీయాలను అన్నిసార్లూ తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వాటినుంచి దూరంగా పోయే బదులు కోఎంప్లాయీస్ తో సామరస్యం కోల్పోకుండా మీకు ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా ఫేస్ చేయడం నేర్చుకోండి.
- కార్పొరేట్ ప్రపంచంలో మీకేం తెలుసు అనే దానికంటే మీకు ఎవ్వరు తెలుసు అనే అంశం కూడా మెయిన్ థింగ్. కాబట్టి మీ తోటివారితో బలమైన వృత్తిగత సంబంధాలను ఏర్పర్చుకోండి.
- కొంతమంది మిమ్మల్ని కంపెనీకి కీ రోల్ పోషించే వారీగా ట్రీట్ చేస్తూ చెప్పొచ్చు. అంతమాత్రాన మిమ్మల్ని వేరెవ్వరూ భర్తీ చేయలేరని అతి విశ్వాసానికి మాత్రం పోకూడదు. అణకువగా, ఇతరులు మిమ్మల్ని ఫాలో అయ్యేవిధంగా నడుచుకోవాలి. హానెస్ట్ గా మీ రెస్పాన్స్ బిలిటీస్ ను నిర్వర్తించాలి. ఫైనల్ గా మీ విజయాలు మిమ్మల్ని అహంభావిగా మార్చకుండా జాగ్రత్తపడాలి.
- కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తేనే సక్సెస్ అవుతాం అలాగనీ పూర్తిగా పనికే పరిమితం కావొద్దు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను మనసారా ఆస్వాదించాలి.
- వృత్తి జీవితంలో ఒడుదొడుకులు, ఎత్తుపల్లాలు చాలా కామన్. కాబట్టి మీరు అనుకున్నట్టు జరగలేదని బాధ తగదు. బదులుగా మీ పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. పనిలో మెరుగుపడాలి.
- ఉద్యోగులకు తామెంత వేతనం ఇవ్వగలమనేదాని గురించే సంస్థలు ఆలోచిస్తాయి. కాబట్టి మీకు తగిన మొత్తం గురించి యాజమాన్యంతో చర్చించాలి. మీ సామర్థ్యం గురించి మీరు వారికి నమ్మకం కలిగించాలి.